Telugu Global
National

భార్యలు ఇంట్లో ఖాళీగా కూర్చోవద్దు.. కర్ణాటక హైకోర్టు సంచలన వ్యాఖ్యలు

పెళ్లి తర్వాత మహిళలు ఇంటికే పరిమితం కావడంపై కర్ణాటక హైకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. పెళ్లికి ముందు ఉద్యోగం చేసిన భార్యలు పెళ్లి తర్వాత కూడా ఖాళీగా ఉండకూడదని.. మళ్లీ పని చేయాలని తీర్పు ఇచ్చింది.

భార్యలు ఇంట్లో ఖాళీగా కూర్చోవద్దు.. కర్ణాటక హైకోర్టు సంచలన వ్యాఖ్యలు
X

భర్త బయట పనులు, ఉద్యోగాలు చేస్తుంటే భార్య ఇంటిని చక్కదిద్దే పనులు చేయడం సమాజంలో ఆది నుంచి ఉంది. అయితే కాలం మారి మహిళలు కూడా ఉద్యోగాలు చేయడం మొదలుపెట్టారు. పురుషులతో సమానంగా పనులు చేస్తున్నారు. అయితే కొందరు మహిళలు పెళ్లికి ముందు ఉద్యోగాలు చేస్తూ పెళ్లి తర్వాత మానేసి ఇంటికి పరిమితమవుతున్నారు. పెళ్లి తర్వాత మహిళలు ఇంటికే పరిమితం కావడంపై కర్ణాటక హైకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. పెళ్లికి ముందు ఉద్యోగం చేసిన భార్యలు పెళ్లి తర్వాత కూడా ఖాళీగా ఉండకూడదని.. మళ్లీ పని చేయాలని హైకోర్టు తీర్పు ఇచ్చింది.

కర్ణాటకకు చెందిన ఓ మహిళ భర్త నుంచి విడాకులు తీసుకుంది. ఆమెకు మూడు లక్షల రూపాయల పరిహారం, మెయింటెనెన్స్ కోసం నెలకు పది వేల రూపాయలు ఇవ్వాలని మేజిస్ట్రేట్ కోర్టు భర్తను ఆదేశించింది. అయితే అంత మొత్తంలో పరిహారం, మెయింటెనెన్స్ డబ్బు చెల్లించలేననిస్థితిలో ఉన్నానంటూ భర్త సెషన్స్ కోర్టును ఆశ్రయించాడు. ఈ కేసును పరిశీలించిన సెషన్స్ కోర్టు మెయింటెనెన్స్ ఖర్చును రూ.5 వేలకు, పరిహారాన్ని రూ.రెండు లక్షలకు తగ్గిస్తూ తీర్పు ఇచ్చింది.

సెషన్స్ కోర్టు తీర్పుపై సదరు మహిళ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. సెషన్స్ కోర్టు తీర్పు వల్ల తనకు నష్టం జరుగుతుందని వాపోయింది. ఈ పిటిషన్‌ను విచారించిన హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. మీకు భర్త నుంచి అదనంగా ఎందుకు భరణం రావాలని ప్రశ్నించింది. పెళ్లికి ముందు ఉద్యోగం చేసేవారు.. పెళ్లి తర్వాత ఎందుకు మానేశారని అడిగింది. కోర్టు అడిగిన ప్రశ్నకు మహిళ నుంచి సరైన సమాధానం రాలేదు. దీంతో హైకోర్టు ఈ పిటిషన్‌ను కొట్టివేసింది.

గతంలో ఉద్యోగాలు చేసిన భార్యలు ఇంట్లో ఖాళీగా ఉండకుండా ఏదో ఒక పని చేయాలని హైకోర్టు సూచించింది. భర్త నుంచి భరణం తీసుకునే మహిళలు కూడా ఏదో ఒక పని చేసుకుని బతకాలని వ్యాఖ్యానించింది.

First Published:  6 July 2023 1:16 PM GMT
Next Story