Telugu Global
National

కోలీవుడ్ నిర్మాతల ఇళ్ళు, ఆఫీసులపై ఐటీ అధికారుల ఆకస్మిక దాడులు

పలువురు కోలీవుడ్ నిర్మాతలకు ఇన్ కం టాక్స్ అధికారులు షాక్ ఇచ్చారు. జ్ఞానవేల్ రాజా,థాను,అంబుచెళియన్,త్యాగరాజన్ , ఎస్.ఆర్.ప్రభు తదితరుల ఇళ్ళు, కార్యాలయాలపై ఐటీ శాఖ దాడులు నిర్వహించింది.

కోలీవుడ్  నిర్మాతల ఇళ్ళు, ఆఫీసులపై ఐటీ అధికారుల ఆకస్మిక దాడులు
X

తమిళ సినీ నిర్మాతల ఇళ్ళు, ఆఫీసులపై ఐటీ అధికారులు ఆకస్మిక దాడులు చేశారు. మంగళవారం చెన్నై సహా కాంచీపురం, తిరువళ్ళూరు, వెల్లూరు, మదురై తదితర జిల్లాలతో బాటు 40 లొకేషన్లలో ఈ రైడ్స్ జరగడం విశేషం. స్టూడియో గ్రీన్ అధినేత జ్ఞానవేల్ రాజా, వీ క్రియేషన్స్-థాను, గోపురం ఫిలిమ్స్ అంబుచెళియన్, సత్యజ్యోతి ఫిలిమ్స్ త్యాగరాజన్ , డ్రీమ్ వారియర్స్-ఎస్.ఆర్.ప్రభు తదితర ప్రొడ్యూసర్లు వీరిలో ఉన్నారు. సుమారు 150 మందికి పైగా ఐటీ అధికారులు ఏక కాలంలో ఉదయం ఆరున్నర గంటల నుంచే సోదాలు ప్రారంభించారు. ఈ నిర్మాతల్లో చాలామంది పన్నులు ఎగగొట్టారన్న సమాచారం అందడంతో వీరు దాడులకు పూనుకొన్నారు. అంబు చెళియన్ ఇంటిపై రైడ్ జరగడం ఇది రెండోసారి.

2020 ఫిబ్రవరిలో ఈయన ఇళ్ళు, కార్యాలయాలపై జరిగిన దాడిలో లెక్కల్లో చూపని దాదాపు 77 కోట్ల రూపాయలను కనుగొన్నారు. ఈయన పలు సినిమాలకు ఫైనాన్షియర్ కూడా.. తాజాగా కొందరు డిస్ట్రిబ్యూటర్ల ఇళ్లలోనూ ఆదాయపు పన్ను శాఖ సిబ్బంది దాడులు చేశారు.లోగడ తమిళనాడు వ్యాప్తంగా 38 లొకేషన్లలో సినీరంగానికి చెందిన అనేకమంది ప్రముఖుల ఇళ్లలో సోదాలు జరిగాయి. వీరిలో నటుడు విజయ్ కూడా ఉన్నారు. 2020 లో 'బిగిల్' మూవీ ఇతనికి, అంబుచెళియన్ కి కోట్లలో కాసుల వర్షం కురిపించింది. అప్పట్లోనే 300 కోట్లకుపైగా ఈ మూవీ వసూళ్లను సాధించిందట. ఏయే బడా నిర్మాతలు పన్ను ఎగగొట్టారో వారి వివరాల తాలూకు రిపోర్టును ఐటీ శాఖ విడుదల చేసింది.





First Published:  2 Aug 2022 9:12 AM GMT
Next Story