Telugu Global
National

ప్రతిపక్షాల ఐక్యతకిది పరీక్షా సమయం

ఆనాడు ఇందిరాగాంధీ సమ్మోహకశక్తి, ఆమె వ్యూహాత్మక రాజకీయ చతురత కారణంగా కాంగ్రెస్‌కు తిరుగులేదనే పరిస్థితి వుండేది. అలాంటి సంక్లిష్ట సమయంలోనూ ప్రతిపక్షాలు ఐక్యమై ఇందిరను గద్దెదించాయి.

ప్రతిపక్షాల ఐక్యతకిది పరీక్షా సమయం
X

రాహుల్‌గాంధీపై అనర్హత వేటును ఖండిస్తూ సకల ప్రతిపక్షాలు సంఘటితమై నిరసన తెలపడం సానుకూల పరిణామం. ప్రతిపక్షాల ఐక్యతకు సంబంధించి శుభసూచకం. ఎందుకంటే మొన్న మొన్నటివరకు దూరంగా ఉన్న తృణమూల్‌ కాంగ్రెస్‌ కూడా కాంగ్రెస్‌ ఏర్పాటు చేసిన సమావేశానికి తన ప్రతినిధులని పంపింది. అలాగే బీఆర్ఎస్‌, ఆప్‌ ప్రతినిధులు కూడా సమావేశానికి హాజరు కావడమే కాదు, నల్లజెండాల ప్రదర్శనలో పాల్గొన్నారు. దీనికి కృతజ్ఞతలు తెలిపిన కాంగ్రెస్‌ ఇకముందు వ్యూహాత్మకంగా వ్యవహరించడం అవసరం. శనివారం ప్రెస్‌మీట్‌లో వీరసావర్కర్‌ పేరును రాహుల్‌ గాంధీ ప్రస్తావించడం వ్యూహాత్మక తప్పిదం. బీజేపీకి వ్యతిరేకంగా కలిసివచ్చే శివసేనను ఇది ఇబ్బంది పెట్టే అంశం. అందుకని మాటల్లో, చేతల్లో జాగ్రత్తగా, నేర్పుగా వ్యవహరించడం కాంగ్రెస్‌ నేతల మీద వుంది.

రాహుల్‌ను పార్లమెంటులోకి అడుగుపెట్టకుండా చేయడం మోదీ పాలన నిరంకుశ పోకడలకు పరాకాష్ట. ఎమర్జెన్సీ నాటి పరిస్థితులను తలపింపజేసే ఘటన. అయితే ఇందిరాగాంధీకి వ్యతిరేకంగా 1977లో సకల ప్రతిపక్షాలు (సిపిఐ మినహా) ఏకమై ఆమెను గద్దె దించడంలో సఫలమయ్యాయి. 2023లో పరిస్థితి అలా కనిపించడం లేదు. 1977లో జయప్రకాశ్‌ నారాయణ వంటి నేత కాంగ్రెసేతర పక్షాలను ఏకం చేయడంలో కీలకపాత్ర పోషించారు. ఇప్పుడు ఇలా అందరికీ ఆమోదయోగ్యమైన నాయకుడు లేకపోవడం ఓ పరిమితి. అలాగే ఆనాడు మొరార్జీ దేశాయ్‌, చరణ్‌సింగ్‌, యంగ్‌టర్క్‌ చంద్రశేఖర్‌, జార్జి ఫెర్నాండెజ్‌, రాజ్‌నారాయణ్‌, జనసంఘ్‌ నేతలు వాజ్‌పేయి, అద్వానీ, యువనేతలుగా ఉన్న ములాయం, లాలూ ప్రసాద్‌ యాదవ్‌, రాంవిలాస్‌ పాశ్వన్‌ పోషించిన పాత్ర చెప్పుకోదగింది.

ఆనాడు ఇందిరాగాంధీ సమ్మోహకశక్తి, ఆమె వ్యూహాత్మక రాజకీయ చతురత కారణంగా కాంగ్రెస్‌కు తిరుగులేదనే పరిస్థితి వుండేది. అలాంటి సంక్లిష్ట సమయంలోనూ ప్రతిపక్షాలు ఐక్యమై ఇందిరను గద్దెదించాయి. ఇప్పుడు సకల వ్యవస్థల్లోకి ఆక్టోపస్‌లా చొరబడి ఆక్రమించిన కాషాయ పరివారపు శ్రేణుల ముందు ప్రతిపక్షాలు కిమ్మనలేని పరిస్థితి ఓ వాస్తవం. ప్రతిపక్షాల మధ్యన ఉన్న వైరుధ్యాలను తనకు అనువుగా ఉపయోగించుకుంటూ బీజేపీ-బీ పార్టీలుగా కొన్నిటిని తయారుచేసుకునే వ్యూహాన్ని అనుసరించింది సంఘ్‌ పరివార్‌. నయానా భయనా వినకపోతే రాహుల్‌కు పట్టిన గతే ఇతరులకు పడుతుందని రాహుల్‌పై అనర్హత వేటు ద్వారా హెచ్చరించింది.

ఈ పరిణామం బీజేపీ తీరుపై మెతకగా వ్యవహరించిన తృణమూల్‌ కాంగ్రెస్‌, ఆప్‌, సమాజ్‌వాదీ పార్టీలను కంగుతినేలా చేసింది. బీజేపీని నమ్మి దగ్గరయిన పార్టీలను కబళించకుండా ఉంటుందనే గ్యారంటీ లేదు. మహారాష్ట్రలో శివసేన ప్రభుత్వాన్ని పడగొట్టిన తీరే ఇందుకు తార్కాణం. సైద్ధాంతికంగా బీజేపీకి సన్నిహితంగా ఉండే పార్టీ అది. అయినప్పటికీ ఉపేక్షించలేదు. ఇక ఉత్తరప్రదేశ్‌లో మాయావతి నాయకత్వంలోని బీఎస్‌పీని నామమాత్రం చేయడంలో బీజేపీ వ్యూహం ఫలించింది. బీహార్‌లో గత అసెంబ్లీ ఎన్నికల్లో నితీష్‌కుమార్‌ పార్టీని బలహీనపరిచింది. పంజాబ్‌లో బీజేపీతో అంటకాగిన అకాలీదళ్‌ నీరసించింది. కనుకనే బీజేపీతో సఖ్యతగా ఉన్నంత మాత్రాన ప్రాంతీయ పార్టీల ఉనికి భద్రంగా ఉంటుందన్న హామీ లేదు. ఈ నేపథ్యంలో బీజేపీ యేతర పక్షాలన్నీ ఏకమై నిలిస్తే తప్ప 2024 ఎన్నికలలో బీజేపీని ఎదుర్కోవడం సాధ్యం కాదు. తాత్కాలికంగా తమ స్వీయ ప్రయోజనాలని పక్కన పెట్టి ఏకం కావాలన్న దృష్టి లేకపోతే అనేక ప్రాంతీయ పార్టీల అస్తిత్వానికే ముప్పు వాటిల్లనుంది.

1977 సంవత్సరంలో తమలోని వైరుధ్యాల్ని మరచి ఇందిరాగాంధీని గద్దె దించే ఏజెండాతో కాంగ్రెసేతర పక్షాలు కలసికట్టుగా పనిచేశాయి. ఇప్పుడు ఆ దృశ్యం కనిపించడం లేదు. అసలు శత్రువును వదిలేసి అధికారంలో లేని కాంగ్రెస్‌ మీద కారాలు మిరియాలు నూరే సమాజ్‌వాదీ, తృణమూల్‌ వంటి పార్టీల తీరు ప్రతిపక్షాల ఐక్యతకు విఘాతం. రాహుల్‌పై అనర్హత వేటు మీద కలసివచ్చిన టీఎంసీ, మొత్తంగా ప్రతిపక్షాల ఐక్యతకు అనువుగా నడుచుకుంటుందా అన్నది సందేహాస్పదం. మోదీ పాలనకు వ్యతిరేకంగా బీజేపీయేతర పక్షాలన్నీ ఏకం కావాల్సిన పరిస్థితులయితే నెలకొన్నాయి. ప్రజలలోనూ బీజేపీ పాలన మీద వ్యతిరేకత పెరుగుతుంది. ప్రత్యామ్నాయం కోసం జనాలు చూస్తున్నారు. ఈ నేపథ్యాన ప్రతిపక్షాల ప్రాప్తకాలజ్ఞత, రాజకీయ విజ్ఞత ప్రధానం. రాబోయే రోజుల్లో ఏ పార్టీ ఎలా వ్యవహరిస్తుందన్నదే కీలకం.

First Published:  27 March 2023 12:05 PM GMT
Next Story