Telugu Global
National

బీజేపీ వ్యతిరేక పార్టీలు ఏకమవుతాం, బీజేపీ ముక్త్ భారత్ ను నిర్మిస్తాం... కేసీఆర్

బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ ఏకం కావాలని ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపునిచ్చారు. బీహార్ సీఎం నితీష్ కుమార్ తో సమావేశం అనంతరం ఆయన‌ పాట్నాలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ బీజేపీపై నిప్పులు చెరిగారు.

బీజేపీ వ్యతిరేక పార్టీలు ఏకమవుతాం, బీజేపీ ముక్త్ భారత్ ను నిర్మిస్తాం... కేసీఆర్
X

బీహార్ గడ్డపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ బీజేపీపై నిప్పులు చెరిగారు. బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ తో సమావేశం అనంతరం జరిగిన మీడియా సమావేశంలో ఇద్దరు ముఖ్యమంత్రులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ. భారత్ నుండి బీజేపీని సాగనంపుతేనే దేశం అభివృద్ది చెందుతుందన్నారు. బీజేపీ వచ్చిన ఎనిమిదేళ్ళలో ప్రభుత్వ రంగ సంస్థలు అమ్మకం, డాలర్ తో పోలిస్తే రూపాయు విలువ ఎన్నడూ లేనంతగా దిగజారడం ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం చేయడం తప్ప చేసిందేమీ లేదన్నారు.

బీజేపీ పాలనలో ఎన్నడూ లేనంతగా ధరలు పెరిగిపోయి పేదలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, దళితులపై, మహిళలపై హత్యలు, అత్యాచారాలు పెరిగిపోయాయని, గుజరాత్ మోడల్ పేరుతో అబద్దాలు ప్రచారం చేస్తున్నారని , గుజరాత్ మోడల్ పెద్ద ఫేల్యూర్ మోడల్ అని కేసీఆర్ నిప్పులు కక్కారు.

మేకిన్ ఇండియా అన్న మోడి నినాదం నీటి మూటగానే మిగిలిపోయిందని ఇప్పటికీ ఎక్కువగా దిగుమతులమీదనే భారత్ ఆధారపడుతోందని కేసీఆర్ ఆరోపించారు. ప్రపంచ దేశాల ముందు మనదేశం పరువు తీసేస్తూ, అబద్దాలతో పాలన సాగిస్తున్న బీజేపీని గద్దె దించేందుకు దేశంలోని బీజెపి వ్యతిరేక శక్తులన్నీ ఏకం కావాలని కేసీఆర్ పిలుపునిచ్చారు.

భారత దేశాన్ని మార్చే ప్రభుత్వాలు కావాలని రొటీన్ ప్రభుత్వాలు కాదని, అదే విషయంపై నితీశ్ కుమార్ తో కూడా చర్చలు జరిపానని, బీజేపీని వ్యతిరేకించే పార్టీలన్నింటినీ కలుపుకపోతామని కేసీఆర్ స్పష్టం చేశారు. ఇది థర్డ్ ఫ్రంట్, ఫోర్త్ ఫ్రంట్ కాదని దేశానికి ప్రత్యామ్నాయాన్ని చూపించే మార్గమన్నారు కేసీఆర్. దీనికి నాయకత్వం ఎవరు వహించాలన్న ప్రశ్న అనవసరమైనదని, ఎన్నికల సమయంలో , అందరం చర్చించి తీసుకోవాల్సిన నిర్ణయమని కేసీఆర్ తెలిపారు.

First Published:  31 Aug 2022 1:11 PM GMT
Next Story