Telugu Global
National

బీజేపీని ఇరుకున పెట్టిన ఖుష్బూ ఇంటర్వ్యూ..

బిల్కిస్ బానో ఘటనపై రేపిస్ట్ ల క్షమాభిక్షకు వ్యతిరేకంగా మాట్లాడిన ఏకైక బీజేపీ నేత ఖుష్బూయే కావడం విశేషం. ఇంటర్వ్యూలో తన నిజజీవిత ఘటనలను కూడా గుర్తు చేసుకుని ఖుష్బూ బాధపడ్డారు.

బీజేపీని ఇరుకున పెట్టిన ఖుష్బూ ఇంటర్వ్యూ..
X

బీజేపీ నేత ఖుష్బూ సొంత పార్టీని ఇరుకున పెట్టేలా ఓ ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ మాటకొస్తే పార్టీ వేరు, మానవ సంబంధాలు, ప్రతిస్పందనలు వేరు అంటున్నారామె. బిల్కిస్ బానో ఉదంతంపై బీజేపీ నేతలు కూడా పెదవి విప్పాలన్నారు. సినీ తారలు, సెలబ్రెటీలు ఈ విషయంలో సైలెంట్ గా ఉండటం సరికాదన్నారు. ఓ మీడియా ఛానెల్ కు ఖుష్బూ ఇచ్చిన ఇంటర్వ్యూ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. బిల్కిస్ బానోకి మద్దతుగా ఆమె చేసిన వ్యాఖ్యలు బీజేపీని ఇరుకున పెట్టేలా ఉన్నాయి.

బీజేపీనుంచి ఏకైక నేత..

రేపిస్ట్ లకు క్షమాభిక్షపెట్టడంతో గుజరాత్ ప్రభుత్వాన్ని వైరి వర్గాలు ఏకిపారేస్తున్నాయి. బీజేపీ పాలిత రాష్ట్రంలో, స్వాతంత్ర దినోత్సవ వేళ ఈ దారుణం ఏంటని మండిపడుతున్నాయి. రేపిస్ట్ ల విడుదల తర్వాత వారికి స్వాగత సత్కారాలు ఈ మంటను మరింత పెంచాయి. గుజరాత్ ప్రభుత్వాన్ని పూర్తిగా ఇరుకున పెట్టేలా పరిస్థితులున్నాయి. సుప్రీంకోర్టు కూడా గుజరాత్ ప్రభుత్వానికి నోటీసులివ్వడంతో ఈ వ్యవహారం మరో మలుపు తిరిగింది. అయినా కూడా బీజేపీ అధిష్టానం ఎక్కడా నోరు మెదపలేదు. బిల్కిస్ బానో ఘటనపై రేపిస్ట్ ల క్షమాభిక్షకు వ్యతిరేకంగా మాట్లాడిన ఏకైక బీజేపీ నేత ఖుష్బూయే కావడం విశేషం. ఇంటర్వ్యూలో తన నిజజీవిత ఘటనలను కూడా గుర్తు చేసుకుని ఖుష్బూ బాధపడ్డారు. దీనిపై మౌనం మంచిది కాదన్నారు. నా కూతుళ్లకోసం, మన భావితరాలకోసం తాను బయటకొచ్చి మాట్లాడుతున్నానని అన్నారు ఖుష్బూ.

ఖుష్పూకి ప్రశంసలు..

బీజేపీలో ఉండి కూడా తమ పార్టీ నిర్ణయాన్ని వ్యతిరేకించినందుకు ఖుష్పూని ప్రశంసల్లో ముంచెత్తారు కాంగ్రెస్ నేత శశిధరూర్. "అత్యాచారం, వేధింపులతో గాయపడిన మహిళకు న్యాయం జరగాలి. ఈ దారుణాలతో ప్రమేయం ఉన్న ఏ ఒక్కరూ విడుదల కాకూడదు. అలా ఎక్కడైనా జరిగితే.. అది మానవాళికి, స్త్రీజాతికి అవమానకరం. బిల్కిస్ బానోనే కాదు, బాధిత మహిళలందరికీ రాజకీయాలు, సిద్ధాంతాలకు అతీతంగా మద్దతు దక్కాలి" అంటూ ఖుష్బూ గతంలో చేసిన ట్వీట్ ని ఆయన రీట్వీట్ చేస్తూ అభినందనలు తెలిపారు. పార్టీకోసం కాకుండా, సరైన కారణం కోసం ఖుష్బూ నిలబడటం గర్వంగా ఉందన్నారాయన. మరి దీనిపై బీజేపీ స్పందన ఎలా ఉంటుందో చూడాలి. ఇప్పటికే తేలుకుట్టిన దొంగల్లా ఉన్న బీజేపీ నేతలు ఎక్కడా నోరు మెదపడంలేదు. ప్రసంగ పాండిత్యమే కానీ, చేతల్లో మానవత్వం లేదని నిరూపించుకున్నారు. సుప్రీంకోర్టు నోటీసుల తర్వాత కూడా దీనిపై కాషాయదళం స్పందించడంలేదు. "ఇక వారు చేయగలిగిందల్లా ఒక్కటే.. క్షమాభిక్ష రద్దు చేసిన తర్వాత రేపిస్ట్ లకు మంగళహారతులిచ్చి జైల్లోకి పంపించడమే"నని సోషల్ మీడియాలో సెటైర్లు పడుతున్నాయి.

First Published:  27 Aug 2022 3:21 AM GMT
Next Story