Telugu Global
National

సీఎం విగ్రహానికి రక్తాభిషేకం.. ఎందుకో తెలుసా..?

బసవరాజ్ బొమ్మై సిమెంట్ విగ్రహాన్ని తయారు చేయించారు రైతులు. దాన్ని ఓ స్టూల్ పై పెట్టారు. రైతులంతా ఒక్కొకరే వచ్చి తమ చేతికి బ్లేడుతో గాయం చేసుకున్నారు. కారుతున్న రక్తపు ధారల్ని ఆ విగ్రహం పడేలా చేతుల్ని ఉంచారు.

సీఎం విగ్రహానికి రక్తాభిషేకం.. ఎందుకో తెలుసా..?
X

అభిమానులు, పార్యీ కార్యకర్తలు.. మంత్రులు, ముఖ్యమంత్రుల ఫొటోలకు, విగ్రహాలకు పాలాభిషేకాలు చేయడం సహజమే. కానీ కర్నాటక సీఎం బసవరాజ్ బొమ్మై విగ్రహానికి ఏకంగా రక్తాభిషేకం చేశారు రైతులు. అభిమానం మరీ ఎక్కువై ఇలా చేశారని అనుకోవద్దు. తమ నిరసనను ఇలా వ్యక్తపరిచారు అన్నదాతలు. ఆయనపై తమకున్న కోపాన్ని ఇలా చూపించారు. తమ రక్తాన్ని పీలుస్తున్న ప్రభుత్వం ఇకనైనా కళ్లు తెరవాలని, ఈ ఘటన తర్వాతయినా తమ బాధల్ని సీఎం బొమ్మై అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నామని తెలిపారు.

అంత కోపం ఎందుకు..?

కర్నాటకలో చెరకు రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గిట్టుబాటు ధర లేక, ప్రభుత్వం పంట సేకరించక దళారుల చేతుల్లో దారుణంగా మోసపోతున్నారు. ముఖ్యంగా మాండ్య జిల్లాలోని చెరకు రైతులు గిట్టుబాటు ధరకోసం చాలా కాలంగా పోరాటం చేస్తున్నారు. చెరుకు పంటకు కనీస మద్దతు ధర నిర్ణయించాలని డిమాండ్‌ చేస్తూ మాండ్య రైతాంగం 50 రోజుల నుంచి స్థానిక విశ్వేశ్వరయ్య విగ్రహం వద్ద రిలే నిరాహార దీక్షలు చేస్తోంది. పట్టణంలో నిరసన ప్రదర్శనలు చేపడుతున్నారు రైతులు. ఈ పోరాటానికి వివిధ రాజకీయ పార్టీలు కూడా మద్దతు తెలిపాయి. కానీ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం పట్టించుకోలేదు. తమ పోరాటం మొదలు పెట్టి 50రోజులవుతున్న సందర్భంగా రైతులు వినూత్న రీతిలో నిరసన తెలపాలనుకున్నారు.

సిమెంట్ విగ్రహానికి రక్తాభిషేకం..

బసవరాజ్ బొమ్మై సిమెంట్ విగ్రహాన్ని తయారు చేయించారు రైతులు. దీక్షా శిబిరానికి ముందు దాన్ని ఓ స్టూల్ పై పెట్టారు. రైతులంతా ఒక్కొకరే వచ్చి తమ చేతికి బ్లేడుతో గాయం చేసుకున్నారు. కారుతున్న రక్తపు ధారల్ని ఆ విగ్రహం పడేలా చేతుల్ని ఉంచారు. కొంతమంది సిరంజితో రక్తాన్ని బయటకు తీసి దాన్ని ఆ విగ్రహంపై పోశారు. రక్తాభిషేకం చేశారు.

తీపికబురు చెబుతా..

గతంలో ఆందోళనల సందర్భంగా చెరకు రైతులకు తీపి కబురు చెబుతానని హామీ ఇచ్చారు సీఎం బసవరాజ్ బొమ్మై. అయితే ఆ తర్వాత ఆయన వారిని పట్టించుకోలేదు. 50రోజులుగా దీక్ష చేపట్టినా కనికరించలేదు. దీంతో రైతులంతా కోపోద్రిక్తులయ్యారు, సీఎం బొమ్మైకి రక్తాభిషేకం చేశారు. కేంద్ర మంత్రి అమిత్ షా పర్యటనకు రాబోతున్న సందర్భంలో రైతులు ఇలా నిరసనలకు దిగడంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. దీక్షా శిబిరాన్ని తొలగించారు.

First Published:  30 Dec 2022 6:24 AM GMT
Next Story