Telugu Global
National

జల్ జీవన్ మిషన్ ఒక బోగస్.. యూపీలో అట్టర్ ఫ్లాపైన పథకం

2024 చివరికల్లా దేశంలోని ప్రతీ ఇంటికి పైపుల ద్వారా మంచి నీటిని అందించాలనే లక్ష్యంతో రూ.3.6 లక్షల కోట్ల వ్యయంతో కేంద్రంలోని మోడీ ప్రభుత్వం జల్ జీవన్ మిషన్ పథకాన్ని ప్రారంభించింది.

జల్ జీవన్ మిషన్ ఒక బోగస్.. యూపీలో అట్టర్ ఫ్లాపైన పథకం
X

'తెలంగాణ అనుసరిస్తుంది.. దేశం ఆచరిస్తుంది' అని సీఎం కేసీఆర్ పలు పథకాలు గురించి గొప్పగా చెబుతారు. నిజంగానే దేశంలోని పలు రాష్ట్రాలు తెలంగాణ పథకాలను మెచ్చకున్నాయి. కేంద్రంలోనీ బీజేపీ సర్కార్ కూడా కేసీఆర్ పథకాలను కాపీ కొడుతోంది. అయితే కాపీ కొడితే కొట్టారు కానీ.. అది బాధ్యతలో నెరవేర్చాలనే సోయి లేకుండా పోయింది. తెలంగాణలో ఇంటింటికి మంచి నీటిని అందించాలనే లక్ష్యంతో సీఎం కేసీఆర్ మిషన్ భగీరథ పథకాన్ని ప్రారంభించారు. శుద్ది చేసిన నీటిని పైపుల ద్వారా ఇప్పుడు 100 శాతం ఇళ్లకు తెలంగాణ ప్రభుత్వం సరఫరా చేస్తోంది. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఇదే పథకాన్ని 'జల్ జీవన్ మిషన్' పేరుతో కాపీ కొట్టింది. హర్ ఘర్ జల్ నినాదంతో జల్ జీవన్ మిషన్‌ను అమలు చేస్తోంది.

2024 చివరికల్లా దేశంలోని ప్రతీ ఇంటికి పైపుల ద్వారా మంచి నీటిని అందించాలనే లక్ష్యంతో రూ.3.6 లక్షల కోట్ల వ్యయంతో కేంద్రంలోని మోడీ ప్రభుత్వం జల్ జీవన్ మిషన్ పథకాన్ని ప్రారంభించింది. 2019 ఆగస్టు 15న ఉత్తర్‌ప్రదేశ్‌లోని మహోబా జిల్లాలో ఈ పథకాన్ని ప్రారంభించే నాటికి 1,612 ఇళ్లకు మాత్రమే మంచి నీటి కనెక్షన్లు ఉన్నాయి. కానీ నాలుగేళ్లు తిరిగే సరికి జిల్లా వ్యాప్తంగా 1,29,209 ఇళ్లకు మంచి నీటి కనెక్షన్లు ఇచ్చామని చెప్పింది. జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో 98 శాతం గృహాలకు పైపుల ద్వారా మంచి నీటి సరఫరాను చేస్తున్నట్లు జల్ జీవన్ మిషన్ పబ్లిక్ డాష్‌బోర్డులో పేర్కొన్నది.

దేశంలోని ఏ జిల్లాలో కూడా జల్ జీవన్ మిషన్‌లో భాగంగా ఇంత తక్కువ సమయంలో ఇంటింటికీ పంపు కనెక్షన్లు ఇవ్వలేదు. దీంతో కొంత మంది జర్నలిస్టులు క్షేత్రస్థాయిలో పరిశీలనకు వెళ్లారు. జల్ జీవన్ మిషన్ ఏయే ఇళ్లకు అయితే 'కనెక్టెడ్' అని డ్యాష్ బోర్డు ధ్రువీకరించిందో.. అసలు ఆయా ఇళ్లకు పంపు కనెక్షన్లే లేవని తేలింది. యూపీలోని పలు గ్రామాల్లో కూడా 100 శాతం మంచి నీటి పంపులు ఉన్నట్లు పేర్కొన్నారు. ఫంక్షనల్ హౌస్‌హోల్డ్ ట్యాప్ కనెక్షన్స్ (ఎఫ్‌హెచ్‌టీసీ)గా ఆయా ఇళ్లను డ్యాష్ బోర్డులో పేర్కొన్నారు.

ఆయా గ్రామాల్లో ఇళ్లకు అసలు పంపు కనెక్షన్లే లేవు. కొన్ని ఇళ్లకు కనెక్షన్లు ఏర్పాటు చేసినా వాటిలో నీళ్లే రావవడం లేదు. మరి కొన్ని ఇళ్లకు మాత్రం అడపాదడపా ఒక గంట నుంచి రెండు గంటల మేర నీళ్లు వదులుతున్నారు. జల్ జీవన్ మిషన్ ద్వారా ప్రతీ వ్యక్తికి 55 లీటర్ల మేర నీళ్లను ప్రతీ రోజు అందించాలి. కానీ వాస్తవంగా అన్ని నీళ్లు రావడం లేదని గ్రామాల్లోని ప్రజలు చెబుతున్నారు.

జల్ జీవన్ మిషన్ అధికారిక వెబ్ సైట్లో యూపీలోని మహోబా జిల్లాలోని 385 గ్రామాల్లో 100 శాతం పంపు కనెక్షన్లు ఇచ్చామని.. 24 గంటల పాటు ఆయా గృహాలకు నీళ్లు వస్తున్నాయని పేర్కొన్నారు. అయితే 100 గ్రామాల్లో మాత్రమే పూర్తి స్థాయిలో పంపు కనెక్షన్లు ఇచ్చి నీళ్లు ఇస్తున్నట్లు తెలుస్తున్నది. అది కూడా రోజుకు రెండు మూడు గంటలు మాత్రమే ఇస్తున్నారు.

2019లో యూపీ వ్యాప్తంగా 5.1 లక్షల ఇళ్లకు నీటి కనెక్షన్లు ఉన్నాయి. జల్ జీవన్ మిషన్ ద్వారా 1.6 కోట్ల ఇళ్లకు నీళ్లు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అలా ఒక్కో గ్రామాన్ని 100 శాతం పంపు కనెక్షన్లు ఉన్న గ్రామాలుగా ప్రకటిస్తూ వస్తున్నారు. కానీ క్షేత్ర స్థాయిలో వాస్తవ పరిస్థితి పూర్తి విరుద్దంగా ఉన్నదని జర్నలిస్టుల పరిశీలనలో వెల్లడైంది. మొత్తానికి డబుల్ ఇంజన్ సర్కారు అని చెప్పుకుంటున్న యూపీ ప్రభుత్వం.. పైకి కాగితాలపై మాత్రమే పంపు కనెక్షన్లు ఇస్తున్నదని స్పష్టంగా తెలుస్తున్నది. ఆ రాష్ట్రంలో జల్ జీవన్ మిషన్ పెద్ద బోగస్ అని జర్నలిస్టుల పరిశీలనలో వెల్లడైంది.

First Published:  18 Sep 2023 5:40 AM GMT
Next Story