Telugu Global
National

కర్ణాటక డీజీపీని సీబీఐ చీఫ్‌గా నియమించిన కేంద్ర ప్రభుత్వం

సీబీఐ డైరెక్టర్‌గా పని చేస్తున్న సుభోద్ కుమార్ జైస్వాల్ పదవీ కాలం ముగియనుండటంతో.. ఆయన స్థానంలో నూతన డైరెక్టర్‌గా ప్రవీణ్ సూద్‌ను నియమించారు.

కర్ణాటక డీజీపీని సీబీఐ చీఫ్‌గా నియమించిన కేంద్ర ప్రభుత్వం
X

సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ)కి కొత్త బాస్‌ను నియమిస్తూ కేంద్ర హోం శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. 1986 బ్యాచ్‌కు చెందిన ఐపీఎస్ అధికారి ప్రవీణ్ సూద్‌ను సీబీఐకి కొత్త డైరెక్టర్‌గా కేంద్ర ప్రభుత్వం నియమించింది. ప్రస్తుతం సీబీఐ డైరెక్టర్‌గా పని చేస్తున్న సుభోద్ కుమార్ జైస్వాల్ పదవీ కాలం ముగియనుండటంతో.. ఆయన స్థానంలో నూతన డైరెక్టర్‌గా ప్రవీణ్ సూద్‌ను నియమించారు. జైస్వాల్ పదవీ కాలం ముగిసిన తర్వాత ప్రవీణ్ సూద్ సీబీఐ చీఫ్‌గా బాధ్యతలు చేపడతారు.

కొత్త సీబీఐ డైరక్టర్‌ నియామకం కోసం ముగ్గురు సభ్యులతో కూడిన ఉన్నత స్థాయి కమిటీని నియమించారు. ఈ కమిటీ పలువురి పేర్లను పరిశీలించింది. పలు ఇంటర్వ్యూలు, సంప్రదింపుల అనంతరం సీనియర్ ఐపీఎస్ అధికారులైన ప్రవీణ్ సూద్, సుధీర్ సక్సేనా, తాజ్ హాసన్‌ను చివరి లిస్టులో చేర్చారు. వీరి నుంచి ఒకరిని సీబీఐ చీఫ్‌గా ఎంపిక చేయాలని ప్రధాని నరేంద్ర మోడీ, సీజేఐ డీవై చంద్రచూడ్, లోక్‌సభలో ప్రతిపక్ష నేత అధిర్ రంజన్‌లతో కూడిన ముగ్గురు సభ్యుల అత్యున్నత నియామక కమిటీకి సిఫార్సు చేశారు. తాజాగా అత్యున్నత కమిటీ కర్ణాటక డీజీపీగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న ప్రవీణ్ సూద్‌ను సీబీఐ కొత్త బాస్‌గా ఎంపిక చేసింది.

హిమాచల్‌ప్రదేశ్‌కు చెందిన ప్రవీణ్ సూద్.. ఢిల్లీలో పెరిగారు. ప్రవీణ్ తండ్రి ప్రకాశ్ సూద్ ఢిల్లీలోని ఒక ప్రభుత్వ కార్యాలయంలో క్లర్క్‌గా పని చేశారు. తల్లి కమలేశ్ ఢిల్లీ ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పని చేసి.. చనిపోయారు. ఐఐటీ ఢిల్లీలో చదువుకున్న ప్రవీణ్ సూద్.. ఆ తర్వాత సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్స్ రాసి ఐపీఎస్‌గా ఎంపికయ్యారు. కర్ణాటక క్యాడర్ ఐపీఎస్‌గా 1989లో తొలి సారిగా మైసూరులో పని చేశారు. అక్కడి నుంచి క్రమంగా ఎదుగుతూ వచ్చిన ప్రవీణ్ సూద్.. ప్రస్తుతం కర్ణాటక డీజీపీగా పని చేస్తున్నారు. ఆయన ఐఐఎం అహ్మదాబాద్ నుంచి పబ్లిక్ పోలీస్ అండ్ మేనేజ్‌మెంట్‌లో ఎంబీఏ పూర్తి చేశారు.

ప్రవీణ్ సూద్ రెండేళ్ల పాటు సీబీఐ చీఫ్‌గా పని చేస్తారు. అయితే నిబంధనల ప్రకారం ఆయన పదవీ కాలాన్ని ఐదేళ్ల వరకు పొడిగించే అవకాశం ఉన్నది. కర్ణాటక ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాతి రోజే ఆ రాష్ట్ర డీజీపీని సీబీఐ బాస్‌గా నియమించడంపై చర్చ జరుగుతోంది.

First Published:  14 May 2023 12:36 PM GMT
Next Story