Telugu Global
National

జార్ఖండ్ ముఖ్యమంత్రిగా కల్పన సొరేన్?

కల్పన సొరేన్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారని జరుగుతున్న ప్రచారంపై బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే స్పందించారు.

జార్ఖండ్ ముఖ్యమంత్రిగా కల్పన సొరేన్?
X

జార్ఖండ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా హేమంత్ సొరేన్ స్థానంలో కల్పన సొరేన్ బాధ్య‌త‌లు స్వీక‌రించ‌నున్న‌ట్లు ప్రచారం జరుగుతోంది. ఇవాళ రాష్ట్ర రాజధాని రాంచీలో సీఎం హేమంత్ సొరేన్ నిర్వహించిన సమావేశానికి అధికారకూటమి ఎమ్మెల్యేలంతా సమావేశమైన నేపథ్యంలో ముఖ్యమంత్రి హేమంత్ సొరేన్ తన స్థానంలో భార్యకు పగ్గాలు అప్పగిస్తారని వార్తలు వస్తున్నాయి.

భూ కుంభకోణానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో హేమంత్ సొరేన్ కోసం ఎన్‌ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అధికారులు కొద్ది రోజులుగా హేమంత్ సొరేన్ కోసం గాలిస్తున్నారు. వారం కిందట ఢిల్లీకి వెళ్లిన హేమంత్ సొరేన్ అక్కడ ఉన్న అధికార నివాసం నుంచి మాయమయ్యారు.

ఈడీ ఆయన్ని అదుపులోకి తీసుకునే అవకాశం ఉందన్న ప్రచారం నేపథ్యంలోనే హేమంత్ సొరేన్ అదృశ్యమయ్యారని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఇవాళ ఆయన ఉన్నట్టుండి రాంచీలో ప్రత్యక్షమయ్యారు. అధికార కూటమిలోని ఎమ్మెల్యేలతో సమావేశం అయ్యారు.

ఈ సమావేశానికి అధికార జేఎంఎం పార్టీ ఎమ్మెల్యేలతో పాటు కూటమిలోని ఆర్జేడీ, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అందరూ హాజరయ్యారు. తనను ఈడీ అదుపులోకి తీసుకునే లోపు తన భార్య కల్పన సొరేన్ ను ముఖ్యమంత్రి స్థానంలో కూర్చోబెట్టేందుకు హేమంత్ సొరేన్ కూటమిలోని ఎమ్మెల్యేలతో చర్చించినట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యేలు అందరూ రాజధాని లోనే ఉండాలని తమ పార్టీతో పాటు కూటమిలోని ఎమ్మెల్యేలను జేఎంఎం కోరడం ఈ వార్తలకు బలాన్నిస్తున్నాయి.

కాగా, కల్పన సొరేన్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారని జరుగుతున్న ప్రచారంపై బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే స్పందించారు. హేమంత్ తన స్థానంలో తన భార్యను కూర్చోబెట్టడానికి ప్రయత్నాలు చేస్తున్నారని.. అందువల్లే అధికార కూటమిలోని ఎమ్మెల్యేలందరూ రాజధాని లోనే ఉండాలని జేఎంఎం కోరుతోందని నిషికాంత్ దూబే చెప్పారు.

ఈడీ విచారణతో ముఖ్యమంత్రి భయపడుతున్నారని అన్నారు. అందువల్లే ఆయన ఢిల్లీ నుంచి రోడ్డు మార్గంలో రాంచీకి చేరుకుంటానని తన పార్టీ నేతలతో చెప్పినట్టు తెలిసిందని దూబే తెలిపారు. మరోవైపు జనవరి 31న రాంచీలోని తన నివాసానికి రావాలని హేమంత్ ఇప్పటికే ఈడీ అధికారులకు సమాచారం ఇచ్చారు. బుధవారం మధ్యాహ్నం ఆయనను ఈడీ విచారించనుంది.

First Published:  30 Jan 2024 11:06 AM GMT
Next Story