Telugu Global
National

కేర‌ళ : NIA దాడులు,అరెస్టుల‌కు నిర‌స‌న‌గా PFI బంద్ హింసాత్మకం

తమ సంస్థ కార్యకర్తలపై NIA దాడులు,అరెస్టుల‌కు నిర‌స‌నగా కేరళలో PFI ఈ రోజు బంద్ కు పిలుపునిచ్చింది. అయితే అనేక చోట్ల ఆ బంద్ హింసాత్మకంగా మారింది.

కేర‌ళ : NIA దాడులు,అరెస్టుల‌కు నిర‌స‌న‌గా PFI బంద్ హింసాత్మకం
X

దేశ వ్యాప్తంగా NIA త‌మ‌పై జ‌రుపుతున్న దాడుల‌కు నిర‌స‌న‌గా పాపుల‌ర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా(PFI) శుక్ర‌వారంనాడు కేర‌ళ‌లో త‌ల‌పెట్టిన బంద్ హింసాత్మ‌కంగా మారింది. ఈ ఉద‌యం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రాంతాల‌లో ఆ సంస్థ‌ కార్య‌క‌ర్త‌లు గుమికూడి కేర‌ళ ఆర్టీసీ బస్సులు సహా వివిధ వాహ‌నాల‌పై రాళ్ళ‌ దాడులు చేశారు. దుకాణాలను మూయించారు. PFI సంస్థ‌కు ఉగ్ర‌వాద లింకులు ఉన్నాయ‌న్న ఆరోప‌ణ‌ల‌పై NIA గ‌త కొద్ది రోజులుగా వివిధ ప్రాంతాలలో దాడులు చేసి ఆ సంస్థ‌నాయ‌కుల‌ను అరెస్టు చేసింది. ఇందుకు నిర‌స‌నగా ప్ర‌బుత్వ స‌ర్వీసుల‌తో పాటు అన్ని వాణిజ్య వ్యాపార సంస్థ‌ల‌ను మూసివేసి బంద్ పాటించాల‌ని పిఎఫ్ ఐపిలుపునిచ్చింది.

బంద్ సంద‌ర్భంగా రాష్ట్రంలోని పలు ప్రాంతాలలో బంద్ నిర్వహిస్తున్న PFI కార్యకర్తలపై పోలీసులు లాఠీ చార్జ్ చేశారు. PFI కార్యకర్తలు పోలీసుల‌పై రాళ్లు రువ్విన ఘటనలు జ‌రిగాయి. ఈరోజు తెల్లవారుజామున కొల్లాం జిల్లాలోని పల్లిముక్కు ప్రాంతంలో హర్తాళ్ మద్దతుదారులు ఇద్దరు పోలీసు అధికారులపై దాడి చేశారు. గాయ‌ప‌డిన ఆంటోని, నిఖిల్ అనే ఇద్దరు పోలీసు ఉద్యోగుల‌ను ఆసుపత్రికి తరలించారు. నిందితుల బైక్ నంబర్లను పోలీసులు నమోదు చేశారని, వారిని త్వరలోనే పట్టుకుంటామని పోలీసులు చెప్పారు. కోజికోడ్, కొచ్చి, అలప్పుజా, కొల్లాం నగరాల్లో కూడా కేఎస్‌ఆర్‌టీసీ బస్సులపై దాడులు జరిగాయి. కొట్టాయంలో వీధులన్నీ నిర్మానుష్యంగా కనిపించాయి.

అంతకుముందు, PFI ఎప్పటికీ లొంగిపోదని, ఎన్ఐఎ ఆరోపణల‌న్నీ భయోత్పాత వాతావరణాన్ని సృష్టించడానికి ఉద్దేశించినవి అని ఆ సంస్థ ఒక ప్ర‌క‌ట‌న‌లో పేర్కొంది. NIA, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) తమ నేతలపై జరిపిన దాడులు,సోదాలను PFI ఖండించింది.

నిన్న, నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్ ఐఎ), ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడి), రాష్ట్ర పోలీసు బలగాలు దేశవ్యాప్తంగా 15 రాష్ట్రాలు. ఇతర ప్రదేశాలలో మొత్తం 106 మంది పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పిఎఫ్ ఐ) నేత‌ల‌ను ఉగ్రవాద సంబంధాల ఆరోప‌ణ‌ల‌పై అదుపులోకి తీసుకున్నాయని అధికార వ‌ర్గాలు తెలిపాయి.

First Published:  23 Sep 2022 10:18 AM GMT
Next Story