Telugu Global
National

మోదీకి ఘాటు లేఖ.. ఏకమైన విపక్షాలు

జాతీయ రాజకీయాల్లో మోదీ వ్యతిరేక శక్తులు ఏకమవుతున్న సంకేతాలను ఈలేఖ పరోక్షంగా బీజేపీకి గుర్తు చేసింది. కేంద్రంలో బీజేపీని గద్దెదించే సమయం ఆసన్నమైందని, దానికి విపక్షాల ఐక్యతే నిదర్శనం అని చాటి చెప్పింది.

మోదీకి ఘాటు లేఖ.. ఏకమైన విపక్షాలు
X

కేంద్ర దర్యాప్తు సంస్థల దుర్వినియోగంపై 9మంది ప్రతిపక్ష నేతలు ఏకమై ప్రధాని మోదీకి ఘాటు లేఖ రాశారు. గతంలో కూడా చాలామంది మోదీకి ఇలాంటి రేఖలు రాసిన ఉదాహరణలున్నాయి. కానీ ఈలేఖ చాలా ప్రత్యేకం. జాతీయ రాజకీయాల్లో మోదీ వ్యతిరేక శక్తులు ఏకమవుతున్న సంకేతాలను ఈలేఖ పరోక్షంగా బీజేపీకి గుర్తు చేసింది. కేంద్రంలో బీజేపీని గద్దెదించే సమయం ఆసన్నమైందని, దానికి విపక్షాల ఐక్యతే నిదర్శనం అని చాటి చెప్పింది. కాంగ్రెస్ లేకపోయినా కూడా కూటమి కట్టే ధైర్యం మిగతా పార్టీలకు ఉందని నిరూపించింది.

లేఖను రాసింది ఎవరెవరంటే..?

జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని చూస్తున్న కేసీఆర్.. టీఆర్ఎస్ ని బీఆర్ఎస్ గా మార్చి బలమైన పునాది వేశారు. కానీ ఆయనతో కలసి వచ్చేవారెవరనేది ప్రశ్నార్థకంగా మారింది. తాము లేకపోతే విపక్ష కూటమికి అర్థమేలేదంటూ కాంగ్రెస్ వెటకారం చేస్తున్నా బీఆర్ఎస్ మాత్రం తన ప్రయత్నాలు మానుకోలేదు. దానికి తొలి ఫలితమే ఈ లేఖ. టీఎంసీ అధినేత్రి, పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ కూడా ఈ లేఖ వ్యవహారంలో విపక్షాలతో జతకలిశారు. ఆమ్ ఆద్మీ పార్టీ మొదటినుంచీ కేసీఆర్ తో సఖ్యతగానే ఉంది. ఆ పార్టీకి చెందిన ఇద్దరు ముఖ్యమంత్రులు కేజ్రీవాల్, భగవంత్ మన్ కూడా ఈ లేఖపై సంతకాలు చేశారు. జమ్మూ కాశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్ చీఫ్ ఫరూక్ అబ్దుల్లా, ఎన్సీపీ అధినేత శరద్ పవార్, ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్, మహారాష్ట్ర మాజీ సీఎం ఉద్ధవ్ ఠాక్రే, బీహార్ డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్ ఈ లేఖలో సంతకాలు చేశారు. పార్టీలపరంగా చూస్తే 8 మంది పార్టీ అధినేతలు ఇందులో ఉన్నారు. ఇది విపక్ష ఐక్యతకు సంకేతం అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.


లెటర్లో ఉన్న మేటర్ ఏంటి..?

కేంద్ర దర్యాప్తు సంస్థలను బీజేపీ ప్రభుత్వం ఎలా దుర్వినియోగం చేస్తోందో ఇందులో సోదాహరణంగా వివరించారు నేతలు. 2014 నుంచి బీజేపీ హయాంలో నమోదైన కేసుల్లో ఎక్కువ మంది ప్రతిపక్షాలకు చెందిన రాజకీయ నాయకులే బాధితులుగా ఉన్నారని లేఖలో పేర్కొన్నారు. ఆప్ నేత మనీష్ సిసోడియాని అరెస్ట్ చేయడం ప్రజాస్వామ్య విలువలకు తిలోదకాలివ్వడమేనన్నారు. ప్రభుత్వ స్కూళ్ల వ్యవహారంలో విప్లవాత్మక మార్పులు తెచ్చిన సిసోడియా గురించి ఇతర దేశాల నేతలకు కూడా తెలుసని, ఇప్పుడు వారు కూడా భారత ప్రజాస్వామ్యాన్ని పరిహాసం చేసే పరిస్థితి వచ్చిందన్నారు. లాలూ ప్రసాద్ యాదవ్, సంజయ్ రౌత్, అజాం ఖాన్, నవాబ్ మాలిక్, అనిల్ దేశ్ ముఖ్, అభిషేక్ బెనర్జీ.. ఇలా వివిధ పార్టీల నేతల్ని కేసుల పేరుతో కేంద్రం ఎలా వేధిస్తోందనే విషయం కూడా ప్రజలకు అర్థమవుతోందన్నారు.

బీజేపీలో చేరితే పునీతులా..?

వైరి వర్గాలను వేధించడం వెనక ఉన్న పరమార్థం వారందర్నీ బీజేపీలో చేర్చుకోవడమే కదా అని లేఖలో ప్రశ్నించారు విపక్ష నేతలు. అసోం సీఎం హిమంత బిశ్వశర్మ, సువేందు అధికారి, ముకుల్ రాయ్.. ఈడీ, సీబీఐ కేసులను ఎదుర్కొన్నారని, ఆ తర్వాత బీజేపీలో చేరి వారు పునీతులయ్యారని, ప్రస్తుతం వారిపై ఉన్న కేసుల్లో పురోగతి లేదని తెలిపారు.

గవర్నర్ వ్యవస్థను కూడా కేంద్రం తనకు అనుకూలంగా మలచుకుందని, తమ అజెండా అమలు చేసేవారినే గవర్నర్లుగా కేంద్రం నియమిస్తోందని, తమిళనాడు, మహారాష్ట్ర, పశ్చిమబెంగాల్, తెలంగాణ, పంజాబ్ సహా ఢిల్లీ లెఫ్ట్ నెంట్ గవర్నర్ల వ్యవహారం ఎలా ఉందో ప్రజలు గమనిస్తున్నారని చెప్పారు విపక్ష నేతలు. రాజకీయ వ్యవస్థలను కేంద్రం నిర్వీర్యం చేస్తోందన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రజల తీర్పుని కేంద్రం శిరసావహించాలని గుర్తు చేశారు. కేంద్రంలో అధికారంలో ఉన్నవారికి అనుకూలంగా లేని పార్టీలను ప్రజలు రాష్ట్రాల్లో ఎన్నుకుంటే, ఆయా ప్రభుత్వాలను గౌరవించాల్సిన బాధ్యత కేంద్రానికి ఉందన్నారు.

First Published:  5 March 2023 5:56 AM GMT
Next Story