Telugu Global
National

గుజరాత్ లో 2వేల మందికి పైగా చంపాం , మన ధైర్యం అట్లుంటది -VHP నాయకుడి బహిరంగ వ్యాఖ్యలు

''కరసేవకులు యాభై తొమ్మిది మందే చనిపోయారు. కానీ హిందువులు ఎవరూ ఇంట్లో చేతులు కట్టుకుని కూర్చోలేదు. వారంతా వీధుల్లోకి వచ్చారు. ఒక్కో ఇంట్లోకి ప్రవేశించి ప్రతీకారంగా చేసిన హత్యల‌ సంఖ్య ఇంకా అందుబాటులో లేదు. దాదాపు 2,000 మంది మరణించినట్లు అంచనా.'' అని విశ్వహిందూ పరిషత్ (VHP) నాయకుడు శరణ్ పంప్‌వెల్ అన్నారు

గుజరాత్ లో 2వేల మందికి పైగా చంపాం , మన ధైర్యం అట్లుంటది -VHP నాయకుడి బహిరంగ వ్యాఖ్యలు
X

కర్ణాటకలోని తుమకూరులో జరిగిన బజరంగ్ దళ్ శౌర్య యాత్ర కార్యక్రమంలో విశ్వహిందూ పరిషత్ (VHP) నాయకుడు శరణ్ పంప్‌వెల్ మాట్లాడుతూ, 2002 గుజరాత్ అల్లర్లు, కర్ణాటకలోని సూరత్‌కల్‌లో ముస్లిం యువకుడు మహ్మద్ ఫాసిల్ హత్యకు సంబంధించి పలు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

శనివారం జరిగిన ఆ కార్యక్రమంలో VHP నాయకుడు శరణ్ పంప్‌వెల్ మాట్లాడుతూ, “గుజరాత్ సంఘటన గుర్తుందా, 59 మంది కరసేవకులు అయోధ్య నుండి తిరిగి వస్తున్నప్పుడు, వారి కంపార్ట్‌మెంట్లను తగులబెట్టారు? అలాగే గుజరాత్ ప్రజలు చెప్పిన సమాధానం కూడా గుర్తుపెట్టుకోండి.కరసేవకులు యాభై తొమ్మిది మందే చనిపోయారు. కానీ హిందువులు ఎవరూ ఇంట్లో చేతులు కట్టుకుని కూర్చోలేదు. వారంతా వీధుల్లోకి వచ్చారు. ఒక్కో ఇంట్లోకి ప్రవేశించి ప్రతీకారంగా చేసిన హత్యల‌ సంఖ్య ఇంకా అందుబాటులో లేదు. దాదాపు 2,000 మంది మరణించినట్లు అంచనా. ఇవీ హిందువుల ధైర్యసాహసాలు'' అని ఆయన అన్నట్టు ఇండియన్ ఎక్స్‌ప్రెస్ పేర్కొంది.

సూరత్‌కల్, కాటిపాళ్లలోని మంగళపేట నివాసి మహమ్మద్ ఫాసిల్‌ను పట్టపగలు సూరత్‌కల్‌లోని ఓ దుకాణం ఎదుట 2022 జూలై 28న హత్య చేశారు. హత్య కేసులో ఎనిమిది మందిని పోలీసులు అరెస్టు చేసి చార్జిషీట్ సమర్పించారు. భారతీయ జనతా పార్టీ (బిజెపి) నాయకుడు ప్రవీణ్ నెట్టారు హత్య జరిగిన రెండు రోజులకే ఫాసిల్‌ హత్య జరిగింది.

దాని గురించి పంప్‌వెల్ మాట్లాడుతూ, “బిజెపి నాయకుడు ప్రవీణ్ నెట్టారు హత్యకు ప్రతీకారంగా సూరత్‌కల్‌లోని యువకులు అతనిని చంపారు; ఏకాంత ప్రదేశంలో కాకుండా బహిరంగ మార్కెట్లో చంపారు. ఇదీ హిందూ యువకుల శక్తి.'' అని అన్నారాయన‌

VHP నాయకుడు శరణ్ పంప్‌వెల్ చేసిన ఈ వ్యాఖ్యల తర్వాత అతన్ని అరెస్టు చేయాలని మహమ్మద్ ఫాసిల్ తండ్రి పోలీసులను కోరారు. జనవరి 30, సోమవారం మంగళూరులోని పోలీస్ కమిషనర్ ఎన్ శశి కుమార్ కు సమర్పించిన మెమోరాండంలో ఫరూక్, “నా కొడుకు మరణంపై శరణ్ పంప్‌వెల్ దగ్గర‌ మరింత సమాచారం ఉంది. అందుకే అతన్ని వెంటనే అరెస్ట్ చేయాలి.'' అని డిమాండ్ చేశారు.

First Published:  31 Jan 2023 12:35 AM GMT
Next Story