Telugu Global
National

టిప్పు సుల్తాన్ ని చంపిందెవరు..? కర్నాటకలో సరికొత్త రాజకీయం

మరోవైపు కర్నాటక మంత్రి మునిరత్న ఊరిగౌడ, నంజెగౌడ వీరోచిత గాథపై సినిమా తీస్తానని ప్రకటించారు. ఊరిగౌడ-నంజెగౌడ అనే టైటిల్‌ కూడా రిజిస్టర్‌ చేయించారు.

టిప్పు సుల్తాన్ ని చంపిందెవరు..? కర్నాటకలో సరికొత్త రాజకీయం
X

నాలుగో ఆంగ్లో-మైసూర్ యుద్ధంలో టిప్పు సుల్తాన్ ఆంగ్లేయుల చేతిలో హతమయ్యారు. ఇది చరిత్ర, కానీ కర్నాటకలోని బీజేపీ నేతలు కొత్త చరిత్ర రచిస్తున్నారు. టిప్పు సుల్తాన్ ని చంపింది ఆంగ్లేయులు కాదని, భారతీయులేనంటున్నారు. టిప్పుపై తిరగబడిన ఒక్కలిగలు ఆయన్ను హతమార్చారని, దేశమాత ముద్దుబిడ్డలుగా మారారని చెబుతున్నారు. ఊరిగౌడ, నంజెగౌడ అనే ఇద్దరు ఒక్కలిగ యోధులు టిప్పుని మట్టుబెట్టారని చెప్పారు బీజేపీ జాతీయ కార్యదర్శి సి.టి.రవి. ఆయన వ్యాఖ్యలు కర్నాటకలో సంచలనంగా మారాయి.

కర్నాటక అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడేకొద్దీ 40పర్సెంట్ కమీషన్ బీజేపీ సర్కారు, తమ తప్పుల్ని కప్పి పుచ్చుకోడానికి కొత్త ఎత్తుగడలు వేస్తోంది. మత విద్వేషాలు రెచ్చగొట్టడంలో భాగంగా టిప్పు మరణాన్ని రాజకీయం చేస్తోంది. టిప్పు సుల్తాన్ ని చంపింది ఒక్కలిగలు అని, స్థానిక తిరుగుబాటుదారులే ఆయన్ను హతమార్చారని, ఆ ఇద్దరు యోధులు తమకు ఆదర్శమని చెప్పారు రవి.

రవి వ్యాఖ్యలు సంచలనంకాగా, స్థానిక బీజేపీ నేతలు వాటిని సమర్థిస్తూ మరింత రెచ్చిపోతున్నారు. అయితే ఈ వ్యాఖ్యలను కాంగ్రెస్, జేడీఎస్ చరిత్రకారులు మాత్రం వ్యతిరేకిస్తున్నారు. ఊరి గౌడ, నంజె గౌడ అనే పాలకులు వాస్తవంలో లేరని, అవి కల్పిత పాత్రలు అంటున్నారు. ‘టిప్పువిన నిజ కనసుగలు’ పేరిట కర్నాటకలో నాటకాలు వేస్తుంటారు. ఆ నాటకంలో పాత్రలే ఊరిగౌడ, నంజెగౌడ. వారిద్దరూ టిప్పుకి వ్యతిరేకంగా పోరాటం చేస్తుంటారనేది ఆ నాటకం కథాంశం. నాటకంలో చివరికి వారిద్దరి చేతిలో టిప్పు హతమవుతాడు. ఈ కథ, కథనం.. ఒక్కలిగలను ఆకట్టుకున్నా.. మిగతా వర్గాలకు మాత్రం సత్యదూరం అనిపించక మానదు. అయితే ఒక్కలిగలను మంచి చేసుకోడానికి అదే వర్గానికి చెందిన ఎమ్మెల్యే రవి.. ఇప్పుడీ వ్యవహారాన్ని తెరపైకి తెచ్చారు.

మరోవైపు కర్నాటక మంత్రి మునిరత్న ఊరిగౌడ, నంజెగౌడ వీరోచిత గాథపై సినిమా తీస్తానని ప్రకటించారు. ఊరిగౌడ-నంజెగౌడ అనే టైటిల్‌ కూడా రిజిస్టర్‌ చేయించారు. అయితే వక్కలిగ వర్గం గురువు ఆదిచుంచనగిరి మహాసంస్థ మఠం పీఠాధిపతి నిర్మలానంద స్వామిజీ ఈ వ్యవహారంపై స్పందించారు. చారిత్రక సమాచారం, ఆధారాలు, రికార్డులను మఠానికి అందించాలని కోరారు. అంతేకాదు ఆధారాలు లేకుండా ఎటువంటి సినిమా తీయొద్దన్నారు. సాక్షాత్తూ వక్కలిగల గురువే ఇలా భిన్నంగా స్పందించినా బీజేపీ నేతలు మాత్రం సినిమా తీయాల్సిందేనంటున్నారు. టిప్పు విషయంలో మతాల మధ్య చిచ్చుపెట్టి ఎన్నికల్లో లాభపడాలని భావిస్తున్నారు.

First Published:  23 March 2023 12:10 PM GMT
Next Story