Telugu Global
National

బీజేపీలో చేరండి పాపాలు కడిగేసుకోండి - త్రిపుర ముఖ్యమంత్రి పిలుపు

ఎన్నికల ప్రచారంలో భాగంగా దక్షిణ త్రిపురలోని కక్రాబన్‌లో జన్ విశ్వాస్ ర్యాలీలో భాగంగా జరిగిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి మాణిక్ సాహా ప్రసంగిస్తూ... బీజేపీలో చేరాలని వామపక్ష నేతలకు విజ్ఞప్తి చేశారు. అలా చేరడం వల్ల మీరు చేసిన పాపాలన్నీ పోతాయని చెప్పారు.

బీజేపీలో చేరండి పాపాలు కడిగేసుకోండి - త్రిపుర ముఖ్యమంత్రి పిలుపు
X

ఎన్నిపాపాలు చేసినా సరే బీజేపీలో చేరితే అవన్నీ కడిగేసుకపోతాయని త్రిపుర ముఖ్యమంత్రి మాణిక్ సాహా అన్నారు. బీజేపీ పవిత్ర గంగా నది లాంటిదని, పాపాలు పోగొట్టుకోవడానికి గంగానదిలో స్నానం చేసినట్టే బీజేపీలో చేరి మీరు చేసిన పాపాలన్ని తొలిగించుకోవాలని ఆయన అన్నారు.

ఎన్నికల ప్రచారంలో భాగంగా దక్షిణ త్రిపురలోని కక్రాబన్‌లో జన్ విశ్వాస్ ర్యాలీలో భాగంగా జరిగిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి మాణిక్ సాహా ప్రసంగిస్తూ... బీజేపీలో చేరాలని వామపక్ష నేతలకు విజ్ఞప్తి చేశారు. అలా చేరడం వల్ల మీరు చేసిన పాపాలన్నీ పోతాయని చెప్పారు.

ఈ ఏడాది జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ విజయం సాధించడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. స్టాలిన్, లెలిన్‌ల సిద్ధాంతాలను విశ్వసించే ప్రజలు గంగా నదిలాంటి బీజేపీలో చేరాలని ఆయన పిలుపునిచ్చారు.

బీజేపీ రైలులోని కంపార్ట్‌మెంట్లు ఇంకా ఖాళీగానే ఉన్నాయని, ఖాళీగా ఉన్న బోగీల్లో కూర్చోబెట్టి ప్రధాని నరేంద్ర మోదీ మనందరినీ గమ్యస్థానానికి తీసుకెళ్తారని చెప్పారు.

కమ్యూనిస్టుల హయాంలో హింస, ఉగ్రవాదం జడలు విప్పిందని, సీపీఎం హయాంలో హింస తప్ప ప్రజాస్వామ్యం లేదని మాణిక్ సాహా అన్నారు. వామపక్షాలు ప్రజల ప్రజాస్వామిక హక్కులను అణచివేసి ఏళ్ల తరబడి రాష్ట్రాన్ని పాలించారని ఆరోపించారు.

"దక్షిణ త్రిపుర జిల్లాలో, వామపక్ష పాలనలో 69 మంది ప్రతిపక్ష నాయకులను హత్య చేశారు, కక్రాబాన్ లో కూడా చాలా రాజకీయ హత్యలు జరిగాయి" అని అన్నారాయన.

కాగా బీజేపీలో చేరితే తప్పులన్నీ ఒప్పులైపోతాయని ముఖ్యమంత్రి మాట్లాడటం పట్ల తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఇప్పుడు బీజేపీలో ఉన్నవారంతా అలా నేరాలను మాఫీ చేసుకున్న నేరస్తులేనా అని ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నాయి.

First Published:  8 Jan 2023 1:26 PM GMT
Next Story