Telugu Global
National

వీఐపీల విలాసాలు తీహార్ జైల్లో మామూలే - జైలు మాజీ అధికారి గుప్తా

ఆప్ ఢిల్లీ మంత్రి సత్యేందర్ జైన్ తన జైలు గదిలో మసాజ్‌లు చేయించుకుంటున్నట్లు వీడియోలు వ‌చ్చిన‌ నేపథ్యంలో, తీహార్ జైలు మాజీ న్యాయ అధికారి దీనిపై స్పందిస్తూ, "చట్టవిరుద్ధమైన" పద్ధతులు అక్కడ "సాధారణం" అని పేర్కొన్నారు.

వీఐపీల విలాసాలు తీహార్ జైల్లో మామూలే - జైలు మాజీ అధికారి గుప్తా
X

సంఘంలో ప‌లుకుబ‌డి, డ‌బ్బు, హోదా క‌లిగిన వ్య‌క్తుల‌కు తీహార్ జైలులో ల‌భించ‌ని సేవ‌లు లేవ‌ని, ఆప్ మంత్రి స‌త్యేంద‌ర్ జైన్ మ‌సాజ్ చేయించుకుంటున్న వీడియో పెద్ద విశేష‌మేమీ కాద‌ని, ఆ జైలు మాజీ అధికారి సునీల్ గుప్తా తెలిపారు. 1981 నుంచి 2016 వరకు తీహార్‌లో లా ఆఫీసర్‌గా పనిచేసిన సునీల్ గుప్తా PTI తో మాట్లాడుతూ.. అత్యున్నత, శక్తివంతమైన వ్యక్తుల‌కు తీహారు జైలు ప్రాంగణంలో అధికారుల నుంచే అన్ని ర‌కాల చ‌ట్ట‌విరుద్ధ సౌక‌ర్యాలు అందుతాయ‌ని వెల్ల‌డించారు. చివ‌ర‌కు వారి లైంగిక వాంఛ‌లు కూడా జైల్లో తీర్చుకునేవార‌ని వెల్ల‌డించారు. త‌న హ‌యాంలో ఇలాంటి వీవీఐపీ ఖైదీలు త‌మ‌కు సెక్స్ ఫెసిలిటీ కావాల‌ని అడిగార‌ని, వాటితో పోలిస్తే, స‌త్యేంద‌ర్ జైన్ మ‌సాజ్ చేయించుకోవ‌డం పెద్ద వింతేమీ కాద‌న్నారు.

ఆప్ ఢిల్లీ మంత్రి సత్యేందర్ జైన్ తన జైలు గదిలో మసాజ్‌లు చేయించుకుంటున్నట్లు వీడియోలు వ‌చ్చిన‌ నేపథ్యంలో, తీహార్ జైలు మాజీ న్యాయ అధికారి దీనిపై స్పందిస్తూ, "చట్టవిరుద్ధమైన" పద్ధతులు అక్కడ "సాధారణం" అని పేర్కొన్నారు. పదవీ విరమణ చేసిన ఒక సంవత్సరం తర్వాత, సునీల్ గుప్తా బ్లాక్ వారెంట్ అనే పుస్తకాన్ని రాశారు, ఈ పుస్త‌కంలో ఆయ‌న తీహార్ జైల్లో శక్తివంతమైన ఖైదీలు జైలు నియ‌మాల‌ను, చ‌ట్టాల‌ను ఉల్లంఘిస్తూ "విలాసవంతమైన" జీవితాలను ఎలా గడిపారో హైలైట్ చేశారు. డ‌బ్బు, ఉద్యోగాలు, ఉపాధి ఆశ చూపించి, అక్క‌డి సాధార‌ణ‌, పేద ఖైదీల‌ను వారి సేవ‌ల కోసం వాడుకుంటార‌ని కూడా గుప్తా ఈ పుస్త‌కంలో రాసుకున్నారు.

సంజయ్ సూరి వర్సెస్ ఢిల్లీ అడ్మినిస్ట్రేషన్ కేసులో 1987 నాటి సుప్రీంకోర్టు తీర్పు లో తీహార్ జైల్లో బాల నేర‌స్తుల‌ను ఎలా లైంగిక వేధింపులకు గురిచేశారో తెలియ‌జేసింద‌ని, గుప్తా గుర్తు చేశారు. నిందితుడుగా ఉన్న స‌త్యేంద‌ర్ జైన్ మ‌సాజ్ చేయించుకోవాలంటే, జైలు ప్రాంగ‌ణంలో ప్ర‌త్యేక ఫిజియోథెర‌ఫీ వార్డులు ఉన్నాయ‌ని, కానీ అత‌ను సెల్‌లో ఫిజియోథెరఫీ చేయించుకోవ‌డం నిబంధ‌న‌ల‌కు విరుద్ధ‌మ‌న్నారు. అయిన‌ప్ప‌టికీ స‌త్యేంద‌ర్ జైన్ వైరల్ వీడియో త‌న‌ను ఆశ్చర్యపరచలేద‌ని, ఎందుకంటే తీహార్‌ జైలులో జరుగుతున్న చట్టవిరుద్ధ కార్యకలాపాలలో ఇది సాధారణం అని గుప్తా అభిప్రాయపడ్డాడు.

మంత్రులు, వ్యాపారవేత్తలు, పారిశ్రామికవేత్తలను సంతృప్తి పరచడానికి నిబంధనలను గాలికి వ‌దిలేయ‌డం తీహార్ జైల్లో త‌న హ‌యాంలో ఎన్నో చూశాన‌ని చెప్పుకొచ్చారు. 1993-1995 మధ్య కాలంలో తీహార్ జైలు డీజీగా పనిచేసిన పుదుచ్చేరి మాజీ లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్ బేడీ దీనిపై మాట్లాడుతూ.. త‌న హ‌యాంలో కూడా అవినీతి, లైంగిక నేరాలకు సంబంధించిన అన్ని రకాల ఫిర్యాదులు అందాయని, తక్షణమే వాటిపై చర్యలు తీసుకున్నామని తెలిపారు.

జైన్‌పై మనీలాండరింగ్ ఆరోపణలపై విచారణలో భాగంగా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఈ వీడియోలను లీక్ చేసిందని ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) ఆరోపించింది. మంత్రి వెన్నెముక‌ గాయానికి ఫిజియోథెరపీ మాత్ర‌మే చేయించుకున్నారని ఆమ్ అద్మీ పార్టీ పేర్కొంది. బీజేపీ రాజ‌కీయ ల‌బ్ధి కోస‌మే ఇలాంటి చిల్ల‌ర ఆరోప‌ణ‌లు చేస్తోంద‌ని ఆరోపించింది.

First Published:  24 Nov 2022 7:20 AM GMT
Next Story