Telugu Global
National

అది మోదీ వేసే ముష్టి కాదు, భారతీయుల హక్కు..

ఉచితంగా బియ్యం ఇస్తున్నారు కానీ మోదీ తన జేబులో నుంచి ఇవ్వట్లేదు కదా. మరి రేషన్ షాపుల ముందు మోదీ బొమ్మెందుకు పెట్టాలి, ఫ్లెక్సీ ఎందుకు కట్టాలి. ఆర్థిక మంత్రికి ఆమాత్రం లాజిక్ తెలియకుండా పోయిందా..?

అది మోదీ వేసే ముష్టి కాదు, భారతీయుల హక్కు..
X

"ఏయ్ ఐఏఎస్.. మోదీ ఉచితంగా బియ్యం ఇస్తున్నాడు, రేషన్ షాపు ముందు ఆయన ఫొటో లేదేంటి..?" ఇదీ తాజాగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చేసిన హెచ్చరిక. అయినా ఇదెక్కడి న్యాయం, ఈ బెదిరింపులేంటి..? ప్రజలకేమైనా మోదీ బిచ్చమేస్తున్నాడా..? లేదా మోదీ జేబులో నుంచి ఏమైనా బియ్యానికి డబ్బులు ఇస్తున్నాడా..? ప్రజలు కష్టపడి సంపాదించిన సొమ్ముతో పన్నులు కడితే, ఆ పన్నుల్లో రాష్ట్రాలు కేంద్రానికి వాటా ఇస్తే, ఆ వాటాలో విదిలింపులే తిరిగి రాష్ట్రాలకు చేరుతున్నాయి. అందుకే ఉచితంగా బియ్యం ఇస్తున్నారు కానీ మోదీ తన జేబులో నుంచి ఇవ్వట్లేదు కదా. మరి రేషన్ షాపుల ముందు మోదీ బొమ్మెందుకు పెట్టాలి, ఫ్లెక్సీ ఎందుకు కట్టాలి. ఆర్థిక మంత్రికి ఆమాత్రం లాజిక్ తెలియకుండా పోయిందా..?

ఆహారం హక్కు..

భారతీయ రాజ్యాంగం ప్రకారం ఆహారం మన ప్రాథమిక హక్కు. ఆర్టికల్-32 ద్వారా దీనికి న్యాయస్థానాల నుంచి కూడా రక్షణ ఉంది. అంటే రేషన్ షాపుల ద్వారా బియ్యం ఇవ్వడం అనేది ప్రభుత్వాలు మనపై దయతో చేసే పని కాదు, వారి బాధ్యత, ప్రజల హక్కు. కానీ ఆ హక్కు కోసం కూడా మనం ప్రాధేయపడాలా. బియ్యం ఇస్తున్నందుకు ప్రభుత్వాలు అంత బిల్డప్ ఇవ్వాలా.. ప్రతి మెతుకు మీదా తినే వాడి పేరు రాసుంటుంద‌ని అంటారు కానీ, మోదీ పేరు కాదు. ఈ సూక్ష్మం విత్త మంత్రి ఎప్పుడు తెలుసుకుంటారో..?

మోదీ ముందు మోదీ తర్వాత కూడా..

మోదీ ఒక్కడే దేశానికి ప్రధాని కాలేదు, మోదీకి ముందు కూడా చాలామంది పనిచేశారు, మోదీ తర్వాత కూడా ఇంకా చాలామంది వస్తారు. కానీ కేవలం మోదీని మాత్రమే దేశోద్ధారకుడిలాగా చూడాలంటారు బీజేపీ నేతలు. అంతకు ముందు పనిచేసిన ప్రధానుల గొప్పేమీ లేదన్నట్టు చెబుతుంటారు. మోదీ వచ్చిన తర్వాతే దేశంలో ప్రజలకు రేషన్ సరకులు అందిస్తున్నట్టు, ఉచిత బియ్యం ఇస్తున్నట్టు బిల్డప్ ఇవ్వాలని చూస్తున్నారు. డబుల్ ఇంజిన్ సర్కార్ అంటూ గొప్పలు చెప్పుకుంటున్న ఏ బీజేపీ పాలిత రాష్ట్రంలో కూడా మోదీ ఫ్లెక్సీలు పెట్టి బియ్యం పంపిణీ చేయరు. మోదీ బొమ్మలు పెట్టి ప్రచారం చేసుకోరు. మరి తెలంగాణలో కేంద్ర మంత్రి హల్ చల్ చేయడం దేనికి సంకేతం. నిర్మలమ్మ చిందులు తొక్కడాన్ని మీడియా సర్కస్‌గా సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు నెటిజన్లు. ప్రధాని ఫొటో లేదని చెప్పడం చీప్ వ్యవహారమే కాదు, రాజ్యాంగ విరుద్ధం కూడా అని అంటున్నారు.

First Published:  2 Sep 2022 10:41 AM GMT
Next Story