Telugu Global
National

మేడిన్ ఇండియ‌న్ బ్రౌజ‌ర్ పోటీ.. మీరు సిద్ధ‌మా?

మ‌న సొంత వెబ్‌బ్రౌజ‌ర్ త‌యారు చేయ‌డానికి సూక్ష్మ‌, చిన్న‌, మ‌ధ్య త‌ర‌హా ప‌రిశ్ర‌మ‌లు, స్టార్టప్‌లు, ఎల్‌ఎల్‌పీలను ఎంఈఐటీ ఆహ్వానిస్తోంది. వ్య‌క్తులు కూడా సొంతంగా ఈ పోటీలో పాల్గొన‌వ‌చ్చు.

మేడిన్ ఇండియ‌న్ బ్రౌజ‌ర్ పోటీ.. మీరు సిద్ధ‌మా?
X

గూగుల్‌, బింగ్, స‌ఫారీ, ఒపెరా.. ఇన్ని బ్రౌజ‌ర్లున్నా ఇందులో ఒక్క‌టి కూడా మ‌న సొంతం కాదు. అన్నీ విదేశాల‌వే. ఇంట‌ర్నెట్ సేవ‌ల్లో దూసుకుపోతూ.. ఇంట‌ర్నెట్ ఆఫ్ థింగ్స్ ఆవిష్క‌ర‌ణ‌ల్లోనూ పోటీకి సిద్ధం అంటున్న భార‌త్‌కు సొంత బ్రౌజ‌ర్ లేక‌పోవ‌డం ఏమిటి? అందుకే కేంద్ర ఎల‌క్ట్రానిక్స్ అండ్ ఇన్ఫ‌ర్మేష‌న్ టెక్నాల‌జీ మంత్రిత్వ శాఖ(ఎంఈఐటీ) మ‌న సొంత బ్రౌజ‌ర్ త‌యారు చేయ‌డానికి ఓ పోటీ నిర్వ‌హిస్తోంది.

ఇండియ‌న్ వెబ్ బ్రౌజ‌ర్ ఛాలెంజ్‌

మ‌న సొంత వెబ్‌బ్రౌజ‌ర్ త‌యారు చేయ‌డానికి సూక్ష్మ‌, చిన్న‌, మ‌ధ్య త‌ర‌హా ప‌రిశ్ర‌మ‌లు, స్టార్టప్‌లు, ఎల్‌ఎల్‌పీలను ఎంఈఐటీ ఆహ్వానిస్తోంది. వ్య‌క్తులు కూడా సొంతంగా ఈ పోటీలో పాల్గొన‌వ‌చ్చు. అయితే ముగ్గురు లేదా ఐదుగురు వ్య‌క్తులు గ్రూప్‌గా ఏర్ప‌డి ఈ పోటీలో పాల్గొన‌వ‌చ్చ‌ని చెప్పింది. ఈ పోటీలో పాల్గొంటే న‌గ‌దు బ‌హుమ‌తులే కాదు ఇండియాకు సొంత బ్రౌజర్ త‌యారుచేసి ఇచ్చిన సంస్థ‌/ వ్య‌క్తిగా మీ పేరు నిలిచిపోతుంద‌ని ప్ర‌క‌టించింది.

మూడు ద‌శ‌ల్లో పోటీ.. 3.4 కోట్ల ప్రైజ్ మ‌నీ

ఈ ఛాలెంజ్ మూడు ద‌శ‌ల్లో ఉంటుంది. మొత్తం 3.4 కోట్ల రూపాయ‌ల ప్రైజ్ మ‌నీ కేటాయించారు.

* మొద‌టి స్టేజ్‌లో ఐడియేష‌న్‌. మీ ఆలోచ‌న సిద్ధం చేసి చెప్ప‌డానికి 2 నెల‌ల స‌మ‌యం ఇస్తారు. 18 మందిని ఎంపిక చేసి, ఒక్కొక్క‌రికి రూ.2 ల‌క్ష‌ల న‌గ‌దు బ‌హుమ‌తి ఇస్తారు.

* రెండో స్టేజ్‌లో ప్రోటో టైప్ త‌యారు చేయాలి. దీనికి మూడు నెల‌ల స‌మ‌యం ఇస్తారు. మొత్తం 8 మందిని లేదా సంస్థ‌లను ఎంపిక చేసి ఒక్కొక్క‌రికి రూ.10 ల‌క్ష‌లు అంద‌జేస్తారు.

* మూడోది, చివ‌రిది.. లాస్ట్ స్టేజ్ డెవ‌ల‌ప్‌మెంట్‌. దీనికి 7 నెల‌ల టైమ్ ఇస్తారు. ఇందులో కేవ‌లం మూడు బహుమ‌తులే ఉంటాయి. మొద‌టి బ‌హుమ‌తి రూ.కోటి, రెండో బ‌హుమ‌తి రూ.75 ల‌క్ష‌లు, మూడో బ‌హుమ‌తి రూ.50 ల‌క్ష‌లు.

First Published:  13 Aug 2023 6:20 AM GMT
Next Story