Telugu Global
National

కర్నాటక: రోజు రోజుకూ మారుతున్న రాజకీయాలు...సర్వే ఫలితాల్లో స్పష్టమైన మార్పు

ఫిబ్రవరిలో నిర్వహించిన సర్వే కన్నా మార్చ్ లో నిర్వహించిన సర్వేలో కాంగ్రెస్ పార్టీకి వచ్చే సీట్ల సంఖ్య గణనీయంగా పెరగింది. అధికార బీజేపీ తన స్ధానాల సంఖ్యను ఫిబ్రవరితో పోలిస్తే మార్చిలో మరింత కోల్పోయింది. అలాగే జేడీఎస్ ఈ ఎన్నికల్లో కీలక పాత్ర పోషించబోతుందన్న అంచనాలు కూడా తారుమారయ్యేలా ఉన్నాయి.

కర్నాటక: రోజు రోజుకూ మారుతున్న రాజకీయాలు...సర్వే ఫలితాల్లో స్పష్టమైన మార్పు
X

కర్నాకలో వచ్చేనెల 10న జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో గెలవడానికి రాజకీయ పక్షాలు శక్తులన్నీ కూడదీసుకొని పనిచేస్తున్నాయి. అక్కడ రాజకీయ పరిస్థితులు రోజుకో మలుపు తీసుకుంటున్నాయి. అధికార బీజేపీ, ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీల మధ్య పోరు నువ్వా నేనా అన్నట్టు సాగుతోంది. జేడీఎస్ మూడో స్థానంలో కొనసాగుతోంది.

ప్రస్తుత ఎన్నికల ప్రచారం, రాజకీయ పరిస్థితులు విశ్లేషిస్తే మళ్ళీ సంకీర్ణ ప్రభుత్వమే వస్తుందనే వాదనలు వినపించాయి. ఇప్పటి వరకు జరిగిన సర్వేలు కూడా అదే విషయాన్ని చెప్పాయి.

అయితే రోజు రోజుకు మారిపోతున్న రాజకీయ పరిస్థితులు గణాంకాలను మార్చి వేస్తున్నాయి. ఫిబ్రవరి నెలలో జరిగిన సర్వేలన్నీ కూడా ఏ పార్టీకి పూర్తి మెజార్టీ రాదని తేల్చేశాయి. కాంగ్రెస్ అతి పెద్ద పార్టీగా నిలుస్తుందని , ఆ పార్టీకన్నా 5, 10 సీట్ల తేడాతో బీజేపీ రెండవ స్థానంలో నిలుస్తుందని జేడీఎస్ కు 25 సీట్ల‌దాకా రావచ్చని సర్వేలు అంచనా వేశాయి.

ఇక మార్చ్ నెలలో నిర్వహించిన సర్వేల్లో పరిస్థితిల్లోమార్పు వచ్చినట్టు కనపడుతోంది. కాంగ్రెస్ పార్టీ ఘన విజయంసాధించబోతున్నట్లు ఏబీపీ-సీ ఓటర్ సర్వే తేల్చింది. అధికార బీజేపీకి ఓటర్లు షాకివ్వబోతున్నట్టు ఈ సర్వే తెలిపింది.

గత రెండు నెలలుగా రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు అందరి అంచనాలను తలకిందులు చేస్తున్నట్టు తెలుస్తోంది. తాజాగా నిర్వహించిన 'లోక్ పోల్' సర్వే లో కాంగ్రెస్ పార్టీ పూర్తి విజయం సాధిస్తుందని తెలిపింది. లోక్ పోల్ ఫిబ్రవరిలో ఒకసారి మళ్ళీ మార్చ్ లో మరో సారి సర్వే నిర్వహించింది.

ఫిబ్రవరిలో నిర్వహించిన సర్వే కన్నా మార్చ్ లో నిర్వహించిన సర్వేలో కాంగ్రెస్ పార్టీకి వచ్చే సీట్ల సంఖ్య గణనీయంగా పెరగింది. అధికార బీజేపీ తన స్ధానాల సంఖ్యను ఫిబ్రవరితో పోలిస్తే మార్చిలో మరింత కోల్పోయింది. అలాగే జేడీఎస్ ఈ ఎన్నికల్లో కీలక పాత్ర పోషించబోతుందన్న అంచనాలు కూడా తారుమారయ్యేలా ఉన్నాయి.

'లోక్ పోల్' ఫిబ్రవరిలో నిర్వహించిన సర్వేలో కాంగ్రెస్ పార్టీకి 116 నుంచి 122 సీట్లు వస్తాయని తేలగా, మార్చి సర్వేలో 128 నుంచి 131 స్థానాలకు పెరిగింది. దీంతో పాటే దాదాపు మూడుశాతం ఓటు షేర్ కూడా కాంగ్రెస్ పార్టీ పెంచుకుంది. అలాగే బీజేపీకి ఫిబ్రవరిలో 77 నుంచి 83 సీట్లు వస్తాయని పేర్కొనగా.. మార్చిలో అవి కాస్తా 66-69కి పడిపోయాయి. ఓటు బ్యాంకులోనూ మూడు శాతం తరుగుదల నమోదైంది. జేడీఎస్ కు ఫిబ్రవరిలో 21 నుంచి 27 వస్తాయని అంచనా వేయగా.. మార్చిలో మాత్రం 21 నుంచి 25 సీట్లు వస్తాయనే అంచనా వెలువడింది. ఇతరుల సీట్లు ఫిబ్రవరిలో 1-4గా అంచనా వేస్తే మార్చిలో 0-2కు పడిపోయింది.

ఇక ఈ నెలలో బీజేపీ లోని అత్యంత కీలకమైన నేతలు జగదీశ్ శెట్టర్, లక్ష్మణ్ సవాదీ తదితరులు ఆ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ లో చేరడం కాంగ్రెస్ కు మరింత కలిసొచ్చే అంశం. ఇది బీజేపీకి ఊహించని దెబ్బగానే పరిగణిస్తున్నారు. మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్ప కుటుంబ సభ్యుడైన సంతోష్ అనే నాయకుడు బీజేపీకి రాజీనామా చేసి జేడీఎస్ లో చేరడం కూడా బీజేపీకి ఇబ్బంది కలిగించే అంశమే.

మొత్తానికి ఎన్నికలు ప్రకటించేనాటికి ఇప్పటికీ కర్నాటక‌లో రాజకీయ పరిస్థితుల్లో చాలా మార్పు వచ్చింది. అక్కడ సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడుతుందనే అంచనాలు రెండు నెలల్లో మారి కాంగ్రెస్ పూర్తి మెజార్టీ సాధిస్తుందనే అంచనాలకు వస్తున్నారు. మరి ఈ సర్వేలు నిజమవుతాయా లేదా అనేది ఎన్నికల ఫలితాలు తేల్చనున్నాయి.

First Published:  18 April 2023 8:50 AM GMT
Next Story