Telugu Global
National

ఎంపీ ప్రజ్వల్‌ రేవణ్ణపై సస్పెన్షన్‌ వేటు.. - జేడీఎస్‌ కీలక నిర్ణయం

ఈ పరిణామానికి ముందు ప్రజ్వల్‌ బాబాయి, మాజీ ముఖ్యమంత్రి హెచ్‌డీ కుమారస్వామి విలేకరులతో మాట్లాడారు. ఈ వివాదం వెనక కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌ హస్తం ఉందని ఆరోపించారు.

ఎంపీ ప్రజ్వల్‌ రేవణ్ణపై సస్పెన్షన్‌ వేటు.. - జేడీఎస్‌ కీలక నిర్ణయం
X

లైంగిక వేధింపుల ఆరోపణల నేపథ్యంలో హాసన సిట్టింగ్‌ ఎంపీ ప్రజ్వల్‌ రేవణ్ణపై జేడీఎస్‌ సస్పెన్షన్‌ వేటు వేసింది. ఈ మేరకు పార్టీ కోర్‌ కమిటీ నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే ప్రజ్వల్‌పై వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణలు కన్నడ రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో జేడీఎస్‌ మంగళవారం ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.

ఇదిలా ఉంటే.. ఈ పరిణామానికి ముందు ప్రజ్వల్‌ బాబాయి, మాజీ ముఖ్యమంత్రి హెచ్‌డీ కుమారస్వామి విలేకరులతో మాట్లాడారు. ఈ వివాదం వెనక కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌ హస్తం ఉందని ఆరోపించారు. వెంటనే ఆయన్ని పదవి నుంచి తొలగించాలని డిమాండ్‌ చేశారు. ‘ఆ వీడియోల్లో ప్రజ్వల్‌ ముఖం కనిపిస్తోందా? అవి అతడివేనన్న ఆధారం ఏంటి? అయినా సరే నైతికత ఆధారంగా చర్యలు ఉంటాయి‘ అని ఆయన వ్యాఖ్యానించారు.

ఈ వ్యవహారంపై సిట్‌ దర్యాప్తు చేస్తోందన్న మాజీ సీఎం.. వీడియో క్లిప్పులు ఉన్న పెన్‌ డ్రైవ్‌లు ఎక్కడి నుంచి వచ్చాయి.. ఎవరు పంపిణీ చేశారనే విషయాలపైనా దర్యాప్తు సాగాలన్నారు. అసలు ఈ వీడియోల వెనక ఉన్నది ఎవరు.. వారు స్త్రీల పరిరక్షకులా.. అలాగే తప్పు చేసిన వారికి శిక్ష తప్పదు.. అంటూ స్పష్టం చేశారు. ప్రజ్వల్‌పై అభియోగాలు వాస్తవమని తేలితే చట్టప్రకారం శిక్ష తప్పదని గతంలో ఆయన వెల్లడించిన విషయం గమనార్హం. కాంగ్రెస్‌ చేస్తున్న విమర్శలను ప్రస్తావించిన ఆయన.. బీజేపీకి, ప్రధాని మోడీకి ఈ కేసుతో సంబంధమేమిటని ప్రశ్నించారు. ఇక దేవెగౌడకు, తనకు ఈ కేసుతో ఎటువంటి సంబంధం లేదని కుమారస్వామి చెప్పారు.

First Published:  30 April 2024 8:48 AM GMT
Next Story