Telugu Global
National

కర్ణాటక ఎన్నికలు : మామిడి చెట్టుపై పెట్టెల నిండా డబ్బు.. స్వాధీనం చేసుకున్న అధికారులు

తాజాగా ఓ పార్టీ నాయకుడి ఇంటి ఆవరణలో ఉన్న ఓ మామిడి చెట్టుపై కోటి రూపాయల నగదు దాచిపెట్టగా దాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

కర్ణాటక ఎన్నికలు : మామిడి చెట్టుపై పెట్టెల నిండా డబ్బు.. స్వాధీనం చేసుకున్న అధికారులు
X

దశాబ్దాల కిందటితో పోలిస్తే ఇప్పుడు ఎన్నికల నిర్వహణ పూర్తిగా ఖర్చుతో కూడినదిగా మారింది. ఎన్నికల్లో ఎలాగైనా గెలిచేందుకు పార్టీలు వేలాది కోట్లు కుమ్మరిస్తున్నాయి. అభ్యర్థులు కూడా ఎన్నికల్లో విజయం కోసం ఇంటింటా డబ్బు పంచేందుకు, మందు, బిర్యానీ, ప్రచారానికి జనాన్ని తరలించేందుకు కోట్లు ఖర్చు పెడుతున్నారు. ఇక ఓటింగ్ దగ్గర అయ్యేకొద్దీ నాయకుల నుంచి ద్వితీయ స్థాయి శ్రేణులకు భారీగా నగదు చేతులు మారుతూ ఉంటుంది. ఆ సమయంలోనే ఐటీ అధికారులు దాడులు జరుపుతూ కోట్లకొద్దీ నగదు స్వాధీనం చేసుకుంటుంటారు.

ఈనెల 10వ తేదీన కర్ణాటకలో ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఎన్నికలకు కేవలం వారం మాత్రమే సమయం ఉండడంతో ఆ రాష్ట్రంలో డబ్బు ఏరులై పారుతోంది. ఒకరి నుంచి మరొకరికి డబ్బు చేతులు మారుతోంది. అక్రమంగా తరలే డబ్బును స్వాధీనం చేసుకోవడంలో ఐటీ అధికారులు నిమగ్నమయ్యారు. ఎక్కడికక్కడ తనిఖీలు జరుపుతూ అక్రమంగా తరలించే డబ్బును స్వాధీనం చేసుకుంటున్నారు.

తాజాగా ఓ పార్టీ నాయకుడి ఇంటి ఆవరణలో ఉన్న ఓ మామిడి చెట్టుపై కోటి రూపాయల నగదు దాచిపెట్టగా దాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండటంతో ఐటీ అధికారులు పార్టీల అభ్యర్థులు, వారి అనుచరులు, బంధువుల ఇళ్లలో సోదాలు జరుపుతున్నారు. పుత్తూరు నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న అశోక్ కుమార్ రాయ్, అతడి సోదరుడు సుబ్రహ్మణ్య రాయ్ ఇంట్లో అధికారులు బుధవారం తనిఖీలు చేపట్టారు. ఇంటి ఆవరణలో మామిడి చెట్టుపై బాక్సులు ఉండడం అధికారులు గమనించారు. చెట్టెక్కి చూడగా బాక్సుల నిండా నోట్ల కట్టలు కనిపించాయి. మొత్తం కోటి రూపాయల నగదును అధికారులు సీజ్ చేశారు.

రాష్ట్రవ్యాప్తంగా అధికారులు జరుపుతున్న దాడుల్లో కోట్ల కొద్దీ అక్రమంగా తరలిస్తున్న డబ్బు పట్టుబడుతోంది. ఇప్పటివరకు ఈసీ రూ.300 కోట్లకు పైగా విలువైన లెక్క చూపని నగదు, వస్తువులను స్వాధీనం చేసుకుంది. ఒక్క బెంగళూరు నగరంలోనే అధికారులు ఇప్పటివరకు రూ. 80 కోట్లకు పైగా నగదును స్వాధీనం చేసుకున్నారు.

First Published:  3 May 2023 10:04 AM GMT
Next Story