Telugu Global
National

బీఆర్ఎస్‌లో తొలి నియామకం.. కిసాన్ సమితి అధ్యక్షుడిగా గుర్నామ్‌సింగ్ చడూని

గుర్నామ్‌‌సింగ్ ఉత్తర భారతంలో చాలా సుపరిచిత వ్యక్తి. రైతులకు ఎక్కడ కష్టం వచ్చినా అక్కడ వాలిపోతారు.

BRS: బీఆర్ఎస్‌లో తొలి నియామకం.. కిసాన్ సమితి అధ్యక్షుడిగా గుర్నామ్‌సింగ్ చడూని
X

బీఆర్ఎస్‌లో తొలి నియామకం.. కిసాన్ సమితి అధ్యక్షుడిగా గుర్నామ్‌సింగ్ చడూని

భారత్ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) జాతీయ కార్యాలయం ఢిల్లీలోని సర్దార్ పటేల్ రోడ్డులో బుధవారం ప్రారంభించారు. పార్టీ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్ చేతుల మీదుగా మధ్యాహ్నం 12.37 గంటలకు జెండా ఆవిష్కరణ జరిపిన అనంతరం.. కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి సమాజ్‌వాది పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్, జేడీఎస్ నేత కుమారస్వామి సహా దేశం నలుమూలల నుంచి అనేక మంది ప్రముఖులు హాజరయ్యారు. 2024లో కేంద్రంలో రైతు సర్కార్‌ను ఏర్పాటు చేయడమే లక్ష్యంగా బీఆర్ఎస్ ఏర్పడింది. ప్రత్యేక తెలంగాణ ఉద్యమం కోసం ఏ విధంగా అయితే టీఆర్ఎస్ పుట్టిందో.. ఇప్పుడు దేశంలో గుణాత్మక మార్పు తీసుకొని రావడానికి బీఆర్ఎస్ ఆవిర్భవించినట్లు కేసీఆర్ తెలిపారు.

బీఆర్ఎస్ కార్యాలయం ప్రారంభించిన రోజునే కీలకమైన నియమకాలను కేసీఆర్ చేపట్టారు. అబ్‌కీ బార్ కిసాన్ సర్కార్ అనే నినాదంతో ముందుకు వెళ్తున్న బీఆర్ఎస్ పార్టీకి తొలి నియామకంగా భారత రాష్ట్ర కిసాన్ సమితి అధ్యక్షుడిని నియమించారు.హర్యానాలోని కురుక్షేత్రకు చెందిన గుర్నామ్‌సింగ్ చడూనిని ఈ విభాగానికి అధ్యక్షుడి చేస్తూ నియామక పత్రాన్ని స్వయంగా ఆయనకు కేసీఆర్ అందించారు. గుర్నామ్‌‌సింగ్ ఉత్తర భారతంలో చాలా సుపరిచిత వ్యక్తి. రైతులకు ఎక్కడ కష్టం వచ్చినా అక్కడ వాలిపోతారు. ముఖ్యంగా హర్యానా, పంజాబ్ రాష్ట్రాల్లో రైతులకు గుర్నామ్‌సింగ్ పెద్ద దిక్కుగా నిలిచారు.

రైతు ఉద్యమాలు అంటే గుర్నామ్‌సింగ్ అనేలా ఉత్తరాది రాష్ట్రాల్లో ఆయన పేరు పెనవేసుకొని పోయింది. 1959లో హర్యానాలోని కురుక్షేత్ర జిల్లా చరూని జట్టన్ గ్రామంలో జన్మించిన గుర్నామ్‌సింగ్.. మొదటి నుంచి రైతు ఉద్యమాలతో పెనవేసుకొని పోయారు. 2008లో వ్యవసాయ రుణాల మాఫీ కోసం పెద్ద ఎత్తున ఉద్యమం నిర్వహించి.. ప్రభుత్వం మెడలు వంచి రుణమాఫీ చేయించారు. 2009లో పొద్దు తిరుగుడు పంటను ప్రభుత్వమే కొనాలనే డిమాండ్‌తో గుర్నామ్ చేపట్టిన రైతు ఉద్యమం దేశం దృష్టిని ఆకర్షించింది. నిరుగు కేంద్ర ప్రభుత్వం తీసుకొని వచ్చిన వివాదాస్పద సాగు చట్టాలను రద్దు చేయాలంటూ ఢిల్లీ సరిహిద్దుల్లో సుదీర్ఘకాలం రైతులు చేపట్టిన ఉద్యమం వెనుక గుర్నామ్ సింగ్ కీలక పాత్ర పోషించారు.

తనను కిసాన్ సమితి అధ్యక్షుడిగా నియమించినందుకు గుర్నామ్.. పార్టీ చీఫ్ కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ మేరకు తన నియామక పత్రాన్ని ట్విట్టర్‌లో పోస్టు చేశారు. బీఆర్ఎస్ పార్టీ ఢిల్లీ కార్యాలయ ఇన్‌చార్జిగా, పార్టీ జనరల్ సెక్రటరీగా తమిళనాడుకు చెందిన పార్లమెంట్ సభ్యుడు రవికుమార్ కోహర్‌ను నియమించారు. రాబోయే రోజుల్లో పార్టీకి సంబంధించిన మిగిలిన కమిటీలను కూడా వేయనున్నట్లు తెలుస్తున్నది. కేసీఆర్ స్వయంగా రాజకీయ అనుభవం ఉన్న వారిని ఎంపిక చేసుకొని బీఆర్ఎస్‌లో కీలక బాధ్యతలు అప్పగించనున్నట్లు తెలుస్తున్నది.



First Published:  15 Dec 2022 1:08 AM GMT
Next Story