Telugu Global
National

మోదీ చదువుకుంటే ఆ పని చేసేవారా..? కోర్టు తీర్పుతో మరిన్ని అనుమానాలు..!

మోదీ అహంకారానికి భయపడో.. లేదా ఆయన పట్టా నకిలీది కావడం వల్లో గుజరాత్ యూనివర్శిటీ వివరాలు తెలపలేదన్నారు కేజ్రీవాల్. కోర్టు తీర్పుతో అనుమానాలు పెరిగిపోయాయని చెప్పారు.

మోదీ చదువుకుంటే ఆ పని చేసేవారా..? కోర్టు తీర్పుతో మరిన్ని అనుమానాలు..!
X

మోదీ డిగ్రీ పట్టాలు చూపించాలంటూ కేంద్ర సమాచార కమిషన్ కి దరఖాస్తు చేసిన ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కి, ఇటీవల కోర్టు 25వేల రూపాయలు జరిమానా విధించిన సంగతి తెలిసిందే. కోర్టు తీర్పు తర్వాత కేజ్రీవాల్ తీవ్రంగా స్పందించారు. ప్రధాని ఏం చదివారో తెలుసుకునే హక్కు ఈ దేశ ప్రజలకు లేదా ? అని ప్రశ్నించారు. తాజాగా ఆయన మరోసారి ఆ తీర్పుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. కోర్టు తీర్పు తర్వాత ప్రధాని చదువుపై మరిన్ని అనుమానాలు వస్తున్నాయన్నారు కేజ్రీవాల్.

ఆపని చేసేవారా..?

నిజంగా మోదీ చదువుకుని ఉంటే, పెద్ద నోట్ల రద్దు వంటి నిర్ణయం తీసుకునేవారు కాదన్నారు కేజ్రీవాల్. అందుకే ఆయన చదువుపై తమకు అనుమానం వస్తోందన్నారు. డిగ్రీయే కాదు, ఏకంగా పీజీ చేశానని చెప్పుకుంటున్న వ్యక్తికి ఆ సర్టిఫికెట్లు చూపించడానికి నామోషీ ఏంటని ప్రశ్నించారు. 21వ శతాబ్దంలో భారత ప్రధాని చదువుకున్నవారై ఉండాలా లేదా అని ప్రశ్నించారు.

"దేశానికి టాప్ మేనేజర్ అయిన వ్యక్తి విద్యార్హతలు చాలా కీలకం. శాస్త్ర, సాంకేతిక, ఆర్థిక రంగాల్లో రోజువారీ నిర్ణయాలు తీసుకునే స్థితిలో ఉన్నవారు, విద్యావంతూడా..? కాదా..? అని తెలుసుకోవాల్సిన అవసరం ప్రజలకు ఉంది. మోదీ అహంకారానికి భయపడో.. లేదా ఆయన పట్టా నకిలీది కావడం వల్లో గుజరాత్ యూనివర్శిటీ వివరాలు తెలపలేదు. కోర్టు తీర్పుతో అనుమానాలు పెరిగిపోయాయి. మోదీ విద్యార్హతలు బయటపెట్టాల్సిందే.." అని మీడియా సమావేశంలో మాట్లాడారు కేజ్రీవాల్.

బీజేపీ విమర్శలు..

ఆప్ అవినీతి ప్రజలకు తెలియడంతో.. కేజ్రీవాల్ కి ఏం చేయాలో తెలియడంలేదని, ఆయనకు పిచ్చి ముదిరిందని, అందుకే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు బీజేపీ నేతలు. ఇకపై ఇలాంటి పిచ్చి ప్రేలాపనలు మానుకోవాలని హితవు పలికారు.

First Published:  2 April 2023 1:07 AM GMT
Next Story