Telugu Global
National

బీజేపీ ఒక కుక్కను కూడా కోల్పోలేదు.. ఖర్గే వ్యాఖ్యల రచ్చ

పార్లమెంట్‌ బయట చేసిన వ్యాఖ్యలపై సభలో చర్చ జరగాల్సిన అవసరం లేదన్నారు మల్లికార్జున్ ఖర్గే. కానీ బీజేపీ మాత్రం కుక్కలు అనే మాటని తట్టుకోలేకపోయింది. ఖర్గే క్షమాపణ చెప్పాల్సిందేనంటూ డిమాండ్ చేస్తోంది.

బీజేపీ ఒక కుక్కను కూడా కోల్పోలేదు.. ఖర్గే వ్యాఖ్యల రచ్చ
X

దేశం కోసం కాంగ్రెస్ ఎంతో చేసిందని, బీజేపీ అసలేం చేసిందని ప్రశ్నించారు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే. ''దేశం కోసం కాంగ్రెస్‌ ఎంతో చేసింది. ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీతోపాటు మరెందరో కాంగ్రెస్ నాయకులు ప్రాణ త్యాగాలు చేశారు. దేశం కోసం బీజేపీ కనీసం ఒక్క కుక్కని కూడా కోల్పోలేదు. అయినా కూడా తాము దేశభక్తులమంటూ బీజేపీ నేతలు కబుర్లు చెబుతుంటారు. కాంగ్రెస్ నేతలు నోరు తెరిస్తే, దేశద్రోహులుగా ముద్ర వేస్తారు'' అంటూ ఖర్గే తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇటీవల సరిహద్దుల్లో భారత్-చైనా సైన్యం మధ్య జరిగిన ఘర్షణ, ఆ తర్వాత రాహుల్ గాంధీ వ్యాఖ్యలకు బీజేపీ కౌంటర్లు ఇవ్వడంతో ఖర్గే ఈ వ్యాఖ్యలు చేశారు. దేశం గురించి మాట్లాడే అర్హత బీజేపీ నేతలకు లేదన్నారు. కనీసం వారిలో ఎవరైనా త్యాగాలు చేశారా అని ప్రశ్నించారు. ఈ సందర్భంలోనే ఆయన కుక్క అనే మాటను వాడారు. దీంతో బీజేపీకి చిర్రెత్తుకొచ్చింది.

సభలో రభస..

ఖర్గే వ్యాఖ్యలపై రాజ్యసభ దద్దరిల్లింది. ఖర్గే క్షమాపణలు చెప్పాలని డిమాండ్‌ చేస్తూ బీజేపీ మంత్రులు, ఎంపీలు ఆందోళనకు దిగారు. కొందరు బల్లలు ఎక్కి మరీ రచ్చ చేశారు. దీంతో రాజ్యసభ చైర్మన్ జగ్ దీప్ ధన్ కర్ కి కోపం వచ్చింది. సభలో ఇలాంటి ప్రవర్తన సరికాదని హెచ్చరించారాయన. ప్రజలు మనల్ని చూసి నవ్వుకుంటున్నారని అన్నారు. పార్టీల మధ్య అభిప్రాయ భేదాలు ఉండొచ్చు కానీ, ఒకరు మాట్లాడుతుంటే, ఇంకొకరు ఆటంకం కలిగించే పరిస్థితి రాకూడదని చెప్పారు. మనం చిన్న పిల్లలం కాదు కదా అంటూ మండిపడ్డారు.

క్షమాపణ చెప్పేది లేదు..

మల్లికార్జున్ ఖర్గే క్షమాపణ చెప్పాలంటూ మంత్రి పీయూష్ గోయల్ సహా పలువురు రాజ్యసభలో డిమాండ్ చేశారు. అటు లోక్ సభలోనూ ఈరోజు ఇదే అంశంపై బీజేపీ నేతలు నిరసన ప్రదర్శన చేపట్టారు. అయితే రాజ్య సభలో వినిపించిన డిమాండ్లని తేలిగ్గా తీసిపారేశారు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే. పార్లమెంట్‌ బయట చేసిన వ్యాఖ్యలపై సభలో చర్చ జరగాల్సిన అవసరం లేదన్నారు. 'భారత్‌ జోడో యాత్ర'లో భాగంగా రాజస్థాన్‌ లోని అల్వార్‌ లో జరిగిన ర్యాలీలో ఖర్గే ఈ వ్యాఖ్యలు చేశారు. దీనిపై రాజ్యసభలో గొడవ జరగడం సరికాదని చాలామంది తమ అభిప్రాయం వెలిబుచ్చారు. కానీ బీజేపీ మాత్రం కుక్కలు అనే మాటని తట్టుకోలేకపోయింది. ఖర్గే క్షమాపణ చెప్పాల్సిందేనంటూ డిమాండ్ చేస్తోంది.

First Published:  20 Dec 2022 10:32 AM GMT
Next Story