Telugu Global
National

కేరళలో అమానుషం.... విద్యార్థినులకు అవమానం

కేరళలో నీట్ పరీక్ష రాయడానికి వెళ్ళిన విద్యార్థినుల 'లోదుస్తులు' విప్పించి దారుణంగా అవమానించారు. విషయం బైటికి పొక్కడంతో కళాశాల యాజమాన్యం తమకేం తెలియదని తప్పించుకునే ప్రయత్నాలు ప్రారంభించింది.

కేరళలో అమానుషం.... విద్యార్థినులకు అవమానం
X

కేరళలోని కొల్లం జిల్లాలో జరిగిన దారుణం దిగ్భ్రాంతికి గురి చేస్తోంది. అక్కడి చదనమగళ ప్రాంతంలోని ఓ కేంద్రంలో జరుగుతున్న నీట్ పరీక్షకు హాజరైన విద్యార్థినులను వారి లోదుస్తులను తొలగించాల్సిందిగా సిబ్బంది ఆదేశించారట. మార్తోమా ఇన్స్ టి ట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ సెంటర్ అనే ఈ కేంద్ర నిర్వాహకుల తీరుపై విద్యార్థినుల తలిదండ్రులు ఆగ్రహంతో రెచ్చిపోయారు. నీట్ పరీక్ష రాసేముందు సుమారు 90 మంది విద్యార్థినులకు జరిగిన ఘోర అవమానమిదని వారు వాపోయారు. పరీక్ష గది బయట కుప్పలుగా బాలికల లో దుస్తులు కనిపించాయని ఓ విద్యార్థిని తండ్రి తెలిపాడు. తమ పిల్లలకు జరిగిన అవమానంపై చాలామంది పేరెంట్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన కూతురు పడిన ఆవేదన, ఆందోళన చెప్పజాలమని, బలవంతంగా ఆమె లోదుస్తులను విప్పించి ఆమెను ఘోర మానసిక క్షోభకు గురి చేశారని బాధిత బాలిక తండ్రి చెప్పారు. ఆమె పరీక్ష సరిగా రాయలేకపోయిందన్నారు. తమ ఆదేశాలు పాటించకపోతే పరీక్ష రాసేందుకు అనుమతించబోమని నిర్వాహకులు హెచ్చరించారని ఆయన చెప్పాడు. కాగా ఇలా లో దుస్తులు విప్పాలని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎలాంటి నిబంధన పెట్టలేదని ఆయన పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో తెలిపారు. అనేకమంది విద్యార్థినులు రోదిస్తూ ఈ సెంటర్ నుంచి బయటకు వచ్చారని ఆయన పేర్కొన్నారు. పరీక్ష అయిపోయాక కళాశాల యాజమాన్యం అనేక అట్టపెట్టెల్లో లో దుస్తులను నింపి బైటపడేశారని విద్యార్థినులు ఆరోపిస్తున్నారు.

అయితే మార్తోమా కేంద్ర యాజమాన్యం మాత్రం ఇలాంటి ఆదేశాలను తమ సిబ్బందిలో ఎవరూ ఇవ్వలేదని బుకాయిస్తోంది. బయో మెట్రిక్ అటెండెన్స్ నోటింగ్ విధానంలో ఈ విధమైన రూల్ లేదని, అసలు ఈ నిబంధనలకు సంబంధించి తమకెలాంటి క్లూ లేదని వారు తెలిపారు. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ స్టాఫ్ ఈ విషయాన్ని చూసుకోవాలని, చెక్ చేయాలని వారు ఆ కేంద్రం మీద నెపం నెట్టివేశారు. పైగా కొంతమంది విద్యార్థినులకు తామే శాలువాలు ఇచ్చామని తెలిపారు.

నీట్ పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు ధరించే దుస్తుల్లో ఎలాంటి మెటల్ ఉండకూడదని అలా ఉంటే వారిని పరీక్ష హాలులోకి అనుమతించే ప్రసక్తి లేదని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ బులెటిన్ పేర్కొంటోంది. అలాగే పెద్ద పెద్ద బటన్లు ఉన్న దుస్తులను కూడా నిషేధించినట్టు స్పష్టం చేసింది. కేరళలోని డ్రెస్ కోడ్ పై లోగడ కూడా ఇలాంటి వివాదమే తలెత్తింది. లోగడ కన్నూర్ లో ఓ విద్యార్థిని దాదాపు ఇలాంటి చేదు అనుభవాన్ని ఎదుర్కొంది. తాను ధరించి వచ్చిన దుస్తులపై పరీక్ష కేంద్రం నిర్వాహకులు అడ్డు చెప్పారని, వాటిని మార్చుకు రావాలని కోరడంతో .. ఆరోజు ఆదివారం కావడంవల్ల దగ్గరలో ఎలాంటి దుస్తుల షాపు లేని కారణంగా రెండు కిలోమీటర్ల దూరం నడిచి వెళ్లి ఓ బట్టల షాపులో కొత్త దుస్తులు కొనాల్సి వచ్చిందని ఆమె బావురుమంది. ఇక కొల్లం ఘటనలో జరిగిన ఉదంతపై అధికారులు విచారణకు ఆదేశించినట్టు తెలుస్తోంది.




First Published:  18 July 2022 2:14 PM GMT
Next Story