Telugu Global
National

Karnataka: బీజేపీ ఎన్నడూ చూడని తిరుగుబాట్లు...సంక్షోభానికి బీఎల్ సంతోషే కారణమా ?

ఒకవైపు జమ్ము కశ్మీర్ మాజీ గవర్నర్ సత్యపాల్ మాలిక్ చేస్తున్న ఆరోపణలు, విమర్శలు ఆ పార్టీ అధినాయకత్వానికి నిద్ర పట్టకుండా చేస్తుండగా, కర్నాటకలో మాజీ ముఖ్యమంత్రి శెట్టర్ సంతోష్ పై చేస్తున్న ఆరోపణలు ఆ పార్టీని అతలాకుతలం చేస్తున్నాయి.

Karnataka:  బీజేపీ ఎన్నడూ చూడని తిరుగుబాట్లు...సంక్షోభానికి బీఎల్ సంతోషే కారణమా ?
X

ఇప్పుడు కర్నాటక బీజేపీ లో సాగుతున్న తిరుగుబాట్లు ఆ పార్టీ ఉహించనివి. ఆ పార్టీ ఎన్నడూ ఎదుర్కోని తిరుగుబాట్లివి. అనేక మంది అత్యంత కీలక నేతలు ఆ పార్టీపై తిరుగుబాటు చేయడమే కాక బీజేపీ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్ ను టార్గెట్ చేస్తున్నారు.

తెలంగాణలో ఎమ్మెల్యేల కొనుగోలు అంశంలో పేరు గాంచిన సంతోష్ మళ్ళీ ఇప్పుడు కర్నాటక బీజేపీలో సంక్షోభానికి కారణమంటూ ఆరోపణలు ఊపందుకుంటున్నాయి.

ఒకవైపు జమ్ము కశ్మీర్ మాజీ గవర్నర్ సత్యపాల్ మాలిక్ చేస్తున్న ఆరోపణలు, విమర్శలు ఆ పార్టీ అధినాయకత్వానికి నిద్ర పట్టకుండా చేస్తుండగా, కర్నాటకలో మాజీ ముఖ్యమంత్రి శెట్టర్ సంతోష్ పై చేస్తున్న ఆరోపణలు ఆ పార్టీని అతలాకుతలం చేస్తున్నాయి.

దేశవ్యాప్తంగా ఇతర పార్టీలకు చెందిన శాసనసభ్యులను వేటాడి, బెదిరించి, భయపెట్టి, ప్రలోభ పెట్టి, ప్రభుత్వాలను పడగొట్టడంలో పేరుగాంచిన బిజెపి, ఇప్పుడు కర్నాటకలో ఇంత మంది రాజీనామాలను ఎదుర్కోవడం ఇదే మొదటిసారి, అది కూడా దక్షిణ భారత దేశంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగిన ఒకే ఒక రాష్ట్రంలో కావడం ఆ పార్టీకి మింగుడు పడటం లేదు.

ఒకవైపు 2019లో బీజేపీ ఎన్నికల ప్రయోజనాల కోసం పుల్వామా దాడిని నరేంద్ర మోడీ, అజిత్ దోవల్ ఎలా ఉపయోగించుకున్నారో సత్యపాల్ మాలిక్ వెల్లడించిన నేపథ్యంలో, శెట్టర్ బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి BL సంతోష్ పై చేస్తున్న ఆరోపణలు నరేంద్ర మోడీ, అమిత్ షాలకు ఇబ్బందులు కలగజేస్తున్నాయి.

ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన శెట్టర్ బీజేపీలో ఇంతవరకు ఎవరూ చేసేందుకు సాహసించని పని చేశారు.సంతోష్‌పై దుమ్మెత్తిపోయడంతోపాటు సంతోష్ నీచ రాజకీయాలు చేశారని, ఆయన తమ‌పై కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు.

కర్నాటక బీజేపీ అభ్యర్థుల ఎంపిక వెనక‌ సంతోష్, బొమ్మై, కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి ఉన్నారని, ముఖ్యమంత్రి రేసులో నుండి తనను తప్పించే కుట్రలో భాగంగా త‌నకు ఎమ్మెల్యే టికట్ ఇవ్వలేదని, అందుకోసం దాదాపు 70 మంది కొత్తవారికి టికట్లు ఇచ్చారని శెట్టర్ ఆరోపణలు చేస్తున్నారు.

నరేంద్ర మోడీ, అమిత్ షాలను సంతోష్ చీకట్లో ఉంచి పార్టీ వ్యవహారాలను నిర్వహిస్తున్నారని, ఆయన బీజేపీని నాశనం చేస్తున్నారని శెట్టర్ అన్నారు.

“బీఎల్ సంతోష్‌కు కేరళ బాధ్యతలు అప్పగించారు. అక్కడ‌ ఒక్క సీటు కూడా గెలవలేదు. ఆయనను తమిళనాడు ఇంచార్జిగా నియమించారు.అక్కడ బీజేపీ కొన్ని సీట్లు మాత్రమే గెలుచుకుంది. ఆయన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లకు ఇన్‌ఛార్జ్‌గా ఉన్నారు. అక్కడ పార్టీ పరిస్థితి ఎంత దారుణంగా ఉందో చూడండి. అన్ని రాష్ట్రాల్లో విఫలమైన వ్యక్తి పార్టీ నంబర్ వన్, టూకి సలహాలు ఇస్తున్నాడు, ”అని షెట్టర్ అన్నారు.

శెట్టర్ ఒక్కరే కాదు ఇప్పుడు కర్నాటకలో అనేక మంది కీలక నేతలు పార్టీ నుంచి తప్పుకున్నారు. అందరూ సంతోష్ పై, బొమ్మై పైనే ఆరోపణలు చేస్తున్నారు.

ముదిగెరె ఎమ్మెల్యే ఎంపీ కుమారస్వామి, హావేరి ఎమ్మెల్యే నెహ్రూ ఓలేకర్, మంత్రి, 6 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఎస్ అంగార, ఎమ్మెల్సీ ఆర్ శంకర్, ఎమ్మెల్సీ ఏనూరు మంజునాథ్ మాజీ డిప్యూటీ సీఎం లక్ష్మణ్‌ సవాడి, మాజీ మంత్రి శశికాంత్‌ నాయక్‌, తుమకూరుకు చెందిన ప్రముఖ నేత సొగడు శివన్న సహా 10 మంది సిట్టింగ్‌ ఎమ్మెల్యేలు బీజేపీని వీడారు. కొందరు ప్రత్యర్థి పార్టీలైన కాంగ్రెస్, జనతాదళ్‌లో చేరారు.

వీరిలో చాలా మంది కాంగ్రెస్ , జనతాదళ్ సంకీర్ణ ప్రభుత్వాన్ని కూల్చి బీజేపీ అధికారంలోకి రావడంలో కీలకంగా వ్యవహరించినవారే. పైగా దశాబ్దాలుగా బీజేపీ లో కొనసాగుతున్నవారు. ఇందులో కొందరైతే ఆరెస్సెస్ లో కూడా పని చేశారు. ఎన్నడూ ఎదుర్కోని ఈ సంక్షోభాలను బీజేపీ ఎలా ఎదుర్కుంటుందనేది ఇప్పుడు అందరూ ఆసక్తిగా చూస్తున్న అంశం.

First Published:  21 April 2023 3:52 AM GMT
Next Story