Telugu Global
National

దత్త పుత్రులకూ కారుణ్య నియామకాలు

కారుణ్య నియామకాల విషయంలో సొంత పిల్లలకు ఉన్న హక్కులు దత్తత తీసుకున్న వారికి ఉండవా..? తండ్రి మరణిస్తే వివాహిత అయిన కుమార్తెకు ఆ ఉద్యోగం ఇవ్వరా..? ఇలాంటి కేసుల్లో ఇటీవల కోర్టులు ఆసక్తికర తీర్పులిచ్చాయి.

దత్త పుత్రులకూ కారుణ్య నియామకాలు
X

ప్రభుత్వ ఉద్యోగి మరణిస్తే వారి వారసులకు ఉద్యోగం ఇచ్చేందుకు సవాలక్ష కండీషన్లు పెడుతుంటారు ఉన్నతాధికారులు. వారి సంతానమేనని సర్టిఫికెట్ తెచ్చుకోవడంతోపాటు, ఇతర వారసులెవరూ పోటీ లేనట్టుగా వారి దగ్గర కూడా సంతకాలు తీసుకోవాలంటారు. ఇతర ప్రధాన ఆదాయ వనరులేవీ లేవన్నట్టుగా రుజువులు కూడా చూపించాల్సి ఉంటుంది. ఇక్కడి వరకూ ఓకే. అయితే కారుణ్య నియామకాల్లో దత్తత వచ్చిన వారికి అవకాశం లేదనే నిబంధన కూడా ఉంది. దీనిపై కర్నాటక హైకోర్టు ఆసక్తికర తీర్పు వెలువరించింది.

కారుణ్య నియామకాల విషయంలో సొంత పిల్లలకు ఉన్న హక్కులే దత్తత తీసుకున్న పిల్లలకూ ఉంటాయని స్పష్టం చేసింది కర్నాటక హైకోర్టు. అలాంటి తేడా చూపిస్తే ఇక దత్తత స్వీకారానికి అర్థమే ఉండదని చెప్పింది. దత్తత వచ్చిన కుమారుడికి కారుణ్య నియామకం కింద ఉద్యోగం ఇవ్వలేమంటూ ఇటీవల కర్నాటక ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలు సరికావని చెప్పింది హైకోర్టు. దత్తత వచ్చిన పిల్లలు కూడా కారుణ్య నియామకాలకు అర్హులేనని తేల్చి చెప్పింది. జస్టిస్ సూరజ్ గోవిందరాజ్, జస్టిస్ సి.బసవరాజ్ తో కూడిన ద్విసభ్య ధర్మాసనం ఈమేరకు ప్రభుత్వ ప్రాసిక్యూషన్ వాదనలు కొట్టివేసింది.

వివాహిత కుమార్తెలు కూడా అర్హులే..

ఆమధ్య ఏపీ హైకోర్టు కూడా ఇలాంటి ఆసక్తికర తీర్పు వెలువరించింది. తండ్రి మరణం తర్వాత ఆర్టీసీలో ఆయన ఉద్యోగం తనకు ఇప్పించాలంటూ కుమార్తె ఉన్నతాధికారులకు దరఖాస్తు చేసుకుంది. ఆమె ఏకైక కుమార్తే అయినా అప్పటికే ఆమెకు వివాహం అయింది. భర్త ఆదాయాన్ని కారణంగా చూపిస్తూ ఆర్టీసీ కారుణ్య నియామకం కుదరదని చెప్పింది. ఆమె హైకోర్టుని ఆశ్రయించడంతో కోర్టు ఆర్టీసీకి వ్యతిరేకంగా తీర్పునిచ్చింది. వివాహిత అనే కారణంతో కుమార్తెకు ఉన్న హక్కులను కాలరాయకూడదని చెప్పింది. పెళ్లయినా, కాకపోయినా.. విద్యార్హతలు ఉంటే కారుణ్య నియామకానికి ఆడబిడ్డలు అర్హులేనని స్పష్టం చేసింది. వితంతువు అయిన తల్లి బాగోగులు చూసుకునే బాధ్యత కుమార్తెదే అయినప్పుడు, తండ్రి ఉద్యోగం ఆమెకు ఎందుకు ఇవ్వకూడదని ప్రశ్నించింది ఏపీ హైకోర్టు.

First Published:  23 Nov 2022 2:03 AM GMT
Next Story