Telugu Global
National

వైఎస్ బాటలో కర్ణాటక సీఎం.. 10 రోజుల్లోనే తెరపైకి జనతా దర్శన్

కర్ణాటక సీఎం సిద్ధరామయ్య కూడా ఇప్పుడు అదే బాటలో అడుగులు వేస్తున్నారు. జనతా దర్శన్ పేరుతో ప్రజలతో మమేకం అవడమే కాకుండా వారి సమస్యల్ని నేరుగా వింటున్నారు.

వైఎస్ బాటలో కర్ణాటక సీఎం.. 10 రోజుల్లోనే తెరపైకి జనతా దర్శన్
X

కర్ణాటక సీఎం సిద్ధరామయ్య మరో ఆదర్శప్రాయమైన నిర్ణయం తీసుకున్నారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన 10 రోజుల వ్యవధిలోనే జనతా దర్శన్‌ పేరుతో ఓ కార్యక్రమానికి తెరదీశారు. రాష్ట్రంలోని ప్రజలు ఎవరైనా తమ సమస్యల్ని బెంగళూరులోని కుమారకృప రోడ్‌‌లో ఉన్న సీఎం అధికారిక నివాసం వద్దకి వచ్చి చెప్పుకోవచ్చని సూచించారు. ప్రతిరోజూ ఉదయం తాను ఆ నివాసంలో అందుబాటులో ఉంటానని కూడా సిద్ధరామయ్య హామీ ఇచ్చారు. ఈ క్రమంలో ప్రజలతో నేరుగా మాట్లాడటమే కాదు వారి నుంచి వినతుల్ని కూడా స్వీకరించబోతున్నారు. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి కూడా సరిగ్గా ఇలానే చేసేవారు.

వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రతిరోజూ ప్రజా దర్బార్ పేరుతో హైదరాబాద్‌లోని నివాసంలో ప్రజల్ని నేరుగా కలుసుకునేవారు. స్వయంగా సీఎంకి వినతులు ఇచ్చే అవకాశం ఉండటంతో అప్పట్లో పెద్ద ఎత్తున ఈ కార్యక్రమానికి స్పందన లభించింది. ప్రతిరోజూ వైఎస్సా‌‌ర్ వినతుల్ని స్వీకరించడమే కాదు.. సమస్యల పరిష్కారానికి స్వయంగా అధికారులకు ఆదేశాలు జారీ చేసేవారు. అనంతరం తర్వాత మీ సమస్య పరిష్కారమైందంటూ రాజశేఖర రెడ్డి సంతకంతో కూడిన లేఖ దరఖాస్తుదారులకు వెళ్లేది. సీఎం క్యాంప్ ఆఫీస్ నుంచి ఆదేశాలు కావడంతో సమస్య పరిష్కారంపై అధికారులు కూడా ప్రత్యేక శ్రద్ధ చూపేవారు. దాంతో ప్రజా దర్బార్‌కి అప్పట్లో మంచి పేరు వచ్చింది.

కర్ణాటక సీఎం సిద్ధరామయ్య కూడా ఇప్పుడు అదే బాటలో అడుగులు వేస్తున్నారు. జనతా దర్శన్ పేరుతో ప్రజలతో మమేకం అవడమే కాకుండా వారి సమస్యల్ని నేరుగా వింటున్నారు. అలానే పరిష్కారానికి ఆదేశాలు జారీ చేస్తున్నారు. ఇటీవల 34 మంది మంత్రివర్గంతో కూడిన కాంగ్రెస్ ప్రభుత్వం అక్కడ ఏర్పాటు అయ్యింది. కానీ కొన్ని కీలక శాఖల్ని మాత్రం సిద్ధరామయ్య తన వద్దే ఉంచుకున్నారు. ఇందులో ఆర్థిక మంత్రిత్వ శాఖ, పాలనా సంస్కరణలు, సమాచార శాఖల్ని ఎవరికీ సిద్ధరామయ్య కేటాయించలేదు. ఈ నేపథ్యంలో జనతా దర్శన్‌‌లో వచ్చే వినతుల పరిష్కారం మరింత సులువుగా మారుతోంది.

ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన మొదట్లోనే తన కాన్వాయ్‌కి ఉన్న ‘జీరో ట్రాఫిక్ ప్రోటోకాల్‌’ని తొలగించాలని బెంగళూరు నగర కమిషనర్‌ను సిద్ధరామయ్య ఆదేశించిన విషయం తెలిసిందే. దేశంలో అత్యంత రద్దీగా ఉండే నగరాల్లో బెంగళూరు కూడా ఒకటి. దాంతో తన కారణంగా వాహనదారులు ఇబ్బంది పడకూడదనే సదుద్దేశంతో కర్ణాటక సీఎం ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. తాజాగా జనతా దర్శన్ అంటూ ప్రజలకి మరింత దగ్గరవుతున్నారు.

First Published:  31 May 2023 5:47 AM GMT
Next Story