Telugu Global
National

కర్నాటకలో నేడే పోలింగ్.. భారీగా నగదు సీజ్..

కర్నాటక ఎన్నికల్లో ఈరోజు సింగిల్ ఫేజ్ లో మొత్తం 224 అసెంబ్లీ నియోజకవర్గాలకు పోలింగ్ జరుగుతుంది. మొత్తం 2,615 మంది అభ్యర్థులు కర్నాటక ఎన్నికల బరిలో నిలిచారు. వీరిలో మహిళల సంఖ్య కేవలం 184.

కర్నాటకలో నేడే పోలింగ్.. భారీగా నగదు సీజ్..
X

కర్నాటక ఎన్నికలు కాస్ట్ లీగా మారిపోయాయి. ఎన్నికల సమయంలో పట్టుబడ్డ నగదే దీనికి నిదర్శనం. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో రూ.83.93 కోట్ల విలువైన నగదు, ఇతర వస్తువుల్ని జప్తు చేశారు అధికారులు. ఈ దఫా ఆ విలువ రూ.375.61 కోట్లకు పెరిగింది. గత ఎన్నికలతో పోల్చి చూస్తే తాజాగా స్వాధీనం చేసుకున్న వాటి విలువ దాదాపు 4.5 రెట్లు అధికమని ఎన్నికల కమిషన్ పేర్కొంది.

కర్నాటకలో ఎన్నికల కోడ్ మొదలైనప్పటినుంచి ఇప్పటివరకు నగదు, వస్తువుల రూపంలో రూ.375.61 కోట్ల మేర జప్తులు చేసింది ఈసీ. ఇందులో రూ.147.46 కోట్ల నగదు, రూ.83.66 కోట్ల విలువ చేసే 22 లక్షల లీటర్ల మద్యం, రూ.23.67 కోట్ల మాదకద్రవ్యాలు, రూ.96.60 కోట్ల బంగారం, వెండి తదితర మెటల్స్, రూ.24.21 కోట్ల మేర ఎన్నికల్లో పంచేందుకు రెడీ చేసిన గిఫ్ట్ ఆర్టికల్స్ ఉన్నాయి. వీటికితోడు కోడ్ అమలులోకి వచ్చిన తర్వాత ఎన్‌ ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ రూ.288 కోట్ల ఆస్తులను జప్తు చేసినట్లు ఈసీ తెలిపింది.

కుట్టు మెషీన్లు చీరలు, కుక్కర్లు..

కర్నాటక ఎన్నికల సమయంలో ఓటర్లకు పంచిపెట్టడానికి చీరలు, కుక్కర్లు, వంటింటి సామాన్లు, కుట్టుమెషీన్లు సిద్ధం చేసుకున్నారు అభ్యర్థులు. వీటిని కూడా ఈసీ స్వాధీనం చేసుకుంది. మహారాష్ట్ర, గోవా, తెలంగాణ, ఏపీ, కేరళ, తమిళనాడు సరిహద్దుల్లోని చెక్‌ పోస్టుల్లో తనిఖీల ద్వారా రూ.70 కోట్ల విలువైన నగదు, మద్యం, డ్రగ్స్‌ స్వాధీనం చేసుకున్నారు అధికారులు.

నేడే పోలింగ్..

కర్నాటక ఎన్నికల్లో ఈరోజు సింగిల్ ఫేజ్ లో మొత్తం 224 అసెంబ్లీ నియోజకవర్గాలకు పోలింగ్ జరుగుతుంది. 5.31కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోబోతున్నారు. 58,545 పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేశారు. మొత్తం 2,615 మంది అభ్యర్థులు కర్నాటక ఎన్నికల బరిలో నిలిచారు. వీరిలో మహిళల సంఖ్య కేవలం 184. మే-13 న కర్నాటక ఎన్నికల ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు విడుదల చేస్తారు.

First Published:  10 May 2023 1:14 AM GMT
Next Story