Telugu Global
National

సర్వే పేరుతో కొనసాగుతున్న ఐటీ సోదాలు.. సైలెంట్ గా కేంద్రం

ఐటీ అధికారులకు ఉద్యోగులు సహకరించాలని, వారు అడిగిన ప్రశ్నలకు సమగ్రంగా సమాధానం ఇవ్వాలని తమ సిబ్బందికి బీబీసీ ఇ-మెయిల్స్ పంపించినట్టు తెలుస్తోంది.

సర్వే పేరుతో కొనసాగుతున్న ఐటీ సోదాలు.. సైలెంట్ గా కేంద్రం
X

ఢిల్లీ, ముంబైలో ఉన్న బీబీసీ కార్యాలయాల్లో రెండోరోజు కూడా ఐటీ అధికారులు సోదాలు చేపట్టారు. అయితే దీన్ని వారు కేవలం సర్వేగా చెబుతున్నారు. ఆర్థిక లావాదేవీలకు సంబంధించి కొన్ని డాక్యుమెంట్లు, కంప్యూటర్లో ఉన్న డేటాను స్వాధీనం చేసుకున్నారు. బీబీసీలోని ఆర్థిక, ఇతర విభాగాల సిబ్బందితో ఐటీ అధికారులు మాట్లాడుతున్నారు. జర్నలిస్ట్ లను షిఫ్ట్ అయిపోయాక ఇంటికి వెళ్లేందుకు అనుమతించారు, ఆర్థిక విభాగం అధికారులను మాత్రం పలు ప్రశ్నలు వేసి సమాధానాలు రాబట్టారు.

ప్రసారాలకు అంతరాయం ఉండదు..

భారత్ లో సోషల్ మీడియా ద్వారా బీబీసీ ప్రసారాలను అందిస్తోంది. ప్రస్తుత సోదాలతో తమ ప్రసారాలకు అంతరాయం ఉండదని తెలిపింది బీబీసీ యాజమాన్యం. ఐటీ అధికారులకు ఉద్యోగులు సహకరించాలని, వారు అడిగిన ప్రశ్నలకు సమగ్రంగా సమాధానం ఇవ్వాలని తమ సిబ్బందికి ఇ-మెయిల్స్ పంపించినట్టు తెలుస్తోంది. బీబీసీ నుంచి వస్తున్న జీతం గురించి అడిగిన ప్రశ్నలకు బదులివ్వాలని, వారి వ్యక్తిగత ఆదాయం గురించి చెప్పడం చెప్పకపోవడం వారి ఇష్టం అని తెలిపింది. అయితే ఈ సోదాల గురించి మాత్రం ఉద్యోగులెవరూ సోషల్ మీడియాలో కామెంట్లు చేయొద్దని స్పష్టం చేసింది.

విపక్షాల విమర్శలు..

జి-20 సమావేశాలకు భారత్ ఆతిథ్యం ఇస్తున్న తరుణంలో ఇలాంటి ఐటీ దాడుల ద్వారా మోదీ సర్కారు మన దేశ ప్రతిష్టను దిగజారుస్తోందని అంటున్నారు కాంగ్రెస్ నేతలు. ఐటీ సోదాలను రాజకీయ ప్రతీకార దాడులుగా అభివర్ణించారు పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ. బీఆర్ఎస్ పార్టీ కూడా కేంద్ర దర్యాప్తు సంస్థలను అడ్డు పెట్టుకుని మోదీ సర్కారు రాజకీయ కక్షసాధింపు చర్యలకు పాల్పడుతోందని విమర్శించింది.

అమెరికా స్పందన ఏంటంటే..?

బీబీసీ కార్యాలయంలో ఐటీ సర్వేపై అమెరికా స్పందించింది. భారత్‌ సహా ప్రపంచవ్యాప్తంగా స్వేచ్ఛాయుత మీడియాకు, ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేసే చర్యలకు మద్దతు ఇస్తున్నామని అమెరికా విదేశీ వ్యవహారాల శాఖ అధికార ప్రతినిధి నెడ్‌ ప్రైస్‌ తెలిపారు. అయితే ఐటీ దాడులు ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధంగా జరిగాయా అనే ప్రశ్నకు మాత్రం ఆయన సమాధానం దాటవేశారు.

First Published:  16 Feb 2023 12:07 AM GMT
Next Story