Telugu Global
National

మోదీ హయాం.. ఎమర్జెన్సీకంటే ఘోరం..

ఆర్టికల్ 370 రద్దు చేసిన తర్వాత కాశ్మీర్ లోయలో నిరసనలు కనిపించడం లేదని ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటోందని, కానీ నిఘా వల్ల ఎవరూ గొంతు తెరవలేకపోతున్నారని వాస్తవాన్ని మరుగున పెట్టి పైకి అంతా బాగుందని ప్రచారం చేసుకుంటున్నారని అన్నారు ముఫ్తీ.

మోదీ హయాం.. ఎమర్జెన్సీకంటే ఘోరం..
X

భారత ప్రజాస్వామ్యంలో చీకటి రోజులు అంటే ఎమర్జెన్సీ కాలాన్నే అందరూ గుర్తు చేసుకుంటారు. కానీ ఇప్పుడు అంతకు మించిన ఘోరమైన పరిస్థితులున్నాయని అంటున్నారు జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి మొహబూబా ముఫ్తీ. ఎమర్జెన్సీ టైమ్ లో ప్రధానమంత్రిని సైతం పదవినుంచి దింపివేసే శక్తి న్యాయవ్యవస్థకు ఉండేదని, కానీ ఇప్పుడు కనీసం ఓ ఎమ్మెల్యేని సైతం ఎవరూ ఏమీ చేయలేని దుస్థితి నెలకొందని అన్నారు. దీనంతటకీ కారణం బీజేపీ ప్రభుత్వమేనంటూ మండిపడ్డారామె.

రైతులకు పరిహారమేది..?

నల్ల చట్టాల రద్దుకోసం పోరాటం చేసిన రైతులు చివరకు న్యాయవ్యవస్థ నుంచి కూడా పరిహారం పొందలేకపోయారని, వారికి ఉపశమనం లేకుండానే ప్రభుత్వం గిమ్మిక్కులు చేసిందని ఆరోపించారు మొహబూబా ముఫ్తీ. దేశంలోని అన్ని సమస్యలకు బీజేపీ ప్రభుత్వమే కారణం అని అన్నారామె.

కాశ్మీర్ లో కిరాతకం..

జమ్మూ కాశ్మీర్ ప్రత్యేక ప్రతిపత్తిని కేంద్రంలోని బీజేపీ సర్కారు నాశనం చేసిందని మండిపడ్డారు మొహబూబా ముఫ్తీ. రాజ్యాంగ విరుద్ధంగా తమ హక్కుల్ని కాలరాశారని, తమ జీవితాలను నాశనం చేశారన్నారు. అధికార పీఠం నుంచి, ప్రజల మనసుల నుంచి దూరం పెద్దగా లేదని ఆనాడు మోదీ చెప్పారని, కానీ ఆ దూరం తగ్గించేందుకు ఆయన బుల్డోజర్లను ఎంచుకున్నారని ఆరోపించారు.

జమ్మూ కాశ్మీర్ లో మెజారీటీ ప్రజలను ఆక్రమణదారులుగా ప్రభుత్వం భావిస్తోందని, ఇది దారుణమైన పరిస్థితులకు దారితీస్తోందని అన్నారు మొహబూబా ముఫ్తీ. 2019కి ముందు ఉన్న ఏ చట్టాలను కేంద్రం గౌరవించడం లేదన్నారు. ముందుగా కేంద్రం తమ భూమిని లాగేసుకుందని, ఆ తర్వాత తమ ఉద్యోగాలను కూడా తీసేసుకుందని, ఇప్పుడు తమ ఇళ్లను కూడా కూల్చేస్తోందని ఆరోపించారామె. శ్రీనగర్ లాంటి ప్రాంతాల్లో ఆక్రమణదారులు మహా అయితే పదుల సంఖ్యలో ఉంటారని, కానీ.. అందరినీ ఆక్రమణదారులుగా చూపిస్తూ వారిని తరిమేస్తున్నారని చెప్పారు. సొంత ఊరిలో స్థానికుల్ని బిచ్చగాళ్లుగా మార్చేస్తున్నారని అన్నారు. జనాభా నిష్పత్తిలో మార్పులు తెచ్చేందుకు బయటి వ్యక్తుల రాకపోకలను సులభతరం చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని, ఇది చాలా ప్రమాదకరమైన కుట్ర అని అన్నారామె.

ఆర్టికల్ 370 రద్దు తర్వాత పరిస్థితి ఇలా..

ఆగస్టు 2019 లో ఆర్టికల్ 370 ని రద్దు చేసిన తర్వాత కాశ్మీర్ లోయలో నిరసనలు కనిపించడం లేదని ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటోందని, కానీ నిఘా వల్ల ఎవరూ గొంతు తెరవలేకపోతున్నారని వాస్తవాన్ని మరుగున పెట్టి పైకి అంతా బాగుందని ప్రచారం చేసుకుంటున్నారని అన్నారు ముఫ్తీ. కనీసం ఇంటి నాలుగు గోడల మధ్య కూడా మాట్లాడుకునే స్వాతంత్రం కాశ్మీర్ ప్రజలు కోల్పోయారని అన్నారు. ఎవరైనా దగ్గితే, పోలీసులు వచ్చి నోటికి ప్లాస్టర్ అంటించి మరీ దగ్గడం లేదని రుజువు చేస్తున్నారని, దగ్గు వినిపించకపోయినా ఆ మనిషి ప్రాణం పోతుందని అన్నారు.

కాశ్మీర్ లో నిజంగానే పరిస్థితి బాగుంటే పండిట్లు ఎందుకు వలస వెళ్తారని ప్రశ్మించారు ముఫ్తీ. 30 ఏళ్ల తర్వాత పండిట్లు ఇప్పుడు కాశ్మీర్ లోయను వదిలిపెట్టి వెళ్తున్నారని, అత్యంత దుర్భర పరిస్థితుల్లో కూడా ఇక్కడే ఉన్నవారంతా ఇప్పుడు నిరంకుశ విధానాలతో మరింత ఇబ్బంది పడుతున్నారన చెప్పారు. స్థానిక విద్యార్థులకు విద్యను అందించే జమాతే ఇస్లామీ సంస్థ ఆస్తులను కూడా జప్తు చేశారని ఈడీ, ఎన్ఐఏ దాడులతో కాశ్మీర్ అల్లకల్లోలంగా మారిందన్నారు. కాశ్మీర్ సమస్య ఎప్పటికీ పరిష్కారం కాకుండా ఉండేందుకు బీజేపీ కుట్రలు పన్నుతోందని ఆరోపించారు. పత్రికల్ని గుప్పెట్లో పెట్టుకున్నారని, పౌర సమాజాన్ని హింసిస్తున్నారని అన్నారు.

First Published:  12 Feb 2023 5:59 AM GMT
Next Story