Telugu Global
National

మహిళా ఎమ్మెల్యే పిచ్చిపని.. డ్రైవింగ్ రాకున్నా బస్సెక్కి నడిపి ప్రమాదానికి కారణమై..!

మరోసారి బస్సు నడపాలని ఎమ్మెల్యేను కోరారు. ఈసారి ఎమ్మెల్యే తన మద్దతుదారులతో కలిసి మరో బస్సు ఎక్కింది. ఈసారి స్టీరింగ్ పై కూర్చుని డ్రైవర్ సహాయం తీసుకోకుండా సొంతంగా గేర్ మార్చడానికి ప్రయత్నించి విఫలమైంది.

మహిళా ఎమ్మెల్యే పిచ్చిపని.. డ్రైవింగ్ రాకున్నా బస్సెక్కి నడిపి ప్రమాదానికి కారణమై..!
X

ప్రజాప్రతినిధులు ఏవైనా ప్రారంభోత్సవాలకు హాజరై హడావుడి చేయడం మామూలే. ఏ ఆటల కార్యక్రమమో, పాటల కార్యక్రమమో అయితే తమ టాలెంట్ చూపడానికి కూడా ఆసక్తి చూపుతుంటారు. ఫొటోలకు ఫోజులు ఇస్తుంటారు. అయితే ఇలా ఓ ప్రారంభోత్సవానికి హాజరైన మహిళా ఎమ్మెల్యే తనకు డ్రైవింగ్ రాకపోయినా బస్సు ఎక్కింది. నిండా జనం ఉన్నా స్టీరింగ్ పట్టుకుని నడిపి ప్రమాదానికి కారణమైంది. అయితే దేవుడి దయవల్ల ఎవరికి ఎటువంటి అపాయం జరగలేదు. ఈ సంఘటన కర్ణాటక రాష్ట్రంలో జరిగింది.

తాము అధికారంలోకి వస్తే మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పిస్తామని కాంగ్రెస్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆ పార్టీ విజయం సాధించడంతో ఇచ్చిన మాట ప్రకారం ప్రభుత్వ బస్సుల్లో మహిళలు ఉచితంగా ప్రయాణం చేయవచ్చని ప్రకటించింది. ఈ కార్యక్రమానికి శక్తి యోజన అని పేరు పెట్టిన ప్రభుత్వం గత ఆదివారం ఈ పథకాన్ని ప్రారంభించింది. కేజీఎఫ్ పట్టణంలో ఈ కార్యక్రమం జరుగగా సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ పాల్గొన్నారు.

అయితే ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే రూపకళ చేసిన పని వల్ల ప్రమాదం జరిగింది. మొదట ఎమ్మెల్యే రూపకళ పార్టీ కార్యకర్తలతో కలిసి మహిళా ప్రయాణికులు వెళ్లేందుకు ఏర్పాటుచేసిన బస్సును ప్రారంభించింది. ఆ సందర్భంలో మున్సిపల్ కౌన్సిల్ సభ్యుడు రమేష్ కుమార్ పట్టు పట్టడంతో ఎమ్మెల్యే బస్సు స్టీరింగ్ పట్టుకొని కూర్చుంది. బస్సు డ్రైవర్ గేర్ మార్చడంలో సహకరించడంతో 100 మీటర్ల దూరం వరకు ఎమ్మెల్యే బస్సు నడిపింది.

ఆ తర్వాత ఎమ్మెల్యే ఆ బస్సు దిగింది. ఆ తర్వాత ఆమె మద్దతుదారులు మరోసారి బస్సు నడపాలని ఎమ్మెల్యేను కోరారు. ఈసారి ఎమ్మెల్యే తన మద్దతుదారులతో కలిసి మరో బస్సు ఎక్కింది. ఈసారి స్టీరింగ్ పై కూర్చుని డ్రైవర్ సహాయం తీసుకోకుండా సొంతంగా గేర్ మార్చడానికి ప్రయత్నించి విఫలమైంది. దీంతో బస్సు ఉన్నట్టుండి వెనుకకు వెళ్లి అక్కడ నిలిపి ఉన్న కార్లను ఢీకొంది. దీంతో ఎమ్మెల్యే పక్కన ఉన్న డ్రైవర్ వెంటనే అప్రమత్తమై బస్సును కంట్రోల్ చేశాడు. దీంతో పెద్ద ప్రమాదం తప్పింది. ప్రమాదం జరిగిన సమయంలో ఎమ్మెల్యే మద్దతుదారులు, పార్టీ కార్యకర్తలు బస్సు నిండా ఉన్నారు. కాగా, ఇందుకు సంబంధించిన వీడియోను కొందరు సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది వైరల్ అవుతోంది.

First Published:  14 Jun 2023 9:59 AM GMT
Next Story