Telugu Global
National

కాంగ్రెస్ లో కొత్త ఉత్సాహం.. శివరాజ్ కుమార్ ప్రచారం

రాహుల్ గాంధీ అభిమానిగా తాను ప్రచారానికి వచ్చానని చెబుతున్నారు శివరాజ్ కుమార్. ఇటీవల రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర చేపట్టి, దేశమంతా పర్యటించడం తనలో స్ఫూర్తిని రగిల్చిందని చెప్పారాయన.

కాంగ్రెస్ లో కొత్త ఉత్సాహం.. శివరాజ్ కుమార్ ప్రచారం
X

ఆమధ్య ఒకరిద్దరు సినీ నటులు కర్నాటకలో బీజేపీకి మద్దతివ్వడంతో కమలనాథులు రెచ్చిపోయారు. సినీ ఇండస్ట్రీ మద్దతంతా తమకే ఉందన్నారు. తాజాగా కన్నడ హీరో శివరాజ్ కుమార్ కాంగ్రెస్ తరపున ప్రచారానికి తరలి రావడంతో హస్తం పార్టీ కార్యకర్తల్లో కొత్త ఉత్సాహం వచ్చింది. ఇటీవలే శివరాజ్ కుమార్ భార్య గీత, జేడీఎస్ నుంచి బయటకు వచ్చి కాంగ్రెస్ లో చేరారు. గీత సోదరుడు మధు బంగారప్ప శివమొగ్గ జిల్లాలోని సొరబ్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో ఉన్నారు. కేవలం బావమరిది కోసమే కాకుండా.. కాంగ్రెస్ తరపున కూడా రాష్ట్రమంతా ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటానని చెబుతున్నారు శివరాజ్ కుమార్.

రాహుల్ కోసమే..

కన్నడ కంఠీరవ రాజ్ కుమార్ కుటుంబానికి కర్నాటకలో కోట్లాదిమంది అభిమానులున్నారు. పునీత్ రాజ్ కుమార్ మరణం తర్వాత వారిపై ప్రజలకు ఏ స్థాయిలో అభిమానం ఉందో మరోసారి తెలిసింది. ఇప్పుడు అదే కుటుంబం నుంచి శివరాజ్ కుమార్ కాంగ్రెస్ తరపున ప్రచారం చేస్తూ పార్టీకి కొత్త ఉత్సాహాన్ని తెచ్చారు. రాహుల్ గాంధీ అభిమానిగా తాను ప్రచారానికి వచ్చానని చెబుతున్నారు శివరాజ్ కుమార్. ఇటీవల రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర చేపట్టి, దేశమంతా పర్యటించడం తనలో స్ఫూర్తిని రగిల్చిందని చెప్పారాయన. భారత్ జోడో నుంచి తాను ప్రేరణ పొందానన్నారు.

తనకు అన్ని పార్టీల్లో స్నేహితులున్నారని, కానీ తానిప్పుడే యాక్టివ్ పాలిటిక్స్ లోకి రావడంలేదని చెప్పారు శివరాజ్ కుమార్. బావమరిది బంగారప్ప కోసం ఆయన ప్రచారం చేస్తున్నారు. పనిలో పనిగా కాంగ్రెస్ పార్టీ సభల్లోనూ ఆయన పాల్గొంటున్నారు. రాజ్ కుమార్ కుటుంబ అభిమానులంతా ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ కి మద్దతివ్వాలని పిలుపునిచ్చారు శివరాజ్ కుమార్.

First Published:  2 May 2023 11:04 AM GMT
Next Story