Telugu Global
National

విమర్శలను కాదని కర్నాటక స్కూల్స్ లో భగవద్గీత బోధన..

ఖురాన్ మతపరమైన గ్రంథమని.. భగవద్గీత మతపరమైన గ్రంథం కాదని అంటున్నారు. కేవలం నైతికత గురించి మాత్రమే గీత బోధిస్తుందని, విద్యార్థులకు ప్రేరణ, స్ఫూర్తిని ఇస్తుందని ప్రభుత్వం చెబుతోంది.

విమర్శలను కాదని కర్నాటక స్కూల్స్ లో భగవద్గీత బోధన..
X

కర్నాటకలోని స్కూళ్లలో భగవద్గీతను కూడా ఒక పాఠ్యాంశంగా చేర్చాలనే నిబంధనపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం వెనక్కు తగ్గినట్టే తగ్గి మరో రకంగా ఆ నిర్ణయాన్ని అమలు చేయబోతోంది. నైతిక విద్య అనే పేరుతో భగవద్గీత బోధనలకు లైన్ క్లియర్ చేసింది. గీతలో మతం లేదని, అందుకే నైతిక విద్యగా బోధిస్తున్నామని చెప్పారు కర్నాటక విద్యా మంత్రి బీసీ న‌గేష్‌. ఇది పాఠ్యాంశం కాదని, అయితే ఇందులో పరీక్షలు మాత్రం నిర్వహిస్తామన్నారు.

డిసెంబర్ నుంచి మొదలు..

కర్నాటకలోని అన్ని స్కూల్స్ లో డిసెంబర్ నుంచి నైతిక విద్యలో భాగంగా భగవద్గీతను బోధించబోతున్నారు. దీనికి సంబంధించి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. గతంలో భగవద్గీతను ఓ సబ్జెక్ట్ గా బోధించాలనే ప్రతిపాదన వచ్చినప్పుడు ముస్లింల నుంచి వ్యతిరేకత వ్యక్తమైంది. భగవద్గీతతో పాటు ఖురాన్ కూడా బోధించాలని వారు డిమాండ్ చేశారు. అయితే కర్నాటక విద్యాశాఖ మంత్రి బీసీ న‌గేష్‌.. భగవద్గీత బోధనపై సుదీర్ఘ వివరణ ఇస్తున్నారు. ఖురాన్ మతపరమైన గ్రంథమని.. భగవద్గీత మతపరమైన గ్రంథం కాదని అంటున్నారాయన. కేవలం నైతికత గురించి మాత్రమే గీత బోధిస్తుందని, విద్యార్థులకు ప్రేరణ, స్ఫూర్తిని ఇస్తుందని చెబుతున్నారు.

ప్రత్యేక పాఠం కాదు, నైతిక విద్య..

భగవద్గీతను పాఠ్యాంశంగా చేర్చాలని కర్నాటక ప్రభుత్వం ఫిక్స్ అయింది. ప్రతిపక్షాలనుంచి విమర్శలు రావడంతో ప్రత్యేక పాఠ్యాంశంగా బోధించాలనే ప్రతిపాదన విరమించుకున్నామని, అందులోని బోధనలు నైతిక విద్యలో భాగంగా ప్రవేశపెడుతున్నామని చెబుతోంది ప్రభుత్వం. నిపుణుల కమిటీ సూచనల మేరకు డిసెంబర్ నుంచి పాఠశాలల్లో గీత బోధనలు ప్రారంభం కాబోతున్నాయి.

రాజులు, రాజ్యాలు..

ఆల్రడీ చరిత్ర సబ్జెక్ట్ లో రాజ్యాలు, రాజుల ప్రస్తావన ఉంటుంది. కానీ కర్నాటకలోని బీజేపీ ప్రభుత్వం హిందూ రాజుల్ని హైలెట్ చేస్తూ.. 6 నుంచి 10 తరగతుల సోషల్ స్టడీస్ పాఠ్యాంశాల్లో మార్పులు చేస్తోంది. గంగా, హొయసలు, మైసూర్ వడయార్, విజయపుర సామ్రాజ్యం, శాతవాహన, కళ్యాని చాళుక్య.. ఇలా కొన్ని సంస్థానాలను చరిత్ర పుస్తకాల్లో అదనంగా చేరుస్తున్నారు. దీనిపై కూడా తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. కానీ ప్రభుత్వం మాత్రం వెనక్కు తగ్గేలా లేదు.

First Published:  21 Sep 2022 1:48 PM GMT
Next Story