Telugu Global
National

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు: బంధుప్రీతి, అవినీతి బీజేపీలోనే ఎక్కువని తేల్చిచెప్పిన NDTV సర్వే

వంశపారంపర్య పరిపాలనకు, అవినీతికి వ్యతిరేకంగా ప్రధాని మోడీ ప్రతి రోజూ తన ఉపన్యాసాల్లో తప్పకుండా చెప్తారు. ఈ రెండు దేశానికి అత్యంత చేటు తెస్తాయని ఆయనే కాకుండా బీజేపీ నాయకులు 24 గంటలూ ఊదరకొడుతూ ఉంటారు. అయితే ఆశ్చర్యకరంగా కర్నాటక లో వంశపారంపర్య పరిపాలనలో, అవినీతిలో బీజేపీనే ముందుందని ప్రజలు కుండబద్దలు కొడుతున్నారని NDTV సర్వే తేల్చింది.

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు: బంధుప్రీతి, అవినీతి బీజేపీలోనే ఎక్కువని తేల్చిచెప్పిన NDTV సర్వే
X

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు: బంధుప్రీతి, అవినీతి బీజేపీలోనే ఎక్కువని తేల్చిచెప్పిన NDTV సర్వే

ఈ నెల 10వ తేదీన కర్నాటక అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అనేక సంస్థలు సర్వేలు చేస్తున్నాయి. ఎవరు గెలుస్తారు, ఎవరు ఓడుతారు, ఎవరికి ఎన్ని సీట్లు వస్తాయి, పెద్ద పార్టీగా ఏ పార్టీ ఏర్పడుతుంది. ముఖ్యమంత్రిగా ప్రజలు ఎవరిని కోరుకుంటున్నారు, ఏ వర్గం ప్రజలు ఏ పార్టీకి ఓట్లేస్తారు, ఏ కులం ఏ పక్షముంది.. ఇలా రకరకాల సర్వే ఫలితాలు రోజుకొకటి వెలువడుతున్నాయి. దాదాపు అన్ని సర్వేలు కాంగ్రెస్ మెజార్టీ సాధించి ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని, లేదా పెద్ద పార్టీగా అవతరిస్తుందని తేల్చాయి.

ఈ నేపథ్యంలో ప్రముఖ ఛానల్ NDTV ,సెంటర్ ఫర్ ది స్టడీ ఆఫ్ డెవలపింగ్ సొసైటీస్(CSDS) చేసిన సర్వే పలు ఆసక్తికర విషయాలను వెల్లడించింది.

వంశపారంపర్య పరిపాలనకు, అవినీతికి వ్యతిరేకంగా ప్రధాని మోడీ ప్రతి రోజూ తన ఉపన్యాసాల్లో తప్పకుండా చెప్తారు. ఈ రెండు దేశానికి అత్యంత చేటు తెస్తాయని ఆయనే కాకుండా బీజేపీ నాయకులు 24 గంటలూ ఊదరకొడుతూ ఉంటారు. అయితే ఆశ్చర్యకరంగా కర్నాటక లో వంశపారంపర్య పరిపాలనలో, అవినీతిలో బీజేపీనే ముందుందని ప్రజలు కుండబద్దలు కొడుతున్నారని NDTV సర్వే తేల్చింది.

NDTV, CSDS సర్వేలో 59 శాతం మంది ప్రజలు బీజేపీ వంశపారంపర్య రాజకీయాలకు పాల్పడుతోందని, ఆ పార్టీలోనే ఎక్కువగా బంధుప్రీతి ఉందని తేల్చారు. ఇదే విషయంపై కాంగ్రెస్ వైపు 30 శాతం ప్రజలు వేలు చూపించగా, జేడీఎస్ వైపు 8 శాతం మాత్రమే.

ఇక అవినీతి విషయంలో బీజేపీ తీవ్రమైన అవినీతి పార్టీ అని 59 శాతం మంది ప్రజలు, కాంగ్రెస్ అవినీతి పార్టీ అని 35 శాతం ప్రజలు, జేడీఎస్ అవినీతి పార్టీ అని 3 శాతం ప్రజలు ఆ సర్వేలో తెలిపారు.

ఇక మిగతా వివరాల్లోకి వెళ్తే.. ముఖ్యమంత్రిగా అత్యంత ప్రజాదరణ కాంగ్రెస్ నాయకుడు సిద్దరామయ్యకు దక్కగా రెండవ‌ స్థానంలో బీజేపీ నాయకుడు బసవరాజ్ బొమ్మై, మూడవ స్థానంలో జేడీఎస్ నాయకుడు కుమార స్వామి నిల్చారు. కాంగ్రెస్ కు చెందిన డికె శివకుమార్ నాలుగవ‌ స్థానంలో ఉండగా, ఆశ్చర్యకరంగా నాలుగు సార్లు కర్నాటక‌ ముఖ్యమంత్రిగా పని చేసిన బీజేపీ నాయకుడు యడ్యూరప్ప 5వ స్థానంలో ఉన్నారు.

మరో వైపు కర్నాటక ప్రజలు అభ్యర్థులకన్నా పార్టీలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారని NDTV ,CSDS సర్వేలో తేలింది. 56 శాతం మంది ప్రజలు పార్టీకే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వగా, 38 శాతం మంది అభ్యర్థికి ప్రాధాన్యత ఇచ్చారు. 4 శాతం మంది ప్రజలు మాత్రం ముఖ్యమంత్రి అభ్యర్థిని బట్టి తమ ఎమ్మెల్యేకు ఓటు వేస్తామని తేల్చారు.

ఇందులోనూ కాంగ్రెస్, జేడీఎస్ ల‌కు మద్దతు ఇచ్చే ఓటర్లు ఎక్కువగా పార్టీని ముఖ్యమైన అంశంగా భావిస్తున్నారు. బీజేపీ ఓటర్లు మాత్రం భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు

రాష్ట్ర అభివృద్దికి కాంగ్రెస్ మాత్రమే కృషి చేస్తుందని 47 శాతం మంది భావిస్తుండగా బీజేపీయే అభివృద్ది చేస్తుందని 37 శాతం మంది అభిప్రాయపడుతున్నారు. ఈ విషయంలో జేడీఎస్ కు 14 శాతం మంది ప్రజలు మాత్రమే ఓట్లు వేశారు.

రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ మాత్రమే మతసామరస్యాన్ని కాపాడుతుందని 49 శాతం మంది ప్రజలు నమ్ముతుండగా, 34 శాతం మంది మాత్రం బీజేపీకి ఓటు వేశారు. జేడీఎస్ కు 14 శాతం మంది మద్దతు తెలిపారు.

ఇక ధనిక, మధ్యతరగతి, పేద, గ్రామీణ, పట్టణ ఓటర్లలో కూడా వారి వారి ఎంపికలో తేడాలున్నాయి. పేద ఓటర్లలో కాంగ్రెస్‌కు 50 శాతం మంది మద్దతు పలకగా బీజేపీకి 23 శాతం మంది మాత్రమే సపోర్ట్ గా ఉన్నారు. ధనిక ఓటర్లలో కాంగ్రెస్ కు 31 శాతం మంది మద్దతు పలకగా, బీజేపీకి 46 శాతం మంది మద్దతుగా నిల్చారు. ఇక గ్రామీణ ఓటర్లు అధికభాగం కాంగ్రెస్ కు మద్దతు పలుకుతుండగా, పట్టణ ఓటర్లు బీజేపీకి సపోర్ట్ చేస్తున్నారు.

First Published:  4 May 2023 3:29 AM GMT
Next Story