Telugu Global
National

బీబీసీపై ఐటీ దాడులు.. సర్వే అంటున్న అధికారులు

ఢిల్లీ, ముంబైలోని బీబీసీ కార్యాలయాల్లో ఈరోజు ఆదాయపు పన్ను శాఖ అధికారుల బృందం సోదాలు నిర్వహించింది. ఉద్యోగుల మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకుని ఇంటికి వెళ్లాలని ఐటీ అధికారులు ఆదేశించారు.

బీబీసీపై ఐటీ దాడులు.. సర్వే అంటున్న అధికారులు
X

ప్రధాని నరేంద్రమోదీపై బీబీసీ ప్రసారం చేసిన డాక్యుమెంటరీ వివాదం తర్వాత ఢిల్లీలోని ఆ సంస్థ కార్యాలయంపై ఐటీ అధికారుల దాడి సంచలనంగా మారింది. తనకు నచ్చనివారిపైకి, తనను వ్యతిరేకించేవారిపైకి ఈడీ, ఐటీ, సీబీఐని ఉసిగొల్పడం మోదీకి రివాజు అనే ఆరోపణకు బీబీసీ ఆఫీస్ లో జరిగిన తాజా ఐటీ సోదాలు మరింత బలాన్ని చేకూరుస్తున్నాయి. కేవలం డాక్యుమెంటరీ వల్లే కక్షకట్టి మరీ బీబీసీపైకి ఐటీని వదిలారని అంటున్నారు.

ఢిల్లీ, ముంబైలోని బీబీసీ కార్యాలయాల్లో ఈరోజు ఆదాయపు పన్ను శాఖ అధికారుల బృందం సోదాలు నిర్వహించింది. ఉద్యోగుల మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకుని ఇంటికి వెళ్లాలని ఐటీ అధికారులు ఆదేశించారు. 60 నుంచి 70 మంది సభ్యుల బృందం బీబీసీ కార్యాలయాలకు చేరుకుని సోదాలు నిర్వహించినట్టు తెలుస్తోంది. ఉద్యోగులందరి ఫోన్లు ఐటీ అధికారుల స్వాధీనంలో ఉండగా.. ఆఫీస్ లోకి ఇతరులను రానివ్వలేదని అంటున్నారు. ఢిల్లీలోని బీబీసీ కార్యాలయంలో ఐటీ అధికారులు కీలక డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు.

బీబీసీ క్వశ్చన్ –మోదీ ఆన్సర్..

2002 గుజరాత్ అల్లర్ల నేపథ్యంలో అప్పటి ఆ రాష్ట్ర సీఎం నరేంద్ర మోదీ పాత్రపై బీబీసీ ‘ఇండియా: ది మోదీ క్వశ్చన్’ అనే డాక్యుమెంటరీ రూపొందించింది. దీనిపై బీజేపీ తీవ్ర అభ్యంతరం తెలిపింది. అయితే బీబీసీ నేరుగా దీన్ని మన ఛానెల్స్ లో ప్రసారం చేయలేదు. సోషల్ మీడియాలో ఉన్న ఈ డాక్యుమెంటరీని ప్రభుత్వం తొలగించింది. వివిధ ప్రాంతాల్లో ఆ డాక్యుమెంటరీ ప్రదర్శనను కూడా మోదీ భక్తులు అడ్డుకున్నారు. భారత్ లో బీబీసీని నిషేధించాలని హిందూ సేన చీఫ్ విష్ణుగుప్తా సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఆ పిటిషన్‌ ను విచారించిన సుప్రీంకోర్టు నిషేధాన్ని తిరస్కరించింది. ఇంతలోనే ఇలా ఐటీ రైడ్స్ మొదలయ్యాయి.

ఈడీకి బోడీకి బీబీసీ భయపడదు, అదేమైనా జీ న్యూసా అంటూ ఇటీవల తెలంగాణ సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు కూడా వైరల్ గా మారిన సంగతి తెలిసిందే. అయితే మోదీ మాత్రం అనుకున్నంత పని చేశారు. బీబీసీపైకి కూడా ఐటీని వదిలారు. బీబీసీ ఐటీ దాడులను కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండించింది. మోదీపై డాక్యుమెంటరీకి ప్రతిఫలంగానే ఈ దాడులు జరిగాయని విమర్శిస్తున్నారు కాంగ్రెస్ నేతలు. ఇది అప్రకటిత ఎమర్జెన్సీ అని మండిపడ్డారు. అయితే ఇది కేవలం సర్వే అని.. సోదాలు కాదని ఐటీ అధికారులు వెల్లడించారు. పన్నుల అవకతవకల ఆరోపణలపై ఈ సర్వే నిర్వహిస్తున్నట్లు చెప్పారు.

First Published:  14 Feb 2023 8:19 AM GMT
Next Story