Telugu Global
National

దేశంలోనే ధనిక సీఎం జగన్..

దేశవ్యాప్తంగా ఉన్న 30 మంది ముఖ్యమంత్రుల అందరి ఉమ్మడి ఆస్తి విలువ రూ.1,018.86 కోట్లు కాగా, అందులో 50.09 శాతం ఆస్తులు ఒక్క జగన్‌ దగ్గరే ఉండటం విశేషం.

దేశంలోనే ధనిక సీఎం జగన్..
X

దేశంలోని అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రుల్లో అత్యంత ఎక్కువ ఆస్తి ఉన్న సీఎం గా జగన్ రికార్డ్ సృష్టించారు. మిగతావారి అందరి ఆస్తి కలిపినా ఆయన కంటే ఎక్కువ లేకపోవడం మరో విశేషం. ప్రస్తుతం వివిధ రాష్ట్రాలకు నేతృత్వం వహిస్తున్న 30 మంది ముఖ్యమంత్రుల ఎన్నికల అఫిడవిట్ల ఆధారంగా అసోసియేషన్‌ ఆఫ్‌ డెమొక్రటిక్‌ రీఫామ్స్‌ (ADR), నేషనల్‌ ఎలక్షన్‌ వాచ్‌ (NEW) సంస్థలు ఈ వివరాలు వెల్లడించాయి. ఇవేవీ పరిశోధించి ప్రచురించిన అంశాలు కావు, ఎన్నికల అఫిడవిట్లో ఉన్న వివరాలే ఓ లిస్ట్ తీసి బయటపెట్టారు. అయితే ఆ లిస్ట్ లో జగన్ టాప్ ప్లేస్ లో ఉండటం ఇప్పుడు ఏపీలో చర్చనీయాంశంగా మారింది.

జగన్ ఆస్తి ఎంత..?

ఎన్నికల అఫిడవిట్లో పేర్కొన్నట్టుగా ఏపీ సీఎం జగన్ ఆస్తి రూ.510.38 కోట్లు. ఇందులో రూ.443 కోట్ల చరాస్తులు, మిగతావి స్థిరాస్తులు. జగన్‌ తర్వాత అరుణాచల్‌ ప్రదేశ్‌ సీఎం ఫెమా ఖండూ రూ.163 కోట్లు ఆస్తితో రెండో స్థానంలో ఉన్నారు. ఆ తర్వాత ఒడిశా సీఎం నవీన్‌ పట్నాయక్‌ రూ.63 కోట్ల ఆస్తిపరుడిగా మూడో స్థానంలో నిలబడ్డారు. తెలంగాణ సీఎం కేసీఆర్ ఆస్తి విలువ ఆయన 2018లో సమర్పించిన అఫిడవిట్ ప్రకారం రూ.23.55 కోట్లు. అయితే ఇందులో 8.8 కోట్ల రూపాయలు ఆయనకు అప్పులే మిగిలాయి. పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఆస్తి కేవలం 15 లక్షల రూపాయలు మాత్రమే. మమత కంటే ముందు కేరళ సీఎం పినరయి విజయన్ 1.18 కోట్ల రూపాయల ఆస్తితో కింది నుంచి రెండో స్థానంలో ఉన్నారు. హర్యానా సీఎం మనోహర్‌ లాల్‌ ఖట్టర్‌ ఆస్తి విలువ రూ.1.27 కోట్లు.

దేశవ్యాప్తంగా ఉన్న 30 మంది ముఖ్యమంత్రుల అందరి ఆస్తుల ఉమ్మడి విలువ రూ.1,018.86 కోట్లు కాగా, అందులో 50.09 శాతం ఆస్తులు ఒక్క జగన్‌ దగ్గరే ఉండటం విశేషం. మిగతా 29 మంది సీఎంల ఆస్తులు కలిపితే దాని విలువ రూ.508 కోట్లు కాగా, ఒక్క జగన్ ఆస్తి రూ.510.38 కోట్లు.

ఇక ముఖ్యమంత్రుల డిగ్రీ వ్యవహారాలు లెక్క తీస్తే 30మందిలో 11మంది డిగ్రీ చదివారు. వీరిలో 9మంది పీజీ కూడా పూర్తి చేశారు. ఇంటర్ చదివినవారు ముగ్గురు ఉన్నారు. ఒకప్పటి గుజరాత్ సీఎం, ప్రస్తుత‌ ప్రధాని మోదీ కూడా డిగ్రీ చదివారని ఆయన ఎన్నికల అఫిడవిట్ లో ఉన్నా కూడా ఆయన డిగ్రీ సర్టిఫికెట్ మాత్రం సస్పెన్స్ గా మారింది. ఆ సర్టిఫికెట్ అడిగిన కేజ్రీవాల్ కి కోర్టు జరిమానా విధించింది. అయితే ఇప్పుడు లిస్ట్ లో ఉన్న ముఖ్యమంత్రుల్లో డిగ్రీ చదివామని చెబుతున్నవారంతా తమ సర్టిఫికెట్లు చూపించగలరని తెలుస్తోంది.

First Published:  13 April 2023 12:03 AM GMT
Next Story