Telugu Global
National

ప్రధాని అభ్యర్థి నితీష్.. బీహార్ లో వెలసిన పోస్టర్లు

బీజేపీ ఓటమే లక్ష్యంగా విపక్షాల కూటమిని ఏర్పాటు చేసేందుకు మమతా బెనర్జీ, కేసీఆర్, నితీష్ కుమార్ వంటి నేతలు కొంతకాలంగా ప్రయత్నాలు చేస్తున్నారు.

ప్రధాని అభ్యర్థి నితీష్.. బీహార్ లో వెలసిన పోస్టర్లు
X

వచ్చే ఎన్నికల్లో విపక్షాల ప్రధానమంత్రి అభ్యర్థి బీహార్ ముఖ్యమంత్రి, జేడీయూ అధినేత నితీష్ కుమారే అని బీహార్ రాష్ట్రం పాట్నాలో పోస్టర్లు వెలిశాయి. ఒకవైపు తాను ప్రధానమంత్రి అభ్యర్థి కాదు అని ప్రకటించి విపక్షాలన్నింటినీ నితీష్ కుమార్ ఏకం చేసే పనిలో ఉండగా.. నితీషే ప్రధానమంత్రి అభ్యర్థి అని పోస్టర్లు వెలియడం సంచలనం సృష్టిస్తోంది. బీహార్ రాష్ట్ర రాజధాని పాట్నాలో ఉన్న జేడీయూ కార్యాలయం, దాని సమీప ప్రాంతాల్లో, నగరంలోని మరికొన్ని ప్రాంతాల్లో ప్రధానమంత్రి అభ్యర్థిగా నితీష్ అని పెద్ద పెద్ద పోస్టర్లు అతికించారు.

బీజేపీ ఓటమే లక్ష్యంగా విపక్షాల కూటమిని ఏర్పాటు చేసేందుకు మమతా బెనర్జీ, కేసీఆర్, నితీష్ కుమార్ వంటి నేతలు కొంతకాలంగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇటీవల నితీష్ కుమార్ విపక్షాలను ఏకం చేసేందుకు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. వరుసగా దేశంలోని అగ్రనేతలను కలుస్తున్నారు. ఇప్పటికే కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ను నితీష్ కుమార్ కలిసి చర్చలు జరిపారు.

త్వరలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సహా పలువురు పార్టీల నేతలను కలుసుకునేందుకు దేశవ్యాప్తంగా పర్యటించనున్నట్లు నితీష్ కుమార్ ప్రకటించారు. విపక్షాలన్నింటినీ ఏకం చేస్తున్నప్పటికీ తాను మాత్రం ప్రధానమంత్రి అభ్యర్థి రేసులో లేనని నితీష్ ఇటీవలే స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో పాట్నాలో విపక్షాల ప్రధానమంత్రి అభ్యర్థి నితీషే అని పోస్టర్లు వెలియడం కలకలం రేపుతోంది.

అయితే ఈ పోస్టర్లు అతికించింది ఎవరన్నది మాత్రం తెలియడం లేదు. విపక్షాల కూటమిలో మమతా బెనర్జీ, కేసీఆర్, శరద్ పవార్.. కేసీఆర్‌ ప్రధానమంత్రి పదవిని ఆశిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో నితీష్ ప్రధానమంత్రి అభ్యర్థి అని పోస్టర్లు వెలియడం వెనుక బీజేపీ హస్తం ఉండొచ్చన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. విపక్షాల ఐక్యతను చెడగొట్టడానికే ఈ పోస్టర్లు అంటించి ఉంటారన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

Next Story