Telugu Global
National

సుప్రీం కోర్టు త‌దుప‌రి ప్ర‌ధాన న్యాయ‌మూర్తిగా జ‌స్టిస్ యు.యు.ల‌లిత్‌

భారత సుప్రీం కోర్టు తదుపరి ప్రధాన న్యాయమూర్తిగా యూయూ లలిత్ ను రెకమెండ్ చేశారు ప్రస్తుత సీజేఐ ఎన్వీ రమణ. ఈ మేరకు ఆయన న్యాయ శాఖకు లేఖ రాశారు. ఎన్వీ రమణ ఈ నెల 26వ‌తేదీన ప‌ద‌వీ విర‌మ‌ణ చేయ‌నున్నారు.

సుప్రీం కోర్టు త‌దుప‌రి ప్ర‌ధాన న్యాయ‌మూర్తిగా జ‌స్టిస్ యు.యు.ల‌లిత్‌
X

భార‌త అత్యున్న‌త న్యాయ‌స్థానం సుప్రీంకోర్టు త‌దుప‌రి ప్ర‌ధాన న్యాయ‌మూర్తిగా సీనియ‌ర్ న్యాయ‌మూర్తి జ‌స్టిస్ యు.యు.(ఉద‌య్ ఉమేశ్‌) ల‌లిత్ నియ‌మితులు కానున్నారు. ఆయ‌న పేరును ప్ర‌స్తుత సిజెఐ జ‌స్టిస్ ఎన్ వి ర‌మ‌ణ సిఫార్సు చేశారు. ఈ మేర‌కు ఆయ‌న న్యాయ‌శాఖ‌కు లేఖ రాశారు. ప్ర‌ధాన మంత్రి ప‌రిశీల‌న త‌ర్వాత రాష్ట్ర‌ప‌తికి చేరి అక్కడ‌ ఆమోదంతో నియామ‌క ఉత్త‌ర్వులు వెలువ‌డ‌నున్నాయి.

జ‌స్టిస్ ల‌లిత్ సుప్రీంకోర్టు 49వ ప్ర‌ధాన న్యాయ‌మూర్తిగా ఆగ‌స్టు 27వ తేదీన ప‌ద‌వీ బాధ్య‌త‌లు చేప‌ట్ట‌నున్నారు. ప్ర‌స్తుత సిజెఐ ర‌మ‌ణ ఈ నెల 26వ‌తేదీన ప‌ద‌వీ విర‌మ‌ణ చేయ‌నున్నారు. సుప్రీం కోర్టులోని న్యాయ‌మూర్తుల‌లో జ‌స్టిస్ ల‌లిత్ అత్యంత సీనియ‌ర్ న్యాయ‌మూర్తిగా ఉన్నారు. ఆయ‌న ఈ ప‌ద‌విలో 74 రోజుల పాటు (ఆయన పదవీకాలం 2022 నవంబర్‌ 8 వరకు) కొన‌సాగుతారు.

నవంబర్ 9, 1957న జన్మించిన జస్టిస్ లలిత్ జూన్ 1983లో న్యాయవాదిగా నమోదు చేసుకుని డిసెంబర్ 1985 వరకు బాంబే హైకోర్టులో ప్రాక్టీస్ చేశారు. జనవరి 1986లో తన ప్రాక్టీస్‌ను ఢిల్లీకి మార్చారు. ఏప్రిల్ 2004లో సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాదిగా నియమితుల‌య్యారు. ఈయన‌ న్యాయవాది నుండి నేరుగా సుప్రీంకోర్టు బెంచ్‌కు పదోన్నతి పొందిన రెండవ సిజెఐ అవుతారు. జనవరి 1971లో 13వ సిజెఐగా నియమితులైన జస్టిస్ ఎస్.ఎం. సిక్రీ, మార్చి 1964లో నేరుగా ఉన్నత న్యాయస్థానం బెంచ్‌కు వెళ్ళిన‌ మొదటి న్యాయవాది. జస్టిస్ లలిత్ ఆగస్టు 13, 2014న సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. అప్పటి నుంచి ఆయన సుప్రీం ధ‌ర్మాస‌నం ఇచ్చిన అనేక కీల‌క తీర్పులలో స‌భ్యుడిగా ఉన్నారు.

కీల‌క తీర్పులు

జ‌స్టిస్ ల‌లిత్ ప‌లు కీల‌క తీర్పులు వెలువ‌రించారు. ముస్లింల‌లో ట్రిపుల్ త‌లాఖ్ ద్వారా విడాకులు తీసుకోవడం చట్టవిరుద్ధమే గాక‌ రాజ్యాంగ విరుద్ధమైనదంటూ ఇచ్చిన సంచ‌ల‌న తీర్పుల‌తో పాటు అనేక మైలురాళ్ళ వంటి తీర్పులు ఇచ్చిన ధ‌ర్మాస‌నంలో జ‌స్టిస్ ల‌లిత్ స‌భ్యుడు. తిరువ‌నంత‌పురం లోని ప‌ద్మ‌నాభ‌స్వామి ఆల‌య నిర్వ‌హ‌ణ హ‌క్కులు అప్ప‌టి రాజ‌వంశీకుల‌కే ద‌క్కుతాయ‌ని తీర్పునిచ్చిన ధ‌ర్మాస‌నంలో కూడా జ‌స్టిస్ ల‌లిత్ స‌భ్యుడిగా ఉన్నారు.

పిల్లల శరీరంలోని లైంగిక భాగాలను తాకడం 'లైంగిక ఉద్దేశ్యంతో' సంబంధం ఉన్న చర్యేన‌ని దానిని 'లైంగిక వేధింపులు'గా పరిగణిస్తున్నట్లు, పోక్సో చ‌ట్టానికి ప‌దును బెడుతూ న్యాయమూర్తి యుయు లలిత్ నేతృత్వంలోని ధర్మాసనం తీర్పు చెప్పింది. పోక్సో చట్టం కింద రెండు కేసుల్లో బాంబే హైకోర్టు ఇచ్చిన వివాదాస్పద 'స్కిన్-టు-స్కిన్' తీర్పులను ధ‌ర్మాస‌నం కొట్టివేసింది.

ఇటీవ‌లే, స్కూలు పిల్ల‌లు ఉద‌యం 9 గంట‌ల‌కే స్కూలుకు వెళుతున్న‌ప్పుడు కోర్టులు ఎందుకు ముందుగానే ప‌ని ప్రారంభించ‌కూడ‌ద‌ని ప్ర‌శ్నించి సంచ‌ల‌నం క‌లిగించారు.

First Published:  4 Aug 2022 8:09 AM GMT
Next Story