Telugu Global
National

కేంద్ర మంత్రుల్లో ఇద్ద‌రి శాఖ‌ల మార్పు.. - కేబినెట్ హోదా లేకుండా స్వ‌తంత్ర మంత్రికి న్యాయ‌శాఖ అప్ప‌గింత‌

అర్జున్ మేఘ్వాల్ ప్రస్తుతం పార్లమెంటరీ వ్యవహారాల శాఖ, సాంస్కృతిక శాఖ సహాయ మంత్రిగా ఉండగా.. ఇకపై వీటితో పాటు న్యాయశాఖకు స్వతంత్ర మంత్రిగా వ్యవహరించనున్నారు.

కేంద్ర మంత్రుల్లో ఇద్ద‌రి శాఖ‌ల మార్పు.. - కేబినెట్ హోదా లేకుండా స్వ‌తంత్ర మంత్రికి న్యాయ‌శాఖ అప్ప‌గింత‌
X

కేంద్ర మంత్రుల్లో ఇద్ద‌రి శాఖ‌ల‌ను మార్పు చేస్తూ మోడీ స‌ర్కారు నిర్ణ‌యం తీసుకుంది. న్యాయశాఖ మంత్రిగా ఉన్న కిరణ్ రిజిజును ఆ బాధ్యతల నుంచి తొలగించింది. కేంద్ర సహాయ మంత్రి అర్జున్ రామ్‌మేఘ్వాల్‌కు న్యాయ‌ మంత్రిత్వ శాఖ అదనపు బాధ్యతలను అప్పగించింది. ఇక రిజిజుకు భూ విజ్ఞానశాస్త్ర శాఖ బాధ్యతలను అప్పగిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు రాష్ట్రపతి భవన్ నుంచి గురువారం ఓ ప్రకటన వెలువడింది. ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ స‌ల‌హా మేర‌కు రాష్ట్ర‌ప‌తి ద్రౌప‌దీ ముర్ము ఈ మార్పులు చేసిన‌ట్టు రాష్ట్ర‌ప‌తి భ‌వ‌న్ ఆ ప్ర‌క‌ట‌న‌లో తెలిపింది.

ఇదే తొలిసారి..

అర్జున్ మేఘ్వాల్ ప్రస్తుతం పార్లమెంటరీ వ్యవహారాల శాఖ, సాంస్కృతిక శాఖ సహాయ మంత్రిగా ఉండగా.. ఇకపై వీటితో పాటు న్యాయశాఖకు స్వతంత్ర మంత్రిగా వ్యవహరించనున్నారు. కేబినెట్ హోదా లేకుండా న్యాయశాఖను స్వతంత్ర మంత్రికి అప్పగించడం ఇటీవలి కాలంలో ఇదే తొలిసారి కావడం గమనార్హం. మరోవైపు ప్రస్తుతం భూవిజ్ఞాన శాస్త్ర శాఖ బాధ్యతలను కేంద్రమంత్రి జితేంద్ర సింగ్ చూస్తుండగా.. ఇప్పుడు ఆ శాఖను కిరణ్ రిజిజుకు అప్పగించారు. జితేంద్ర సింగ్ వద్ద ఇప్పటికే శాస్త్ర, సాంకేతికాభివృద్ధితో పాటు పలు శాఖలు ఉన్నాయి.

కొలీజియం వ్య‌వ‌స్థ‌పై వ్యాఖ్య‌ల నేప‌థ్యంలోనే..?

న్యాయ‌మూర్తుల నియామ‌కానికి సంబంధించి కొలీజియం వ్య‌వ‌స్థ‌పై కిర‌ణ్ రిజిజు గ‌తేడాది న‌వంబ‌ర్‌లో కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. కొలీజియంలో ప్ర‌భుత్వ ప్ర‌తినిధుల‌ను చేర్చాల‌ని అప్ప‌ట్లో ఆయ‌న అభిప్రాయం వ్య‌క్తం చేశారు. ఈ నేప‌థ్యంలోనే సుప్రీంకోర్టు, కేంద్రం మ‌ధ్య అభిప్రాయ భేదాలు త‌లెత్తాయి. ఈ ప‌రిణామాల నేప‌థ్యంలో కేంద్ర న్యాయ‌శాఖ మంత్రి శాఖ మార్పు చేయ‌డం ప్రాధాన్య‌త సంత‌రించుకుంది.

వచ్చే ఏడాది లోక్‌స‌భ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ మార్పులు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఇక, అర్జున్ రామ్ మేఘ్వాల్.. రాజస్థాన్ నుంచి ఎంపీగా ఉన్నారు. ఈ ఏడాది చివర్లో రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.

First Published:  18 May 2023 8:35 AM GMT
Next Story