Telugu Global
National

కేదార్‌నాథ్.. రిజిస్ట్రేష‌న్ల‌కు బ్రేక్‌.. - వాతావ‌ర‌ణ ప్ర‌తికూల‌త‌ల వ‌ల్లే..

జోషీమ‌ఠ్ స‌మీపంలోని హెలాంగ్ వ‌ద్ద కూడా కొండ చ‌రియలు విరిగిప‌డ‌టంతో వాట‌న్నింటినీ తొల‌గించేవ‌ర‌కు రోడ్డుమార్గాన యాత్ర‌కు వెళ్లొద్ద‌ని అధికారులు సూచించారు.

కేదార్‌నాథ్.. రిజిస్ట్రేష‌న్ల‌కు బ్రేక్‌.. - వాతావ‌ర‌ణ ప్ర‌తికూల‌త‌ల వ‌ల్లే..
X

ప్ర‌సిద్ధ పుణ్య‌క్షేత్రం కేదార్‌నాథ్ యాత్రికుల రిజిస్ట్రేష‌న్ల‌ ప్రక్రియ‌కు తాత్కాలికంగా బ్రేక్ ప‌డింది. రాబోయే మూడు నాలుగు రోజుల్లో యాత్రికుల రిజిస్ట్రేష‌న్ల ప్ర‌క్రియ‌ను ఉత్త‌రాఖండ్ ప్ర‌భుత్వం ర‌ద్దు చేసింది. వాతావ‌ర‌ణ ప్ర‌తికూల ప‌రిస్థితుల నేప‌థ్యంలో ఈ నిర్ణ‌యం తీసుకుంది. మే 8వ తేదీ వ‌ర‌కు రిజిస్ట్రేష‌న్ల ప్ర‌క్రియను నిలిపివేస్తున్న‌ట్టు ప్ర‌భుత్వం ప్ర‌క‌టించింది.

బైరాన్ వ‌ద్ద బుధ‌వారం మంచు చ‌రియ‌లు విరిగిప‌డటంతో కేదార్‌నాథ్ ధామ్ యాత్ర మార్గాన్ని అధికారులు మూసివేశారు. భ‌ద్ర‌తా బ‌ల‌గాలు, పోలీసులు యాత్రికులు ప్ర‌యాణించే మార్గాల‌ను క్లియ‌ర్ చేస్తున్నారు. కాలిన‌డ‌క‌న వెళ్లే వారిని మాత్ర‌మే అనుమ‌తించ‌నున్నారు. క‌నీసం గుర్రాలు, కంచ‌ర గాడిద‌ల‌పై వెళ్లే యాత్రికుల మార్గాన్ని సైతం తెర‌వ‌లేదు. మార్గాల‌ను క్లియ‌ర్ చేసే ప‌నిలో ఉండ‌గానే గురువారం మ‌రోసారి భారీగా మంచు చ‌రియ‌లు విరిగిపడ్డాయి. దీంతో యాత్రికుల రాక‌పోక‌ల‌కు తీవ్ర అంత‌రాయం ఏర్ప‌డింది. జోషీమ‌ఠ్ స‌మీపంలోని హెలాంగ్ వ‌ద్ద కూడా కొండ చ‌రియలు విరిగిప‌డ‌టంతో వాట‌న్నింటినీ తొల‌గించేవ‌ర‌కు రోడ్డుమార్గాన యాత్ర‌కు వెళ్లొద్ద‌ని అధికారులు సూచించారు.

అక్క‌డి ప‌ర్యాట‌క శాఖ లెక్క‌ల ప్ర‌కారం.. మే నాలుగో తేదీ వ‌ర‌కు ల‌క్షా 23 వేల మంది భ‌క్తులు కేదార్‌ధామ్‌ను ద‌ర్శించుకున్నారు. మే 10వ తేదీన యాత్ర కోసం ఇప్ప‌టికే ల‌క్షా 26 వేల మంది రిజిస్ట‌ర్ చేసుకోవ‌డం గ‌మ‌నార్హం. ఈ క్ర‌మంలోనే వాతావ‌ర‌ణ ప‌రిస్థితుల వ‌ల్ల అడ్డంకులు ఏర్ప‌డ‌టంతో ప్ర‌భుత్వం రిజిస్ట్రేష‌న్ల‌ను తాత్కాలికంగా ర‌ద్దుచేస్తూ నిర్ణ‌యించింది.

First Published:  6 May 2023 2:27 AM GMT
Next Story