Telugu Global
National

అభివృద్ది అంటే కాషాయీకరణేనా? కొత్త అర్దం చెప్తున్న బీజేపీ

క‌ర్నాట‌క‌లోని 7,500 కొత్త తరగతి గదులకు కాషాయ రంగు వేయాలని నిర్ణయించింది బీజేపీ ప్రభుత్వం. ఈ చర్య వివాదాస్పదమవడంతో కాషాయ రంగులో తప్పు ఏముంది? (జాతీయ) త్రివర్ణ పతాకంలో కాషాయరంగు ఉంది. స్వామి వివేకానంద స్వయంగా కాషాయ వస్త్రాన్ని ధరించేవారు అని ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై తమ చర్యను సమర్దించుకున్నారు.

అభివృద్ది అంటే కాషాయీకరణేనా? కొత్త అర్దం చెప్తున్న బీజేపీ
X

కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన ఈ ఎనిమిదేళ్లలో దేశ ఆర్థిక వ్యవస్థ ఎన్నడూ లేనంత దిగజారిపోయింది. పెట్రోల్, డీజిల్, గ్యాస్ తో సహా అన్ని వస్తువుల ధరలు ఆకాశన్నంటుతున్నాయి. నిరుద్యోగం ప్రభుత్వ లెక్కల ప్రకారమే 6.43శాతంగా ఉంది. (ఈ లెక్కల్లో అనేక అసంబద్దత ఉన్నదని నిపుణుల వాదన). ఒకవైపు మేకిన్ ఇండియా, ఆత్మనిర్బర భారత్ లు నినాదాలుగానే మిగిలిపోయి ఇప్పటికీ దేశావ‌తారాల‌కు ఎక్కువశాతం ఇతర దేశాలపైనే ఆధారపడే పరిస్థితి ఉంది. మరో వైపు ప్రభుత్వ రంగ సంస్థలను ఒక్కొక్కటి అమ్మేస్తూ దేశాన్ని పెట్టుబడిదారుల జేబుల్లో పెడుతున్న‌ విధానాలు కొనసాతుతున్నాయి.

ఇంతగా దిగజారిన‌ పరిస్థితుల్లో ఉన్న దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపించేందుకు బీజేపీ నాయకులు ఎంచుకున్న మార్గం కాషాయీకరణ. మీకు ఆకలవుతుందా ? ఇల్లు లేదా ? ఉద్యోగం లేదా ? ఆర్థిక కష్టాల్లో ఉన్నారా ? అన్నిటికీ ఒకే మందు కాషాయం.

గతంలో తమ పార్టీ అధికారంలోకి వస్తే ప్రజలకు ఏమేమి చేస్తామో, ప్రజల ఆర్థిక అభివృద్దికి ఏమేం చర్యలు చేపడతామో చెప్పేవి రాజకీయ పార్టీలు. కానీ బీజేపీ తీరే వేరు. తాము అధికారంలోకి వస్తే ఏయే పట్టణాలు, ఊర్ల పేర్లు మారుస్తామో, వేటిని కూల‌గొట్టి కొత్తగా ఏం కడతామో, ఏఏ గోడల‌కు రంగులుమారుస్తామో...ఇవీ ఆ పార్టీ ఇచ్చే వాగ్దానాలు. ఏ కట్టడాన్ని కూల్చేస్తే ఎన్ని లక్షల ఓట్లొస్తాయి, ఏ గోడలకు రంగులు మారిస్తే ఎన్ని ఓట్లు రాల్తాయి అనే లెక్కలు వేయడం కోసం ఓ నిపుణుల బృందం నాగ్ పూర్ కేంద్రంగా 24/7 పని చేస్తూనే ఉంటుంది. అందుకు తగ్గట్టే బీజేపీ అధికారంలోకి రాగానే వాళ్ళు చేస్తు న్న‌ పనులు కూడా అవే.

ఇప్పుడు బీజేపీ దృష్టంతా దక్షిణాది పైన ఉన్న‌ది. దక్షిణాదిపై దాడి కర్నాటక నుంచి ప్రారంభించిందా పార్టీ. ఆ రాష్ట్రాన్ని ఓ ప్రయోగశాలగా మార్చింది బీజేపీ. అక్కడ విద్య విధానంపై ముందు దాడి ప్రారంభించింది. విప్లవకారుడు, స్వాతంత్య్ర‌ సమరయోధుడు భగత్ సింగ్, మైసూర్ పాలకుడు టిప్పు సుల్తాన్, లింగాయత్ సంఘ సంస్కర్త బసవన్న, ద్రావిడ ఉద్యమ మార్గదర్శకుడు పెరియార్ , సంఘ సంస్కర్త నారాయణ గురులపై ఉన్న అధ్యాయాలను సిలబస్ నుంచి తొలగించారు. ఇప్పుడు రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ వ్యవస్థాపకుడు కేశవ్ బలిరామ్ హెడ్గేవార్ చేసిన ప్రసంగం సవరించిన 10వ తరగతి కన్నడ పాఠ్యపుస్తకంలో వచ్చి చేరింది.

ఆ తర్వాత ఒక ప్రణాళిక ప్రకారం హిజాబ్ మంటను రేపారు. హిజాబ్ ధరించి విద్యాసంస్థల్లోకి రావ‌డానికి వీలులేదని నిషేధాలు విధించారు. అది పెద్ద జాతీయ సమస్య‌గా మారి పెద్ద ఎత్తున మైనారిటీలు ఉద్య‌మించినప్పటికీ కర్నాటక బీజేపీ ప్రభుత్వం పట్టు వీడలేదు. ఇక పాఠశాలల్లో, కళాశాలల్లో కాషాయ కండువాలు కప్పుకున్న హిందుత్వ కార్యకర్తలు, హిజాబ్ ధరించిన యువతులను హేళన చేయ‌టం ప్రారంభించారు. హిజాబ్ ధ‌రించిన విద్యార్థినుల‌ను విద్యా సంస్థల్లోకి రాకుండా అడ్డుకున్నారు. అక్కడి ప్రభుత్వం కోరుకున్నట్టే హిజాబ్ ను రెండు మతాల మధ్య సమస్య‌గా మార్చటానికి ప్ర‌య‌త్నించారు.

ఇక ఇప్పుడు మళ్లీ మరో సమస్య‌ను సృష్టిస్తున్నారు బీజేపీ నేతలు. క‌ర్నాట‌క‌లోని 7,500 కొత్త తరగతి గదులకు కాషాయ రంగు వేయాలని నిర్ణయించింది బీజేపీ ప్రభుత్వం. ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌లో వచ్చిన కథనం ప్రకారం, నవంబర్ 13, ఆదివారం నాడు రాష్ట్రంలోని గడగ్ జిల్లాలో జరిగిన ఒక కార్యక్రమంలో విద్యా శాఖ మంత్రి నగేష్ మాట్లాడుతూ, 'వివేక' పథకం కింద నిర్మిస్తున్న కొత్త తరగతి గదులు ఒకే రీతిలో ఉండేట్టు అన్ని గదులకు కాషాయ‌ రంగు వేస్తున్నాం అని చెప్పుకు రావ‌టం గ‌మ‌నార్హం.

ఈ చర్యపై విద్యావేత్తలు, ప్రతిపక్ష సభ్యుల నుంచి విమర్శలొచ్చాయి. కర్ణాటక కాంగ్రెస్ ఎమ్మెల్యే ప్రియాంక్ ఖర్గే, ANI తో మాట్లాడుతూ, రాష్ట్రంలోని పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు, ఉపాధ్యాయుల కొరత, డ్రాప్ అవుట్ రేట్లు పెరిగిపోవ‌టం వంటి ఇతర సమస్యలను ఏ మాత్రం పట్టించుకోని ప్రభుత్వానికి గోడలకు కాషాయరంగు వేయడం ముఖ్యమైపోయిందని విమర్శించారు. మన జాతీయ జెండాలో ఉన్న మూడు రంగులను వేయొచ్చుకదా అని ఖర్గే అన్నారు.

ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై బాలల దినోత్సవం (నవంబర్ 14) నాడు కలబుర్గీ జిల్లా మడియాల్‌లోని ప్రభుత్వ ఉన్నత ప్రాథమిక పాఠశాలలో శంకుస్థాపన చేసి అధికారికంగా 'వివేక' పథకాన్ని ప్రారంభించారు.

తరగతి గదులకు కాషాయ రంగు వివాదం గురించి బొమ్మైని అడిగినప్పుడు, "కాషాయ రంగులో తప్పు ఏమిటి? (జాతీయ) త్రివర్ణ పతాకంలో కాషాయరంగు ఉంది. స్వామి వివేకానంద స్వయంగా కాషాయ వస్త్రాన్ని ధరించేవారు" అని అన్నారు.

"ప్రగతిశీల" మార్పులు చేసినప్పుడల్లా ప్రతిపక్ష పార్టీ వివాదాలను సృష్టిస్తోంది అని ఆయన కాంగ్రెస్ పై మండి పడ్డారు.

విద్యా శాఖ మంత్రి నగేష్ కూడా కాంగ్రెస్‌పై విరుచుకుపడ్డారు, "నేను వారిని అడగాలనుకుంటున్నాను, వారి (పార్టీ) జెండాలో కాషాయం ఉంది కదా. మరి దానిని ఎందుకు ఉంచారు? ముందు దానిని తొలగించండి." అన్నారాయన‌. "కొంతమందికి కాషాయ‌ రంగు పట్ల అలెర్జీ ఉంటుంది," అని ఆయన విమర్శించారు.

కాగా ఎవరెన్ని చెప్పినా ఏం మాట్లాడినా తరగతి గదులకు కాషాయ రంగు వేసి తీరాలని కర్నాటక బీజెపి ప్రభుత్వం పట్టుదలగా ఉంది.

మరి ఈ 7,500 తరగతి గదులకు కాషాయ రంగులు వేయడం వల్ల బీజేపీకి రాబోయే ఎన్నికల్లో అదనంగా ఓట్ల శాతం ఎంత పెరుగుతుందో ఈ పాటికి ఆ పార్టీ నిపుణులు లెక్కలుగట్టి చెప్పేసే ఉంటారు.

First Published:  15 Nov 2022 2:14 AM GMT
Next Story