Telugu Global
National

దిగంబ‌రత్వాన్ని అశ్లీల‌త‌తో స‌మానంగా భావించ‌డం త‌గ‌దు.. - కేర‌ళ హైకోర్టు

శరీర ఎగువ భాగాల అర్ధనగ్నత్వం విషయంలో పురుషులను, మహిళలను వేర్వేరు దృష్టికోణాల్లో చూస్తున్నారని, ఈ వివక్షను ప్రశ్నిస్తూ సందేశమిచ్చేందుకు బాడీ పెయింట్ కళను వినియోగించినట్లు ఫాతిమా తెలిపారు.

దిగంబ‌రత్వాన్ని అశ్లీల‌త‌తో స‌మానంగా భావించ‌డం త‌గ‌దు.. - కేర‌ళ హైకోర్టు
X

అశ్లీలత, అసభ్యత, కామోద్దీపనలతో దిగంబరత్వాన్ని అన్నివేళలా సమానంగా భావించడం తగదని కేర‌ళ హైకోర్టు పేర్కొంది. కామోద్దీపన అనే భావన చూసే వారి దృష్టిని బట్టే ఉంటుందని న్యాయమూర్తి జస్టిస్ ఎడప్పగత్ తెలిపారు. మహిళలకు వారి శరీరాలపై స్వయం నిర్ణాయక హక్కు తరచూ నిరాకరణకు గురవుతోందని ఈ సంద‌ర్భంగా న్యాయ‌స్థానం అభిప్రాయపడింది. వారు తమ జీవితాలు, శరీరాలపై స్వతంత్ర నిర్ణయాలు తీసుకుంటే వేధింపులు, వివక్షలతో పాటు ఒంటరితనానికీ గురికావాల్సి వస్తోందని పేర్కొంది. జువెనైల్ జస్టిస్, పోక్సో, సమాచార సాంకేతిక (ఐటీ) చట్టాల కింద మహిళా హక్కుల కార్యకర్తపై నమోదైన అభియోగాలను సోమవారం కొట్టివేస్తూ న్యాయస్థానం ఈ వ్యాఖ్యలు చేసింది.

మైనర్లు అయిన తన చిన్నారులతో అర్ధనగ్న భంగిమలో రెహనా ఫాతిమా అనే మహిళ తన శరీరంపై పెయింట్ వేయించుకున్నారు. 'శరీరం-రాజకీయాలు' అనే శీర్షికతో ఈ వీడియోను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశారు. ఈ చర్యకు గాను చిన్నారులపై లైంగిక వేధింపుల నిరోధక చట్టం (పోక్సో), జువెనైల్ జస్టిస్, సమాచార సాంకేతిక (ఐటీ) చట్టంలోని నిబంధనల కింద ఆమెపై కేరళలో కేసులు దాఖలయ్యాయి. వీటిని కొట్టివేయాలన్న అభ్యర్థ‌నను దిగువ కోర్టు తిరస్కరించడంతో ఫాతిమా హైకోర్టును ఆశ్రయించారు.

శరీర ఎగువ భాగాల అర్ధనగ్నత్వం విషయంలో పురుషులను, మహిళలను వేర్వేరు దృష్టికోణాల్లో చూస్తున్నారని, ఈ వివక్షను ప్రశ్నిస్తూ సందేశమిచ్చేందుకు బాడీ పెయింట్ కళను వినియోగించినట్లు ఫాతిమా తెలిపారు. ఈ కేసు తీర్పులో భాగంగా న్యాయమూర్తి జస్టిస్ ఎడప్పగత్ మాట్లాడుతూ నగ్నత్వాన్ని కామోద్రేక దృష్టితో ముడిపెట్టడం తగదని చెప్పారు. దేవాలయాలపై వివిధ భంగిమల్లోని చిత్తర్వులు ప్రాచీన కాలం నుంచీ ఉన్న విషయాన్ని గుర్తు చేశారు. తల్లీబిడ్డల అనుబంధంలోని గాఢత, పవిత్రతను ఎవరూ ప్రశ్నించలేరని తెలిపారు. ఒక సామాజిక లక్ష్యం కోసం ఫాతిమా రూపొందించిన వీడియోను అవగాహన చేసుకోవడంలో దిగువ కోర్టు విఫలమైందన్నారు. ఆమెపై నమోదైన కేసులన్నింటినీ తొలగించాలని ఆదేశించారు. సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో అయ్యప్పస్వామి ఆలయ ప్రవేశం చేసేందుకు ప్రయత్నించిన ఫాతిమా అప్పట్లో తీవ్ర విమర్శలకు గురైన విష‌యం తెలిసిందే.

First Published:  6 Jun 2023 2:47 AM GMT
Next Story