Telugu Global
Cinema & Entertainment

Kannada Movies: పాన్ ఇండియా లెవల్లో అదరగొడుతున్న కన్నడ సినిమా

Kannada Movies: కన్నడ సినిమాలో 'కాంతార'ది మరో అధ్యాయంగా చెప్పుకోవచ్చు. రిషబ్‌ శెట్టి నటిస్తూ, దర్శకత్వం వహించిన ఈ సినిమాను ముందు చిన్న సినిమాగా రిలీజ్ చేశారు. కర్నాటక నేటివిటీని ప్రతిబింబిస్తూ రూపొందించిన ఈ కథ కర్నాటకలో సక్సెస్ అయితే చాలనుకున్నారు.

Kannada Movies: పాన్ ఇండియా లెవల్లో అదరగొడుతున్న కన్నడ సినిమా
X

నిన్న మొన్నటి వరకూ కన్నడ సినిమా అంటే ఎవరికీ తెలిసేది కాదు. నార్త్‌లో బాలీవుడ్, సౌత్‌లో తెలుగు, తమిళ, మలయాళ సినిమాల పేర్లే ఎక్కువగా వినిపించేవి. అయితే KGF తర్వాత కథ మారింది. ప్రస్తుతం కన్నడ సినిమా ట్రాక్‌లోకి వచ్చింది. KGF మొదలు కాంతార వరకూ శాండిల్‌వుడ్‌ సుగంధాలు దేశమంతటా వ్యాపిస్తున్నాయి. కన్నడ సినిమా సక్సెస్‌కు కారణాలేంటంటే..

భారతీయ సినిమాలో బాలీవుడ్ ముందుడేది. ఆ తర్వాత సౌత్ సినిమాలు ఎక్కువగా పాపులర్ అయ్యేవి. అయితే ఇప్పుడు సీన్ రివర్స్ అయిన సంగతి తెలిసిందే. ఇండియన్ సినిమా అంతా ఒకటే అన్న ఫార్ములా నడుస్తోంది. అందులోనూ సౌత్ సినిమాలదే హవా. అయితే సౌత్ సినిమాల్లో ఒక్కో భాషకు ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. కమర్షియల్ కథలకు తెలుగు సినిమా, ప్రయోగాలకు మలయాళ సినిమా, నేటివిటీ, మాస్ సినిమాలకు తమిళ సినిమాలు పెట్టింది పేరుగా ఉండేవి. కన్నడ సినిమాకు తనదైన సొంత స్టైల్ ఉండేది కాదు. ఉపేంద్ర, పునీత్‌ రాజ్ కుమార్ లాంటి హీరోలను మినహాయిస్తే కర్నాటకలో హీరోలు కూడా తక్కువే. అక్కడ తెలుగు హీరోలకే ఎక్కువ పాపులారిటీ ఉండేది. అయితే ఈ మధ్య కాలంలో కన్నడ సినిమా తనదైన ప్రత్యేకతను సంపాదించుకుంది. 'కేజీఎఫ్‌'తో లెక్కలు మొత్తం మారిపోయాయి. ఆ సినిమా దేశ వ్యాప్తంగా అద్భుతమైన విజయాన్ని అందుకొంది. దాంతో కన్నడ లోకల్ టాలెంట్ కూడా తన సత్తా ఏంటో చూపించే పనిలో పడింది. కంటెంట్‌కు పెద్దపీట వేస్తున్న ఈ రోజుల్లో అసలు సిసలైన కన్నడ కంటెంట్‌తో యువ డైరెక్టర్లు మన ముందుకొస్తున్నారు. కెజీఎఫ్ నుంచి కాంతార వరకూ కొత్త కొత్త ప్రయోగాలు చేస్తూ పాన్ ఇండియా లెవల్లో అదరగొడుతున్నారు.

ఇటీవల కాలంలో కన్నడ సినిమా ఇంతగా సక్సెస్ అవ్వడానికి పునాది వేసింది మాత్రం ప్రశాంత్ నీల్. హాలీవుడ్ రేంజ్ యాక్షన్ డ్రామాను రెండు పార్ట్స్‌లో తీసి గ్రాండ్ సక్సెస్ కొట్టడంతో కన్నడ ఇండస్ట్రీకి ఆశలు చిగురించాయి. పాన్ ఇండియా లెవల్లో కన్నడ సినిమా స్థాయిని పెంచింది. దాంతో యంగ్ టాలెంట్ ముందుకొచ్చింది. రక్షిత్ శెట్టి, రాజ్ బి శెట్టి, రిషబ్ శెట్టి లాంటి స్టార్లంతా తక్కువ బడ్డెట్‌తో మంచి కంటెంట్ ఉన్న సినిమాలు తీస్తూ శాండల్‌వుడ్‌ను ట్రాక్ ఎక్కించారు. KGF తర్వాత విక్రాంత్ రోణ, 777 చార్లీ, గరుడ గమన వృషభ వాహన, కాంతార సినిమాలు పాన్ ఇండియా లెవల్లో మంచి పేరు సాధించాయి. రిషబ్‌ శెట్టి, రాజ్ బి శెట్టి కలిసి తీసిన 'గరుడ గమన వృషభ వాహన' కన్నడలో పెద్ద హిట్‌ మాత్రమే కాదు, అదొక క్లాసిక్‌గా నిలిచిపోయింది. దేశ వ్యాప్తంగా ఈ సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకుంది.

కన్నడ సినిమాలో 'కాంతార'ది మరో అధ్యాయంగా చెప్పుకోవచ్చు. రిషబ్‌ శెట్టి నటిస్తూ, దర్శకత్వం వహించిన ఈ సినిమాను ముందు చిన్న సినిమాగా రిలీజ్ చేశారు. కర్నాటక నేటివిటీని ప్రతిబింబిస్తూ రూపొందించిన ఈ కథ కర్నాటకలో సక్సెస్ అయితే చాలనుకున్నారు. అందుకే ఇతర భాషల్లోకి డబ్ కూడా చేయలేదు. కానీ సినిమా రిలీజయ్యాక అనూహ్యమైన స్పందన రావడంతో వెంటనే అన్ని భాషల్లోకి డబ్ చేసి, పాన్ ఇండియా రిలీజ్ చేశారు. దేశ వ్యాప్తంగా ఈ సినిమా సృష్టిస్తున్న అలజడి అంతా ఇంతా కాదు. ఇప్పటికే 'కాంతార' వసూళ్లు రెండొందల కోట్లు దాటేశాయి. రూ.16 కోట్లతో రూపొందిన ఈ సినిమా రూ.200 కోట్లు అందుకోవడమంటే మామూలు విషయం కాదు.

వసూళ్ల మాట అటుంచితే కన్నడ సంస్కృతి, సంప్రదాయాలు దేశ వ్యాప్తంగా తెలియడానికి ఇటీవల విడుదలైన కన్నడ సినిమాలు బాగా ఉపయోగపడ్డాయి. 'కాంతార' విడుదలైన తర్వాత కర్నాటక ప్రభుత్వం భూత్‌ కోలా కళాకారులకు పెన్షన్లు ఇచ్చే పథకాన్ని ఏర్పాటు చేసింది. ఒక సినిమా ఇలాంటి విజయాన్ని సాధించడం చాలా అరుదు. మొత్తానికి సౌత్‌లో ఒక్కో ఇండస్ట్రీ ఒక్కో ప్రత్యేకతను చాటుతూ ఇండియన్ సినిమాను ఏలేస్తున్నాయి. సౌత్ సినిమాల దెబ్బకు డీలా పడిన బాలీవుడ్ ఎప్పుడు కోలుకుంటుందో చూడాలి.

First Published:  2 Nov 2022 3:23 AM GMT
Next Story