Telugu Global
National

దేశ ఐక్యత కోసం విభేదాలు పక్కన పెట్టండి.. ప్రతిపక్షాలకు కమల్ హాసన్ పిలుపు

దేశ ఐక్యత కోసం ప్రతిపక్షాలు ఒక్కరోజు విభేదాలు పక్కన పెట్టాలని కోరారు. బహిష్కరణ నిర్ణయాన్ని పునరాలోచించుకోవాలని సూచించారు.

దేశ ఐక్యత కోసం విభేదాలు పక్కన పెట్టండి..  ప్రతిపక్షాలకు కమల్ హాసన్ పిలుపు
X

దేశ ఐక్యత కోసం ప్రతిపక్షాలు ఒక్కరోజు విభేదాలను పక్కన పెట్టి పార్లమెంటు నూతన భవన ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొనాలని మక్కల్ నీది మయ్యం అధినేత, ప్రముఖ నటుడు కమల్ హాసన్ పిలుపునిచ్చారు. ఈనెల 28వ తేదీన పార్లమెంటు నూతన భవనం ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. ఇందుకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. అయితే పార్లమెంటు నూతన భవనాన్ని రాష్ట్రపతి చేతుల మీదుగా కాకుండా ప్రధాని చేతుల మీదుగా ప్రారంభించడంపై ప్రతిపక్షాలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. ఈ కార్యక్రమాన్ని బహిష్కరిస్తున్నట్లు కాంగ్రెస్ సహా 19 పార్టీలు సంయుక్తంగా ప్రకటించాయి. దీంతో ప్రతిపక్షాలు లేకుండానే నూతన పార్లమెంటు భవనాన్ని ప్రారంభించనున్నారు.

ఈ నేపథ్యంలో ఈ వ్యవహారంపై కమల్ హాసన్ స్పందించారు. దేశ ఐక్యత కోసం ప్రతిపక్షాలు ఒక్కరోజు విభేదాలు పక్కన పెట్టాలని కోరారు. బహిష్కరణ నిర్ణయాన్ని పునరాలోచించుకోవాలని సూచించారు. పార్లమెంటు నూతన భవనం అనేది దేశ ఐక్యతకు సంబంధించిన కార్యక్రమం అని ఆయన అన్నారు. కొత్త ఇంట్లోకి ప్రవేశించే సమయంలో కుటుంబ సభ్యులంతా హాజరు కావాల్సిన అవసరం ఉందన్నారు. ప్రతిపక్షాలు ఏమైనా విభేదాలు ఉంటే పబ్లిక్ ఫోరంలోనో, ఉభయ సభల్లోనో లేవనెత్తాలని సూచించారు.

ఈ కార్యక్రమానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్మును ఆహ్వానించక పోవడానికి గల కారణాలు ఏంటని? ప్రధాని మోడీని కమల్ హాసన్ ప్రశ్నించారు. రాష్ట్రపతిని ఈ కార్యక్రమానికి ఆహ్వానించాలని ప్రధానిని ఆయన కోరారు. పార్లమెంట్ ప్రారంభోత్సవానికి రాష్ట్రపతిని ఆహ్వానించుకోవడంపై తనకు కూడా అసంతృప్తి ఉందని, అయితే జాతి ప్రయోజనాల దృష్ట్యా పార్లమెంట్ భవన ప్రారంభోత్సవ కార్యక్రమంలో తాను కూడా భాగస్వామ్యం అవుతున్నట్లు కమల్ హాసన్ చెప్పారు.

First Published:  27 May 2023 1:51 PM GMT
Next Story