Telugu Global
National

ఇది నా బలగం.. ప్రమాణ స్వీకార వేదికపై ప్రదర్శించిన కాంగ్రెస్

సిద్ధరామయ్య ప్రమాణ స్వీకారానికి ఏకంగా ఏడు రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరయ్యారు. అలాగే పలు పార్టీలకు చెందిన అధినేతలు ముఖ్య నేతలు పాల్గొన్నారు. నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయిన తర్వాత ఒక వేదికపై ఇంతమంది నాయకులు కనిపించడం ఇదే తొలిసారి.

ఇది నా బలగం.. ప్రమాణ స్వీకార వేదికపై ప్రదర్శించిన కాంగ్రెస్
X

కొన్నేళ్ల కిందటి వరకు కాంగ్రెస్‌కు వరుస పరాజయాలే. చాలా రాష్ట్రాల్లో హంగ్ ఏర్పడి కాంగ్రెస్ అతి పెద్ద పార్టీగా అవతరించినప్పటికీ ప్రభుత్వాలను మాత్రం ఏర్పాటు చేసుకోలేకపోయింది. అయితే ఇప్పుడు మెల్లగా కాంగ్రెస్ పార్టీ విజయాలు సాధించడం మొదలుపెట్టింది. కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ అతి పెద్ద విజయాన్ని సాధించింది. ఇవాళ కాంగ్రెస్ కర్ణాటకలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ముఖ్యమంత్రిగా సిద్ధరామయ్య ప్రమాణ స్వీకారం చేశారు. అయితే ఈ ప్రమాణ స్వీకార వేడుక కాంగ్రెస్ బల ప్రదర్శనకు వేదికైందని వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.

బీజేపీకి వ్యతిరేకంగా గళమెత్తే పార్టీల నేతలందరూ ఇవాళ సిద్ధరామయ్య ప్రమాణ స్వీకార వేడుకకు విచ్చేశారు. చూడ్డానికి ఈ కార్యక్రమం సిద్దూ ప్రమాణ స్వీకార వేడుకలా కనిపించలేదు. కాంగ్రెస్ బల ప్రదర్శన వేదికగా కనిపించింది.

ఇన్నాళ్లు దేశంలోని పలువురు విపక్ష నాయకులు సందర్భం వ‌చ్చినప్పుడల్లా బీజేపీని, మోడీని విమర్శించినప్పటికీ వారంతా ఐక్యత మాత్రం ప్రదర్శించలేదు. కాగా, ఇవాళ సిద్ధరామయ్య ప్రమాణ స్వీకారానికి ఏకంగా ఏడు రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరయ్యారు. అలాగే పలు పార్టీలకు చెందిన అధినేతలు ముఖ్య నేతలు పాల్గొన్నారు. నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయిన తర్వాత ఒక వేదికపై ఇంతమంది నాయకులు కనిపించడం ఇదే తొలిసారి.

తమిళనాడు, రాజస్థాన్, ఛత్తీస్‌గ‌ఢ్‌, హిమాచల్ ప్రదేశ్, బీహార్, జార్ఖండ్ రాష్ట్రాల ముఖ్యమంత్రులు స్టాలిన్, అశోక్ గెహ్లాట్, భూపేష్, సుఖ్వీందర్ సింగ్, నితీష్ కుమార్, హేమంత్ సోరెన్ ఈ వేడుకకు హాజరయ్యారు. అలాగే బీహార్ డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్, కశ్మీర్ మాజీ సీఎం మెహబూబా ముఫ్తీ, ఏచూరి సీతారాం, డి. రాజా, శరద్ పవార్, ఫారుక్ అబ్దుల్లా తదితర నేతలు కూడా పాల్గొన్నారు.

ఇంతమంది నేతలందరినీ ఒకచోటకు చేర్చి బలాన్ని ప్రదర్శించడంలో కాంగ్రెస్ విజయవంతమైంది. విపక్షాలన్నింటినీ ఏకం చేసి వచ్చే ఎన్నికల్లో పోటీకి దిగబోతున్నట్లు బీజేపీకి హెచ్చరికలు పంపినట్లయింది. దేశంలోని బీజేపీ నేతలంతా మోహరించినప్పటికీ కర్ణాటకలో ఏ విధంగా అయితే విజయం సాధించామో అదేవిధంగా వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీని ఎదుర్కొనేందుకు కాంగ్రెస్ పక్కా ప్లాన్ చేస్తున్నట్లు కనిపిస్తోంది.

ఇంకా ఈ వేడుకకు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, ఉత్తరప్రదేశ్ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ హాజరుకాలేదు. వీరు కూడా కర్ణాటక ఎన్నికలకు ముందు కాంగ్రెస్‌కు మద్దతు తెలిపినవారే. దేశంలోని ప్రస్తుత రాజకీయ పరిస్థితులను గమనిస్తే ముందు ముందు కాంగ్రెస్‌కు మద్దతు ఇచ్చే పార్టీల సంఖ్య మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది.

First Published:  20 May 2023 4:34 PM GMT
Next Story