Telugu Global
National

'హిందుత్వం అబద్ధాల ఆధారంగా నిర్మించబడింది' అని వ్యాఖ్యానించిన నటుడు అరెస్ట్

చేతన్ అహింస అని పిలవబడే నటుడు చేతన్ కుమార్ దళిత, గిరిజన హక్కుల కార్యకర్త కూడా. ఇతను చాలాకాలంగా హిందుత్వ వాదులు ప్రచారం చేస్తున్న అబద్దాలకు వ్యతిరేకంగా ట్విట్టర్ లో పోస్టులు పెడుతున్నాడు.

హిందుత్వం అబద్ధాల ఆధారంగా నిర్మించబడింది అని వ్యాఖ్యానించిన నటుడు అరెస్ట్
X

బెంగుళూరు పోలీసులు కన్నడ నటుడు చేతన్ కుమార్‌ను నిన్న అరెస్టు చేశారు. ''హిందుత్వం అబద్ధాల ఆధారంగా నిర్మించబడింది" దానిని "సత్యం ద్వారా ఓడించవచ్చు" అని ట్వీట్ చేసినందుకు ఆయనను అరెస్ట్ చేశారు.

బెంగళూరు దిగువ కోర్టు చేతన్ కుమార్‌ను 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించింది.

చేతన్ అహింస అని పిలవబడే నటుడు చేతన్ కుమార్ దళిత, గిరిజన హక్కుల కార్యకర్త కూడా. ఇతను చాలాకాలంగా హిందుత్వ వాదులు ప్రచారం చేస్తున్న అబద్దాలకు వ్యతిరేకంగా ట్విట్టర్ లో పోస్టులు పెడుతున్నాడు.

మార్చ్ 20వ తేదీన ఆయన చేసిన ట్వీట్ లో...

''హిందుత్వ అబద్ధాల మీద నిర్మించబడింది.

రాముడు రావణుడిని ఓడించి అయోధ్యకు తిరిగి వచ్చినప్పుడు భారత దేశం ప్రారంభమైందని సావర్కర్ చేసిన వాదన‌ అబద్ధం

బాబ్రీ మసీదు ‘రామ జన్మస్థలం’ అనేది అబద్ధం

ఊరిగౌడ-నంజేగౌడ టిప్పును చంపారు అన్నది అబద్ధం

హిందుత్వను సత్యం ద్వారా ఓడించవచ్చు. సత్యమే సమానత్వం'' అని వ్యాఖ్యానించారు.

చరిత్రకారులు కల్పిత పాత్రలుగా భావించే ఊరి గౌడ, నంజే గౌడ - టిప్పు సుల్తాన్‌ను చంపిన వొక్కలిగ సమాజానికి చెందిన ముఖ్యులు అని రాష్ట్ర భారతీయ జనతా పార్టీ ఇటీవల ప్రచారం మొదలుపెట్టింది. చరిత్రకారుల ప్రకారం, టిప్పు సుల్తాన్ 1799లో నాల్గవ ఆంగ్లో-మైసూర్ యుద్ధంలో బ్రిటిష్ వారితో పోరాడుతూ మరణించాడు. గత సంవత్సరం ప్రచురితమైన ఒక నాటకంలో, ఇద్దరు వొక్కలిగ నాయకులు టిప్పు సుల్తాన్ ను చంపినట్టుగా చిత్రీకరించడాన్ని చరిత్రకారులు వ్యతిరేకించారు.

అయితే, రాష్ట్ర బిజెపి నాయకులు ఈ కల్పిత కథ‌ను ఎన్నికల ప్రచారంలో ఉపయోగించారు. కొన్ని నివేదికల ప్రకారం, ఈ కల్పిత కథ ఆధారంగా ముస్లింలకు వ్యతిరేకంగా వొక్కలిగ కమ్యూనిటీని నిలబెట్టాలని బీజేపీ ప్రయత్నించింది.

ముస్లింలు, వొక్కలిగలు ఇద్దరూ ఈ కొత్త పాత్రలను చారిత్రక కథనంలో ప్రవేశపెట్టడాన్ని వ్యతిరేకిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇలాంటి అబద్ధాలు ప్రచారం చేయడం మానుకోకుంటే, వొక్కలిగ సంఘం స్థానిక సీర్ల నేతృత్వంలో ఆందోళన చేపడతామని హెచ్చరించింది.

కాగా చేతన్ కుమార్ చేసిన ట్వీట్ పై భజరంగ్ దళ్ సభ్యుడు దాఖలు చేసిన ఫిర్యాదు ఆధారంగా, శేషాద్రిపురం పోలీసులు అతనిపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు.

కర్ణాటక ప్రభుత్వ పాఠశాలల్లో హిజాబ్ నిషేధాన్ని సవాలు చేస్తూ దాఖలైన కేసును విచారిస్తున్న కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తి కృష్ణ దీక్షిత్ గురించి ఫిబ్రవరి 2022లో చేతన్ ట్వీట్ చేసినందుకు కూడా అతన్ని అరెస్టు చేశారు.


First Published:  22 March 2023 3:33 AM GMT
Next Story