Telugu Global
National

బ్రెయిన్ మ్యాపింగ్‌తో నిందితుల గుర్తింపు.. - క‌ర్నాట‌క‌లో ఇదే తొలిసారి

బ్రెయిన్ మ్యాపింగ్‌తో నిందితుల గుర్తింపు.. - క‌ర్నాట‌క‌లో ఇదే తొలిసారి
X

ఓ హ‌త్య కేసులో బ్రెయిన్ మ్యాపింగ్ ద్వారా నిందితుల‌ను గుర్తించారు క‌ర్నాట‌క పోలీసులు. ఈ విధానంలో నిందితుల‌ను గుర్తించ‌డం క‌ర్నాట‌క రాష్ట్రంలో ఇదే తొలిసారి కావ‌డం విశేషం. బెంగళూరు స‌మీపంలోని క‌న‌క‌పుర‌కు చెందిన శ్రేయ‌స్ (19) చ‌దువుకుంటూనే క్రిమిన‌ల్ లాయ‌ర్ శంక‌ర్ గౌడ కార్యాల‌యంలో పార్ట్ టైమ్ ఉద్యోగం చేసేవాడు. 2022 మే 19న రాత్రి ఫోన్ కాల్ రావ‌డంతో ఇంటినుంచి బ‌య‌ల్దేరి బ‌య‌టికి వెళ్లాడు. అప్ప‌టి నుంచి అత‌ను ఇంటికి తిరిగి రాలేదు. దీంతో అత‌ని త‌ల్లి ఆశ పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు.

ఈ ఘ‌ట‌న‌పై ద‌ర్యాప్తు చేప‌ట్టిన పోలీసులు కాల్ డేటా ఆధారంగా నిందితుల‌ను అరెస్టు చేశారు. మృత‌దేహం దొరికిన అనంత‌రం పోస్టుమార్టం రిపోర్టులో అస‌హ‌జ లైంగిక ప్ర‌క్రియ అనంత‌రం శ్రేయ‌స్‌ను ఊపిరాడ‌కుండా చేసి హ‌త‌మార్చిన‌ట్టు తేలింది. అయితే నిందితులు మాత్రం త‌మ‌కు ఈ హ‌త్యతో సంబంధం లేద‌ని వాదించారు.

ఈ నేప‌థ్యంలో పోలీసులు బ్రెయిన్ మ్యాపింగ్ ప‌ద్ధ‌తిని అనుస‌రించారు. ప్ర‌ధాన నిందితుడు శంకర్‌గౌడకు బ్రెయిన్ మ్యాపింగ్ విధానంలో త‌ల‌కు సెన్స‌ర్లు బిగించి, నిపుణులు, వైద్యుల స‌హాయంతో ప‌రీక్ష‌లు చేశారు. ఈ సంద‌ర్భంగా శ్రేయ‌స్‌ను తామే చంపామ‌ని శంక‌ర్ గౌడ అంగీక‌రించాడు. శ్రేయ‌స్‌కు మ‌త్తు ప‌దార్థం ఇచ్చి.. లైంగిక చ‌ర్య అనంత‌రం గొంతు నులిమి హ‌త్య చేశామ‌ని చెప్పాడు. అనంత‌రం మృత‌దేహాన్ని చెరువులో ప‌డేశామ‌ని అంగీక‌రించిన‌ట్టు రామ‌న‌గ‌ర జిల్లా ఎస్పీ సంతోష్ బాబు వెల్ల‌డించారు. క్రిమిన‌ల్ లాయ‌ర్ శంకర్‌గౌడతో పాటు అత‌ని అనుచ‌రుడు అరుణ్‌ను అరెస్ట్ చేసిన‌ట్టు గురువారం విలేక‌రుల‌కు తెలిపారు.

First Published:  27 Jan 2023 6:22 AM GMT
Next Story