Telugu Global
National

అధికారంలోకి రావ‌డం కాంగ్రెస్‌ ఉద్దేశం కాదు.. - విప‌క్షాల భేటీలో ఖ‌ర్గే

బీజేపీ ఎన్నిక‌ల్లో ఓట్ల కోసం మిత్రపక్షాలతో కలిసి పనిచేసి, అధికారంలోకి వచ్చిన తర్వాత వారిని వదిలేస్తుందని ఖ‌ర్గే ఆరోపించారు.

అధికారంలోకి రావ‌డం కాంగ్రెస్‌ ఉద్దేశం కాదు.. - విప‌క్షాల భేటీలో ఖ‌ర్గే
X

అధికారంలోకి రావడం కాంగ్రెస్‌ ఉద్దేశం కాదని, కేవలం రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని, లౌకికత్వాన్ని, సామాజిక న్యాయాన్ని పరిరక్షించడమే తమ ధ్యేయమని కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షుడు మ‌ల్లికార్జున్‌ ఖ‌ర్గే తెలిపారు. అధికారంపై లేదా ప్ర‌ధాని ప‌ద‌విపై త‌మ‌కు ఆస‌క్తి లేద‌ని ఆయ‌న తెలిపారు. మంగ‌ళ‌వారం బెంగళూరులో జ‌రుగుతున్న విప‌క్షాల భేటీ రెండోరోజు స‌మావేశంలో ఆయ‌న ప్రారంభోప‌న్యాసం చేశారు.

రాష్ట్రస్థాయిలో కాంగ్రెస్ పార్టీలో కొన్ని విభేదాలున్న మాట వాస్తవమేన‌ని.. కానీ, అవి సిద్ధాంతరపరమైనవి కావని గుర్తించాలని ఖ‌ర్గే చెప్పారు. ఇవేవీ దేశం ఎదుర్కొంటున్న సమస్యల ముందు పెద్ద విషయాలు కావని ఆయ‌న తెలిపారు. విప‌క్షాల భేటీకి 26 పార్టీలు హాజ‌రుకాగా, 11 రాష్ట్రాల్లో విప‌క్షాలు అధికారంలో ఉన్నాయ‌ని ఆయ‌న గుర్తుచేశారు.

బీజేపీ ఎన్నిక‌ల్లో ఓట్ల కోసం మిత్రపక్షాలతో కలిసి పనిచేసి, అధికారంలోకి వచ్చిన తర్వాత వారిని వదిలేస్తుందని ఖ‌ర్గే ఆరోపించారు. బీజేపీ సొంతంగా 303 సీట్లు సాధించ‌లేద‌ని ఈ సంద‌ర్భంగా ఆయ‌న స్ప‌ష్టం చేశారు. ఇప్పుడు ఆ పార్టీ అధ్య‌క్షుడితో పాటు ప‌లువురు నేత‌లు పాత మిత్రుల కోసం వివిధ రాష్ట్రాల్లో ప‌రుగులు పెడుతున్నార‌ని విమ‌ర్శించారు.

First Published:  18 July 2023 9:30 AM GMT
Next Story