Telugu Global
National

బీజేపీలో చేరతారా లేక బుల్డోజర్ తెప్పించాలా?... కాంగ్రెస్ నేతలకు బీజేపీ మంత్రి బెదిరింపులు

గుణ జిల్లాలోని రుథియాయ్ పట్టణంలో జరిగిన ఓ సమావేశంలో మధ్యప్రదేశ్ పంచాయితీ మంత్రి మహేంద్ర సింగ్ సిసోడియా మాట్లాడుతూ, ''ఎన్నికలకు ముందే కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలంతా బీజేపీలో చేరాలి. లేదంటే బుల్డోజర్లను ఎదుర్కోవాల్సి వస్తుంది'' అని హెచ్చరించారు.

బీజేపీలో చేరతారా లేక బుల్డోజర్ తెప్పించాలా?... కాంగ్రెస్ నేతలకు బీజేపీ మంత్రి బెదిరింపులు
X

ఉత్తరప్రదేశ్ లో ప్రారంభమైన బీజేపీ బుల్డోజర్ రాజ్యం బీజేపీ పాలిత రాష్ట్రాలన్నింటికీ విస్తరిస్తున్నది. బుల్డోజర్ పేరుతో తమకు నచ్చని వాళ్ళను బెదిరించడం, బుల్డోజర్ల బూచి చూపి తమ పార్టీలో చేర్చుకోవడం బీజేపీ నాయకులకు అలవాటుగా మారిపోయింది. యూపీలో మైనార్టీల ఇళ్ళను, తమకు నచ్చని వాళ్ళ ఇళ్ళను బుల్డోజర్లతో కూలగిట్టిస్తున్న ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ బాటలో నడవడానికి దేశవ్యాప్తంగా బీజేపీ నేతలు తహతహలాడుతున్నారు. మధ్య ప్రదేశ్ లో ఓ మంత్రి బహిరంగంగానే బుల్డోజర్ల పేరు చెప్పి కాంగ్రెస్ నాయకులను బెదిరించాడు.

గుణ జిల్లాలోని రుథియాయ్ పట్టణంలో జరిగిన ఓ సమావేశంలో మధ్యప్రదేశ్ పంచాయితీ మంత్రి మహేంద్ర సింగ్ సిసోడియా మాట్లాడుతూ, ''ఎన్నికలకు ముందే కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలంతా బీజేపీలో చేరాలి లేదంటే బుల్డోజర్లను ఎదుర్కోవాల్సి వస్తుంది'' అని హెచ్చరించారు.

''వచ్చే ఎన్నికల్లో కూడా బీజేపీయే గెలుస్తుంది. ఈ లోపు కాంగ్రెస్ వాళ్ళు మాపార్టీలో చేరకపోతే ఆ తర్వాత వాళ్ళ అంతు చూడడానికి మామ (ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్)బుల్డోజర్ సిద్దంగా ఉంటుంది.'' అని అన్నారా మంత్రి. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ను బీజేపీ నాయకులంతా "మామా" అని పిలుస్తారు.

కాగా మంత్రి మహేంద్ర సింగ్ సిసోడియా బెదిరింపులను కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండించింది. కాంగ్రెస్ నాయకులను భయపెట్టి బీజేపీలో బలవంతంగా చేర్చుకునే కుట్ర చేస్తున్నారని గుణ జిల్లా కాంగ్రెస్ చీఫ్ హరిశంకర్ విజయవర్గీయ ఆరోపించారు. "ఇప్పుడు జరుగుతున్న [రఘోఘర్ నగర్ సివిక్ బాడీ ] ఎన్నికలలో రాఘోఘర్ ప్రజలు ఆ మంత్రికి తగిన సమాధానం ఇస్తారు. " అని అతను అన్నాడు

ఏ చట్టమూ, నిబందనలూ పాటించకుండా తమకు నచ్చని వాళ్ళ మీద, తమను ప్రశ్నించిన వాళ్ళమీద ఏదో ఒక నేరం మోపి వాళ్ళ ఇళ్ళను బుల్డోజర్లతో కూలగొట్టడం యూపీ సర్కార్ ప్రారంభించింది. మధ్యప్రదేశ్ లో కూడా అలాంటి సంఘటనలు జరిగాయి.

ఇప్పటి వరకు నేరస్తుల ఇళ్ళను మాత్రమే కూలగొడుతున్నామని తమను తాము సమర్దించుకుంటున్న‌ బీజేపీ ఇప్పుడు ఏకంగా తమ పార్టీలో చేరకపోతే బుల్డోజర్లు ఉపయోగిస్తామని బెదిరించడాన్ని ఎలా సమర్దించుకుంటారో చూడాలి.


First Published:  20 Jan 2023 9:44 AM GMT
Next Story