Telugu Global
National

పశువులను రైళ్లు ఢీకొనడం మామూలే.. రైల్వే శాఖ వింత వివరణ

ఈ ఘటనలపై తీవ్ర విమర్శలు వస్తున్న వేళ, రైల్వే శాఖ నుంచి ఓ ఆసక్తికర వివరణ వచ్చింది. కేంద్రం తన తప్పుల్ని కవర్ చేసుకోవ‌డానికి పడిన తాపత్రయం ఈ వివరణలో స్పష్టంగా కనిపిస్తుంది.

పశువులను రైళ్లు ఢీకొనడం మామూలే.. రైల్వే శాఖ వింత వివరణ
X

వందే భారత్ రైలు ప్రయాణం మొదలైందంటే.. గమ్యస్థానం చేరే లోపు ఏదో ఒక ప్రమాదం గ్యారెంటీ అనే ప్రచారం జోరుగా సాగుతోంది. పశువులను ఢీకొట్టడం, మధ్యలోనే ఆగిపోవడం ఇటీవల ఈ సెమీ హైస్పీడ్ రైలుకి అలవాటుగా మారింది. అందులోనూ ప్రధాని మోదీ అట్టహాసంగా ఈ రైళ్లను ప్రారంభించడంతో ఈ ప్రమాదాలు మరింత హైలెట్ అవుతున్నాయి. ఈ ఘటనలపై తీవ్ర విమర్శలు వస్తున్న వేళ, రైల్వే శాఖ నుంచి ఓ ఆసక్తికర వివరణ వచ్చింది. కేంద్రం తన తప్పుల్ని కవర్ చేసుకోవ‌డానికి పడిన తాపత్రయం ఈ వివరణలో స్పష్టంగా కనిపిస్తుంది.

వందేభారత్ ఒక్కటే కాదు..

వందేభారత్ రైలుకి మాత్రమే ఈ సమస్య లేదని, నార్త్ సెంట్రల్ రైల్వే జోన్ పరిధిలో ఇలాంటి ప్రమాదాలు పరిపాటేనంటూ రైల్వే శాఖ గణాంకాలు బయటపెట్టింది. దేశవ్యాప్తంగా పట్టాలపైకి పశువులు రావడం సహజమేనని తెలిపారు అధికారులు. అక్టోబర్ నెల 1నుంచి 10వ‌ తేదీలోపు దేశవ్యాప్తంగా 200 ఘటనల్లో పశువులను రైళ్లు ఢీ కొట్టాయని రైల్వేశాఖ ఉన్నతాధికారులు వెల్లడించారు. ఈ ఏడాదిలో ఇప్పటి వరకు ఇలాంటి ఘటనలు 4,000 వరకు జరిగాయని వివరించారు. 2020-21 మధ్యలో దేశవ్యాప్తంగా 26 వేల ప్రమాదాలు జరిగాయని తెలిపారు. వందేభారత్ విషయంలో మూడుసార్లు ఈ ఘటనలు జరిగాయని చెప్పారు.

తప్పు మాది కాదు..

ఇలాంటి ప్రమాదాల్లో తప్పు రైల్వేశాఖది ఎంతమాత్రం కాదని చెప్పారు రైల్వే శాఖ అధికారి అమితాబ్ శర్మ. తరచూ ప్రమాదాలు జరిగే ప్రాంతాలను గుర్తించి.. ట్రాక్‌ కు ఇరువైపులా బారికేడ్లు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. కొన్ని ప్రాంతాల్లో 40శాతం మేర పనులు పూర్తయ్యాయని చెప్పారు. దారి పొడవునా ఇలాంటి నిర్మాణాలు చేపట్టడం వ్యయంతో కూడుకున్న పని అని అన్నారు. ట్రాక్‌ కి ఒకవైపు ఇళ్లు.. మరోవైపు డెయిరీఫాంలు ఉన్న ప్రదేశాల్లో ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయని తమ సర్వేలో తేలినట్టు చెప్పారు. పట్టాలకు ఇరువైపులా ఫెన్సింగ్‌ ఏర్పాటు చేసినా, కొంతమంది అక్రమంగా దారి చేసుకుంటున్నారని, దానివల్ల మూగజీవాలు చనిపోతున్నాయని అన్నారు.

వందేభారత్ సంగతేంటి..?

వందే భారత్ రైళ్లపై వస్తున్న విమర్శలపై కూడా రైల్వే శాఖ స్పందించింది. పశువులు ఢీకొన్నా ఎలాంటి నష్టం లేకుండా వందే భారత్ రైలింజన్ ముందు భాగం గట్టి ఫైబర్ తో తయారు చేశామని చెప్పారు అమితాబ్ శర్మ. ఒక వేళ ముందుభాగం దెబ్బతిన్నా మరమ్మతులకు 15వేల రూపాయల లోపే ఖర్చవుతుందని అన్నారు. అయితే పశువుల వల్ల జరిగిన ప్రమాదాలతో కొన్నిసార్లు రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయని, ఇంకొన్ని సార్లు పూర్తిగా రైళ్లను రద్దు చేయాల్సి వస్తోందన్నారు.

First Published:  31 Oct 2022 2:31 AM GMT
Next Story